calender_icon.png 28 December, 2024 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంచలన కేసుల్లో సాగదీత

04-07-2024 03:24:51 AM

  • సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉన్నా ఫలితం సున్నా 
  • రాజకీయ ఒత్తిళ్లా? లేదా అలస్వతమా! 
  • ఇద్దరు సీఐలకు సవాలుగా రెండు కేసులు

వనపర్తి, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణ పోలీసు వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అమితంగా ఉన్నా వనపర్తి జిల్లాలో జరిగిన రెండు కేసుల విషయంలో మాత్రం నెలలు గడిచినా ఫలితం కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలుగా మారిన పెబ్బేర్ మార్కెట్‌యార్డు అగ్ని ప్రమాద కేసును కొత్తకోట సీఐ రాంబాబు, చిన్నం బావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో జరిగిన శ్రీధర్‌రెడ్డి హత్య కేసును వనపర్తి సీఐ నాగభూషణరావు దర్యాప్తు చేపట్టారు. కానీ ఇప్పటి వరకు ఛేదింలేదు. దీని వెనక రాజకీయ ఒత్తిళ్లా లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పెబ్బేర్ అగ్ని ప్రమాదంపై తేలని విచారణ

వనపర్తి జిల్లా పెబ్బేర్ మార్కెట్ యార్డు గోదాంలో దాదాపు రూ.10 కోట్ల మేర విలువ గల 12.83 లక్షల గన్ని బ్యాగులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు, కలెక్టర్, ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతినిథులు అక్కడికి చేరుకుని ఇందుకు కారణమైన ఎవరినీ విడిచిపెట్టేది లేదని త్వరితగతిన కేసును చేధిస్తామన్నారు. పెబ్బేర్ మండల ఎస్‌ఐ హరిప్రసాద్,  కొత్తకోట సీఐ రాంబాబు దర్యాప్తు ప్రారంభించి నేటికి 90 రోజులు పూర్తి కావస్తున్నా కొలిక్కి రాలేదు.

ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నష్టం జరిగిన కేసు చేధన కాకపోవడంతో అటు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఇటు పోలీసులపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయేమోనన్న అనుమానాలకు తావిస్తున్నది. పౌరసరఫరాల శాఖలోని కొందరు అధికారులు, మిల్లర్ల ముసుగులో కొందరు రాజకీయ నాయకులు ఈ ఘటనకు కారకులుగా ఉన్నారని పెబ్బేర్ పట్టణ ప్రజలు గుసగుసలాడుతున్నారు. 

కొలిక్కిరాని శ్రీధర్‌రెడ్డి హత్య కేసు

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో మే 23న శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి అత్యంత కిరాతంగా హత్యకు గురయ్యాడు. బీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇది రాజకీయ హత్య అని, పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నంబావి మండల ఎస్‌ఐ శేఖర్‌తో కలిసి వనపర్తి సీఐ నాగభూషణరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. గ్రామస్థాయి నాయకుడి ఎజెండానా? లేదా ముఖ్య నాయకుల ఎజెండానా లేక ఇతర కారణాలు ఉన్నాయా అని బయటకు రాలేదు. హత్య జరిగి 34 రోజులు దాటినా హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, వాస్తవాలు బయటకు రాకపోవడం వెనుక కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమోనని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

జెడ్పీ సమావేశంలో శ్రీధర్‌రెడ్డి హత్యపై చర్చ

జూన్ 29న (శనివారం) నిర్వహించిన చివరి జడ్పీ సమావేశంలో చిన్నంబావి ఎంపీపీ సోమేశ్వరమ్మ శ్రీధర్‌రెడ్డి హత్యను ప్రస్తావించారు. కత్తితో గొంతు కోసి చంపినా ఇప్పటికి వరకు నేరస్థులను ఎందుకు పట్టుకోలేక పోయారని, ఎందుకు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డి హత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రజా దర్బార్‌లో దరఖాస్తు ఇచ్చినట్లు తెలిపారు. 

దర్యాప్తు చేస్తున్నాం

శ్రీధర్‌రెడ్డి హత్య విషయంలో గత 34 రోజులుగా 4 బృందాలుగా ఏర్పడి పలు కోణాల్లో  కేసును దర్యాప్తు చేస్తున్నాం. హత్య కేసుకు సంబంధించిన విషయాలు ఛేదించిన తరువాత వెల్లడిస్తాం. 

 నాగభూషణరావు, సీఐ, వనపర్తి 

మరో నివేదిక రావాల్సి ఉంది

పెబ్బేర్ మార్కెట్ యార్డులో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇప్పటికే పలు కోణాల్లో దర్యాప్తు చేశాం. అగ్ని ప్రమాదంపై ఇప్పటికే ఒక నివేదిక వచ్చింది. మరో నివేదిక రావాల్సి ఉంది. ఆ నివేదిక మరో వారం రోజుల్లో వస్తుంది. వచ్చిన వెంటనే అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం. 

 రాంబాబు, సీఐ, కొత్తకోట