calender_icon.png 26 December, 2024 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాణాలు తీస్తున్న వీధి కుక్కలు

18-07-2024 01:10:09 AM

  • రాష్ట్రవ్యాప్తంగా ఏటా పెరిగిపోతున్న దాడులు

ఎక్కువ బాధితులు చిన్నారులే

వీధికుక్కల నియంత్రణలో అధికారులు విఫలం 

రాష్ట్రంలో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వీటి దాడుల్లో అభంశుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ శివారు జవహర్‌నగర్‌లో వీధి కుక్కల దాడిలో 17 నెలల బాలుడు విహాన్ మృతిచెందాడు. ఈ దాడిలో బాలుడి మెదడు సైతం బయటికి వచ్చింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారిని కాపాడలేకపోయారు. జగిత్యాల జిల్లాలోని మంగేళగోండు గూడెంలోనూ నాలుగేళ్ల దివ్వ అనూష్‌పైనా మంగళవారం వీధి కుక్కలు దాడి చేశాయి.

సకాలంలో స్థానికులు గుర్తించి రక్షించడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. రాష్ట్రంలో నిత్యం చిన్నా పెద్దా తేడా లేకుండా వీధి కుక్కలు దాడి చేస్తోన్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కుక్కలను నియంత్రించాల్సిన అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నారులను ఇంటి బయటకు పంపించేందుకు సైతం భయపడుతున్నారు. జవహర్‌నగర్ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కుక్కల దాడిలో బాలుడి మృతి

  1. జవహర్‌నగర్‌లో ఘటన
  2. గాంధీలో పోస్టుమార్టం.. మిరుదొడ్డికి తరలింపు 
  3. స్వగ్రామంలో విహాన్ అంత్యక్రియలు

  4. రాష్ట్రవ్యాప్తంగా ఏటా పెరిగిపోతున్న దాడులు
  5. ఎక్కువశాతం బాధితులు చిన్నారులే
  6. అధికారుల నిర్లక్ష్యంగా పెరుగుతోన్న మరణాలు
  7. వీధికుక్కల నియంత్రణలో ప్రభుత్వం విఫలం 

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 17: రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీటి దాడుల్లో అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా నిత్యం జరుగుతున్న ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

వీధి కుక్కల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా ఫలితం దక్కడం లేదు. వరుసగా చిన్నారులు ప్రాణాలు పోతుండటంతో అధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తుండటంతో పాటు ప్రజలకు జవాబు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో వీధి కుక్కల బాధితులుగా మారుతున్నారు. రాత్రి సమయాల్లో అవసరాల రీత్యా ఇంట్లో నుంచి బయటకు రావాల న్నా, పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లాలన్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయాల్లో నాలుగైదు కుక్కలు కలిసి ఒకేసారి దాడి చేస్తుండటంతో నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు. 

మహానగరంలో సంఘటనలు ఇలా... 

నగరంలోని అమీర్‌పేట ప్రాంతంలో 2020 జనవరి 21న స్కూల్ నుంచి వస్తున్న 50 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడిచేశాయి. ఈ సంఘటనలో తీవ్రంగా గాయప డిన 15 మంది చిన్నారులకు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. 2022 ఏప్రిల్ నెలలో గోల్కొండ ప్రాంతంలో రాత్రి 9.45 గంటల సమయంలో రెండేళ్ల చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. గాయపడ్డ బాలున్ని ఆసుపత్రికి తీసుకె ళ్తుండగానే ప్రాణాలు వదిలాడు. 2023లో ఫిబ్రవరిలో అంబర్‌పేటలోని ఓ కార్ల సర్వీస్ కంపెనీ వద్ద 4 ఏళ్ల వాచ్‌మెన్ కుమారుడు కుక్కల దాడిలోనే మృత్యువాత పడ్డాడు. తాజాగా నగర శివారు ప్రాంతం జవహార్‌నగర్‌లోని ఆదర్శనగర్ కాలనీలో మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో 17 నెలల విహాన్ ఇంట్లో నుంచి ఆడుకుంటూ బయటకు రాగానే వీధి కుక్కలన్నీ కొంత దూరం లాక్కెళ్లి తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటనలో ఆ చిన్నారి మెదడు సైతం బయటకు రాగా కుక్క కాట్లతో ఒళ్లంతా గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా కుక్క కాటు బాధితులు వ్యాక్సిన్ కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి ప్రతిరోజూ 90 నుంచి 110 మంది వరకూ వస్తున్నట్టు అక్కడి వైద్యులు చెబుతున్నారు. 

గ్రేటర్‌లో 3.79 లక్షల వీధి కుక్కలు 

హైదరాబాద్‌లో 2007 నాటికి దాదాపు 7.5 లక్షల వీధి కుక్కలు ఉండగా స్టెరిలైజేషన్ వ్యాక్సిన్ వేయడం ద్వారా 2024 నాటికి వీటి సంఖ్య 3.79 లక్షలకు తగ్గినట్టుగా జీహెచ్‌ఎంసీ వెటర్నీరీ విభాగం చీఫ్ అబ్దుల్ వకీల్ చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో కుక్కకాటుకు గురయ్యే వారి సంఖ్య ప్రతిరోజూ 70 కేసులు నమోదవుతుండగా, ప్రతినెలా ఇద్దరు రేబిస్ వ్యాధి బారిన పడుతున్నట్టుగా తెలుస్తోంది. 2022లో 19,847 కుక్క కాటు కేసులు నమోదు కాగా, 2023లో 26,349 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది (2024) జనవరి నుంచి మే దాకా 9 వేల కేసులు నమోదయినట్టుగా సమాచారం. గ్రేటర్‌లో కుక్కల బెడదపై వస్తున్న ఫిర్యాదులలో భాగంగా వ్యాక్సిన్ వేసిన కుక్కలను పరిశీలన కోసం తీసుకెళ్తున్న సమయంలో పలువురు జంతు ప్రేమికులు అడ్డుపడుతున్నట్టుగా వెటర్నరీ విభాగం అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా వెటర్నరీ విభాగం అధికారులపై పలువురు కేసులు కూడా నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కేవలం నియంత్రణ కోసం స్టెరిలైజేషన్ మాత్రమే చేయగలమని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా జిల్లాల్లోనూ కుక్కల దాడులు పెరుగుతున్నాయి. 

ప్రతిరోజూ ఏదో చోట..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒకచోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. కుక్క కాటుతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి రేబిస్ వ్యాక్సిన్ టీకా కోసం వస్తున్న బాధితులు సంఖ్య పెరుగుతూ వస్తోంది. నగరంలోని ఎంహెచ్ నగర్‌లో మంగళవారం ఇంటి ముందు కూర్చున్న వృద్ధుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.  హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఓ పిచ్కికుక్క 21 మందిపై దాడి చేసి గాయపరిచింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా స్థానిక ఆస్పతత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 21 మందిని గాయపరిచిన పిచ్చి కుక్క అంతకుముందు బర్రెను కరిచినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ బర్రె పాలు తాగిన పలువురు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. గత నెల 18న మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన రేణుక తన 45 రోజుల చిన్నారిని ఇంటి ముందు పడుకోబెట్టి పనిలో నిమగ్నమైంది.

ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన ఓ కుక్క చిన్నారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో బాధితులు చిన్నారిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుక్కల నియంత్రణకు వరంగల్‌లో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ఏబీసీ) ఉండగా అందులో సరిపడా స్టెరిలైజేషన్ జరగడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో కుక్కల నియంత్రణ జరగడం లేదని తెలుస్తోంది. వరంగల్‌లో కుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ మరో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేయాలని గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదని సమాచారం. వేసవిలోనే రెండో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా, నిధుల లేమి, సిబ్బంది కొరత దృష్ట్యా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. 

గ్రామాల్లో హడలెత్తిస్తున్న వీధికుక్కలు.

నాగర్‌కర్నూల్ జిల్లాలోని ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ముఖ్యంగా వీధుల్లో ఆడుకునే చిన్నారులపై దాడిచేసి పీక్కుతింటున్నాయి. తాజాగా కొల్లాపూర్ పట్టణంలోని ఓ కాలనీలో ఆడుకుంటున్న చిన్నారి ముఖంపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. లింగాల మండలం కోమటికుంట లోని కోళ్లఫారంపై వీధికుక్కలు దాడి చేసి సుమారు 50కిపైగా నాటు కోళ్లను తిన్నాయి. నాగర్‌కర్నూల్ పట్టణం ఎర్రగడ్డ కాలనీలో ఓ చిన్నారిపై కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. వారంరోజుల క్రితం అచ్చంపేట పట్టణంలోని సాయినగర్ కాలనీలో అడవిలోనుండి తప్పిపోయిన దుప్పిపై వీధికుక్కలు దాడిచేసి చంపాయి. వాటి సంతతిని నిలువరించేందుకు యానిమల్ బర్త్ కంట్రోల్‌పై శ్రద్ధ చూపాల్సిన అధికారులు వాటిపై దృష్టిసారించడం లేదు. అధికారికంగా మాత్రం 10 వేల వీధి కుక్కలు, మరో 5వేలు పెంపుడు కుక్కలు మాత్రమే ఉన్నట్లు చెబుతున్నారు.  

నిజామాబాద్‌లో ఆందోళనకరంగా..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుక్క కాట్లు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా గత డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పెద్ద సంఖ్యలో కుక్కకాట్లు నమోదయ్యాయి. 2023 డిసెంబర్‌లో నిజామాబాద్ జిల్లాలో 382 కుక్కకాట్లు కేసులు నమోదు కాగా, కామారెడ్డి జిల్లాలో 56 కేసులు నమోదయ్యాయి. 2024 జనవరిలో నిజామాబాద్ జిల్లాలో 376, కామారెడ్డిలో 32, ఫిబ్రవరిలో నిజామాబాద్‌లో 326, కామారెడ్డిలో 44, మార్చిలో నిజామాబాద్‌లో 326, కామారెడ్డిలో 38, ఏప్రిల్‌లో నిజామాబాద్ లో 243, కామారెడ్డిలో 28 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జూన్ 14న పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఏకంగా 14 మందిపై దాడి చేసి గాయపరిచింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలోనే కుక్కల బెడద ఎక్కువైంది. కార్యాలయానికి వచ్చే సందర్శకులు కుక్కలతో ఆందోళన చెందుతున్నారు. ఒక కుక్క సందర్శకులపై దాడి చేసి గాయపరిచింది. ఎమ్మార్వోతో పాటు ధరణి ఆపరేటర్‌పై పిచ్చికుక్క దాడి చేయగా గాయాలు అయ్యాయి  అక్కడున్న వారు కర్రలతో డాడి చేసి ఆ కుక్కను హతమార్చారు.

చిన్నారికి తప్పిన ప్రాణాపాయం

జగిత్యాల, జూలై 17: దారి వెంట నడుచుకుంటూ వెళ్తున్నా, దిచక్రవాహనాలపై వెళ్తున్న వ్యక్తులపై శునకాలు ఎగబడుతున్నాయి. పిల్లలను బయటకు పంపించేందు కు తల్లిదండ్రులు భయంతో హడలిపోతున్నారు. జగిత్యాల జిల్లాలో కుక్కకాటుకు గురైన ఓ బాలుడి పరిస్థితి విషమంగా మారింది. జిల్లాలోని బీర్‌పూర్ మండలం మంగేళ గోండుగూడెంలో మంగళవారం రాత్రి 7గంటలకు దారివెంట నడుచుకుం టూ వెళ్తున్న దివ్య అనూష్ (4)పై వీధి కుక్క లు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాయి. అక్కడే ఉన్న జనం శునకాలను తరిమికొట్టడంతో పారిపోయాయి. దీంతో పెద్దప్రమాదం తప్పిందని గ్రామస్థులు, తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. శునకాల దాడిలో రక్తపుగాయాలతో రోదిస్తున్న బా లుడిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. వీధి కుక్కల బెడదతో పెద్దలు లేకుం డా పిల్లలను బయటకు పంపించాలంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. శునకాల దాడిలో గాయపడిన బాలుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాలుడిని జగిత్యాల ప్రభుత ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

హుజూరాబాద్‌లో.. 25 మందికి తీవ్ర గాయాలు

హుజురాబాద్, జూలై 17 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంతోపాటు బోర్నపల్లి గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. బుధవారం సాయం త్రం కుక్కల దాడిలో 25 మంది గాయపడ్డారు.  గాయాలపాలైన వారిని హుజూరా బాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అయితే హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో  సరిపడా ఇంజెక్షన్లు లేకపోవడంతో కొంతమంది వరంగల్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినట్టు తెలిసింది. పట్టణంలో కుక్కల దాడిలో పదుల సంఖ్యలో గాయపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వీధి కుక్కల దాడుల పట్ల జాగ్రత్తలు

  1. వీధిలో కుక్కలు గుంపుగా ఉన్నప్పుడు ఆ వైపు వెళ్లకూడదు. 
  2. కుక్కలను రాళ్లతో కొట్టడం, బెదిరించినట్టుగా చేయకూడదు. 
  3. కుక్కలను చూసిన తర్వాత పరుగెత్తకుండా నిలబడితే మన జోలికిరావు. 
  4. ఒక వేళ కుక్కలను చూసి మనం పరుగెత్తితే అవి కచ్చితంగా దాడి చేస్తాయి.