calender_icon.png 20 November, 2024 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజుల నియంత్రణపై సాగదీత!

14-09-2024 01:15:53 AM

  1. కమిటీల పేరుతో ప్రభుత్వాల కాలయాపన
  2. క్యాబినెట్ సబ్ కమిటీతో సరిపెట్టిన గత ప్రభుత్వం
  3. మళ్లీ నియంత్రణ కమిటీ వేస్తామంటున్న కాంగ్రెస్
  4. పక్క రాష్ట్రాల్లో ఫీజలు నియంత్రణకు ప్రత్యేక చట్టాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 1౩ (విజయక్రాంతి): ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలను జారీ చేసి పక్కగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వా లు మారుతున్నా.. ఫీజుల పేరుతో ఆర్థిక దోపిడీకి అడ్డుకట్ట పడడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఓ నివేదికను సైతం రూపొందించారు.

కానీ  ఫీజుల నియంత్రణపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలో అధికారం మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈనెల 11న విద్యారంగ సంస్కరణలపై క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలతోపాటు ఫీజుల నియంత్రణపై కూడా చర్చించారు. ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల ఫీజుల నిర్ధారణపై నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ కమిటీ ప్రకటించింది.

అయితే ఇప్పటికే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే ఫీజుల నియంత్రణపై 2016లోనే ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ వేసి నివేదిక కూడా రూపొందించిది. ఆ కమిటీ ఏం తేల్చిందో స్పష్టత లేదు. మళ్లీప్పుడు కాంగ్రెస్ సర్కారు సైతం మరో కమిటీ వేసే యోచనలో ఉంది. ఇలా కమిటీలు వేసుకుంటూ, వాటితోనే సరిపెడితే ఫీజుల నియంత్రణ ఎప్పుడు చేస్తారంటూ పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

పక్క రాష్ట్రాల్లో పకడ్బందీ చట్టాలు..

ప్రైవేట్ ఫీజుల దోపిడీని నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, యూపీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌తో సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలోనూ చట్టం తీసుకురావాలని గత ప్రభుత్వం తొలుత భావించింది. రాష్ట్రంలో దాదాపు 10,600 పాఠశాలల్లో 30 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూళ్లను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించారు. దీని కోసం 2016లో నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు కూడా చేసింది.

బడిలో విద్యార్థిని చేర్చేటప్పుడు ఉన్న ఫీజు తర్వాతి విద్యాసంవత్సరం ఇష్టానుసారంగా పెంచుతున్నట్లు తెలిపింది. కొన్ని స్కూళ్లయితే ఏకంగా 25 శాతం వరకూ ఫీజులు పెంచుతున్నట్లు కమిటీ దృష్టికి వచ్చింది. ఒక్కో స్కూలు రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఏడాదికి ఫీజు వసూలు చేస్తున్నట్లు కమిటీ గుర్తించింది. అయితే ఇష్టానుసారంగా కాకుండా మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచాలని, ప్రతీ స్కూల్ 10 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని నివేదికలో కమిటీ సూచించింది.

ఒకవేళ 10 శాతం పైగా ఫీజులు పెంచితే ఆ స్కూళ్లు ప్రభుత్వానికి లెక్కలు చూపాలని సిఫార్సు చేసింది. కానీ, అవి ఇంత వరకూ అమలుకు నోచుకోవడంలేదు. ఆ తర్వాత ఫీజుల నియంత్రణపై వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ గత ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చినా అది కార్యాచరణకు నోచుకోలేదు. 

చట్టంతోనే ఫీజుల దోపిడీకి చెక్

కాలయాపన చేసేందుకే కమిటీలు వేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కమిటీలతో సరిపెట్టకుండా చట్టం చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అప్పడే ఫీజుల దోపిడీకి చెక్ పడుతుందంటున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే ఫీజుల నియంత్రణ విధానం అమలవుతందని విద్యార్థుల తల్లిదండ్రులు భావించారు. అయితే ప్రభుత్వం మారడంతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేసే యోచనలో ప్రస్తుత సర్కార్ ఉన్నట్లు విద్యాశాఖలోని ఓ ఉన్నాతాధికారి తెలిపారు.

ఇందుకు క్యాబినెట్‌లో చర్చించి అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కానీ ఇటీవల విద్యాసంస్కరణలపై భేటీ అయిన క్యాబినెట్ సబ్ కమిటీ ఫీజుల నియంత్రణపై కమిటీ వేస్తున్నట్లు వెల్లడించడంతో వచ్చే విద్యా సంవత్సరం కూడా ఫీజుల నియంత్రణ సాధ్యపడకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.