04-03-2025 12:38:14 AM
మహదేవపూర్, మార్చి 3 (విజయ క్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వద్దఇసుక లభ్యత, అనుమతుల కొరకు ప్రతిపాదనలు ఇవ్వడం, నూతన రీలు ఏర్పాటు, ఇసుక అక్రమ రవాణా నియంత్రణ వంటి అంశాలపై రెవెన్యూ, మైనింగ్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పటిష్టమైన పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. నూతన ఇసుక రీచ్‌ల ఏర్పాటుకుప్రతిపాదనలు పంపాలని జిల్లా స్థాయి ఇసుక కమిటి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
అక్రమ రవాణా జరిగినట్లయితే వాహనాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఇసుక అక్రమంగా తరలిస్తే, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, మైనింగ్ ఎడి జయరాజు, టిజిఎండిసి పిఓ శ్రీకాంత్, డిపిఓ నారాయణ రావు , ఇరిగేషన్ ఈ ఈలు పరశురాం, యాదగిరి, తిరుపతి, ఆర్డిఓ రవి, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.