20-04-2025 01:04:26 AM
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి బలం లేకనే పోటీకి దూరంగా ఉన్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఓటింగ్‌లో కూడా పాల్గొనబోమని, విప్ జారీచేసి, ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్రం లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు.
శనివారం హైదరాబా ద్‌లోని తెలంగాణ భవన్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొ రేటర్లు, స్థానిక నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వ హించే రజతోత్సవ సభ ఏర్పాట్లు, సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8మంది బీజేపీ ఎంపీలున్నా కేసీఆర్‌ను, తనను విమర్శిస్తారే తప్పా, ఏనాడు సీఎం రేవంత్‌పై పల్లెత్తు మాట అనరని, సీఎంకు బీజేపీ నేతలే రక్షణకవచమని ఆరోపించారు.
అందుకే నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌పై ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసినా రేవంత్ మాట్లాడటం లేదని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రె స్, బీజేపీలు ఒక్కటేనని కేటీఆర్ తెలిపారు. అందుకే అమృత్ స్కాంలో గోల్‌మాల్ జరిగినా సీఎం రేవంత్‌రెడ్డి బావమరిదిపై, మంత్రి పొంగులేటి ఇంటిపై దాడి చేసిన ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
మూసీ ప్రక్షాళన బాధితులు, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి బీజేపీ నేతలు వెళ్లలేదని ఆయన ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని మాటలు చెప్పినా బీఆర్‌ఎస్ వైపే గ్రేటర్ ప్రజలు నిలబడ్డారని, దాదాపు క్లీన్‌స్వీప్ చేశామన్నారు. ప్రజల ఆశీర్వాదంతో పదేళ్లు కేసీఆర్ సుపరిపాలన అందించారని చెప్పారు.
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కేసీఆర్ గొప్ప అజిటేటర్, అడ్మినిస్ట్రేటర్ అని ప్రశంసించారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. హైడ్రా పేరుతో పేదల బతుకుల ఆగం చేశారని, దీంతో నిర్మాణ రంగం కూలిందని మండిపడ్డారు.
ఒక్క హైదరాబాద్‌లో తప్ప బెంగుళూరు, చెన్నై ముంబై నగరాల్లో రియల్ ఎస్టేట్ బాగానే ఉందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ సునామీ సృష్టిస్తుందన్నారు. డిలిటేషన్ జరిగితే గ్రేటర్‌లోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయని, బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌కే లాభిస్తుందన్నారు. రజతోత్సవ సభ తర్వాత సభ్యత్వ నమోదును డిజిటల్ విధానంలో చేపడతామని కేటీఆర్ చెప్పారు.
అక్టోబర్‌లో పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు వాణీదేవి, దాసోజు శ్రవణ్ కుమార్, శంభిపూర్ రాజు పాల్గొన్నారు.