భూ సమస్యలు పరిష్కారం కాక ఆఫీసుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
జిల్లాలో 40 వేలకు పైగా పెండింగ్
రంగారెడ్డి, జూలై 4 (విజయక్రాంతి): ధరణి దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో అని రైతులు ఎదురు చూస్తున్నారు. రైతులు తమ భూముల క్రయవిక్రయాలు చేసుకోలేక.. ప్రభుత్వం నుంచి అందే రుణాలను పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. రైతుల దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక కార్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. సమస్య పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయిస్తే, ఇప్పుడు.. అప్పుడు అంటూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలనలో ధరణి పోర్టల్‌లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ కాంగ్రెస్ చిన్నపాటి యుద్ధమే చేసింది.
అయితే, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారంలో కొంత అలసత్వం ప్రదర్శిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సమస్యలకు పరిష్కారం చూపలేక పోతోందని రైతులు వాపోతున్నారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి సమస్య పరిష్కారంపై ప్రత్యేక కమిటీ వేసింది. భూ సమస్యలపై సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులు, నేతల సూచనల మేరకు క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీనికి సంబంధించిన విధి విధానాలపై కూడా తహసీల్దార్లు, కలెక్టర్లకు సూచనలు చేసింది. కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ధరణి పోర్టల్ సమస్యల విషయంలో ప్రభుత్వం ఇంకా ఒక క్లారిటీ కి రాలేకపోతోంది.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు..
జిల్లాలోని 27 మండలాలకు చెందిన పలువురు రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. స్పెషల్ డ్రైవ్‌ల పేరిట ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులతో కూడా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పలుమార్లు అధికారులకు సమస్యలు వివరించినా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారు. మరికొందరు రైతులు తమ నిస్సహాయతను వ్యక్తపరుస్తూ ఆత్మహత్యాయత్నాలకు కూడా ఒడిగడుతున్నారు. అయితే, ప్రభుత్వం ధరణిపై ఇంకా క్లారిటీగా ఎలాంటి నియమ, నిబంధనలు వెల్లడించలేదని అధికారులు పేర్కొంటున్నారు. తమ పరిధిలో భూ సమస్య పరిష్కరించే ఆప్షన్లు లేవంటూ రైతులకు నచ్చజెప్పలేక తహసీల్దార్లు ఇబ్బందులకు గురవుతున్నారు.
పేరుకుపోతున్న దరఖాస్తులు..
జిల్లాలోని మహేశ్వరం, కందుకూరు, చేవెళ్ల, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, యాచారం, కడ్తాల మండలాల్లో ధరణి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతు న్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 40 వేలకు పైగా భూ సమస్యల పై దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు పది శాతం కూడా దరఖాస్తులు క్లియర్ కాలేదు. మెజార్టీ దరఖాస్తులు ఆయా తహసీల్దార్ల వద్దే ఉన్నాయి. అయితే, వరుస ఎన్నికలు, బదిలీల కారణంగా భూ సమస్యలపై అధికారులు అంత ఆసక్తి కనబర్చడం లేదనే ఆరోపణలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం ధరణిలో ప్రత్యేకంగా 33 మాడ్యుల్స్‌ను చేర్చింది.
తహసీల్దార్లకు ప్రత్యేకంగా లాగిన్‌కు అవకాశం కల్పించింది. కోర్టు కేసులు, నిషేధిత భూములు, వక్ఫ్, దేవదాయ, అసైన్డ్, కాందీశీకులకు సంబంధించి భూముల విషయంలో కొంత జాప్యం జరిగినా, భాగ పంపకాలు, విరాసత్, ధరణిలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు తహసీల్దార్ పరిధిలో పరిష్కరించే వాటిపై అధికారులు కొంతదృష్టి సారిస్తే మెజార్టీ సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారానికి నోచుకొంటాయి. ఇటీవలనే సీసీఏల్ కమిషనర్ నవీన్ మిట్టల్ ధరణి పెండింగ్ సమస్యలపై కలెక్టర్లకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. త్వరతిగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశా లు జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ శశాంక ఆర్డీవోలు, తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, త్వరతిగతిన ధరణి సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ఏడాదిగా తిరుగుతున్న
నాకు సర్వే నంబర్ 71అ/ 1/3లో ఒక ఎకరా భూమి ఉండగా, పది గుంటల పట్టా భూమి నిషేధిత జాబితాలో పడింది. దీంతో ధరణిలో భూ రికార్డులను సరిచేయాలంటూ రెవెన్యూ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. ఏడాది నుంచి తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చా. కుటుంబ ఆర్థిక సమస్యల కారణంగా కొంత భూమిని అమ్ముకొం దామంటే ధరణి సమస్య అడ్డంకిగా మారింది.
తలారి సంజీవ, కమ్మెట గ్రామం, చేవెళ్ల మండలం