- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
- ఏఐతో సమాన హక్కులు, సంపద
- మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
- సిడ్నీలో కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్
- హాజరైన స్పీకర్, మండలి చైర్మన్
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): కృత్రిమ మేధస్సు ఉపయోగంతో చట్టసభల పారదర్శకత, సమర్థత పెరగడంతో పాటు ప్రజాస్వామ్యం మరింత బలో పేతమై ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ అన్నారు. సిడ్నీలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ హాజరయ్యారు.
‘ పార్లమెంటరీ ప్రక్రియలో కృత్రిమ మేధస్సు ఉపయోగం అవకాశాలు, సవాళ్లు ’ అనే అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించడం ద్వారా పార్లమెంట్ పనితీరు సమర్థవంతంగా, పారదర్శకంగా ఉంటూ అందరికి అందుబాటులో ఉంటుందన్నారు. భారతదేశంతో పాటు కామన్వెల్త్ దేశాల్లో ఏఐ వాడటం అనేది అనివార్యంగా మారిందదన్నారు.
ఏఐను ఉపయోగించడం ద్వారా శాసన వ్యవస్థలపై పౌరుల శోధన, సమయం క్రమబద్ధీకరించబడిందన్నారు. పార్లమెంటరీ ప్రక్రియలో ఏఐ ప్రవేశించి కొద్దికాలమే అయినా వేగంగా విస్తరిస్తోందన్నారు. ఏఐను వాడటం ద్వారా చట్ట సభ్యులు భారీ మొత్తంలో ఉన్న డాటాను త్వరితగతిన విశ్లేషించగలుగుతున్నామన్నారు. శాసన వ్యవస్థలో జరుగుతున్న మార్పులను భవిష్యత్ పోకడలకు కనిపెట్టగలుగుతున్నారని స్పీకర్ తెలిపారు.
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, సంపద లభించే విధంగా రాజ్యాంగం రచించబడిందన్నారు. చట్టసభల ద్వారా చట్టాలను రూపొందించి అధికారులతో సమన్వయం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని వివరించారు.