- పోషకాహార పంపిణీయే ప్రభుత్వ లక్ష్యం
- విజయ డెయిరీకి మూడు నెలలు అవకాశం
- ‘ఆరోగ్యలక్ష్మి’పై సమీక్షలో మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సర ఫరా నిరంతరం జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. మారుమూల ప్రాంతాల్లోని అంగన్‌వాడీలకు సైతం సకాలంలో పాల సరఫరా చేయాలని ఆమె స్పష్టం చేశారు.
సచివాలయంలో ఆరోగ్యలక్ష్మి పథకంపై మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర ఉన్నతా ధికారులతో మంత్రి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడు తూ.. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడమే ‘ఆరోగ్యలక్ష్మి’ లక్ష్యమని.. ఇందు లో భాగంగా ప్రతిరోజు 200 ఎంఎల్ పాల ను పంపిణీ చేస్తారని తెలిపారు.
గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 1.67 కోట్ల లీటర్లు ఆర్డర్ చేయగా.. 1.56 కోట్ల లీటర్ల పాలను విజయ డెయిరీ సరఫరా చేసినట్టు మంత్రి తెలిపారు. అయితే కొన్ని సెంటర్లకు సకాలంలో పాలు సరఫరా కాకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కోరినంత మేర పాలు సరఫరా చేయగలరా? లేదా? అని విజయ డెయిరీ ప్రతినిధులను మంత్రి అడిగారు.
మరో మూడు నెలలు అవకాశం ఇస్తామని, సరఫరా సంతృప్తికరంగా లేకపోతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుల ప్రయోజనంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంరక్షణ ముఖ్యమని.. అందుకే విజయ డెయిరీ నుంచి పాలను కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీలకు సరఫరా చేస్తున్న పాల నాణ్యతను మంత్రి స్వయంగా రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. లీటర్ టెట్రా ప్యాకెట్ ధరను (రూ.57) సవరించాలని డెయిరీ ప్రతినిధులు కోరగా మంత్రి తిరస్కరించారు. మూడు నెలల పాటు ఆటంకం లేకుండా పాలు సరఫరా చేస్తే మరోసారి సమీక్షించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.