calender_icon.png 29 January, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రవెళ్లిలో వింత అటవీ జంతువు సంచారం...

27-01-2025 06:30:12 PM

పునుగు పిల్లిగా గుర్తించిన అటవీశాఖ అధికారులు...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో గత నెల రోజులుగా తిరుగుతున్న వింత అటవీ జంతువును స్థానిక యువకులు పట్టుకున్నారు. రాంనగర్ కాలనీలో సంచరిస్తున్న అటవీ జంతువును ఎట్టకేలకు సోమవారం తెల్లవారుజామున వలవేసి పట్టుకున్నారు. ఆదివారం రాత్రి రాంనగర్ కాలనీలో ముండే లక్ష్మణ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ జంతువు సిసి ఫుటేజ్ లో కనిపించింది. దీన్ని గమనించిన పలువురు ఇది మర్నాగి అని, మరికొందరు అడవి ముంగిస అని ఇలా వివిధ జంతువుల పేర్లు చెబుతూ భయాందోళనకు గురయ్యారు. మాజీ సర్పంచ్ సుంకట్ రావ్ పంచాయతీ సిబ్బంది, స్థానిక యువకులతో కలిసి ఆ ప్రాంతంలో వలవేసి ఉంచారు. స్థానికులు అర్ధరాత్రి దాటాక ఇంటి పైన చప్పుడు రావడంతో అందరూ నిద్ర లేచి పరిశీలించగా.. వలలో ఈ అటవీ జంతువు చిక్కుకొన్నది. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులిమడుగు సెక్షన్ అధికారి చంద్రారెడ్డి తన సిబ్బందితో వచ్చి చూడగా ఆ జంతువు పునుగు పిల్లిగా గుర్తించారు. పట్టుకున్న పునుగు పిల్లిని చీచ్ ధరి ఖానాపూర్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. యువకులను అధికారులు అభినందించారు.