calender_icon.png 25 October, 2024 | 1:49 AM

1969 ఉద్యమ ప్రస్థానం

30-05-2024 12:05:00 AM

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పదేళ్లు పూర్తి అయింది. భాషా ప్రాతిపదికన 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్న తెలంగాణ 58 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. విదర్భ, ఉత్తరాఖండ్, హరిత్‌ప్రదేశ్‌ల లాగానే సుదీర్ఘ కాలంగా ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం సాగింది. ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ఈ ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి. ఎన్నో పోరాటాలతో.. కొట్లాటలతో ఏర్పడ్డ తెలంగాణలో ఇప్పటికీ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1969 తొలి తెలంగాణ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసు మిత్రుడు మహ్మద్ జహీర్ అలీ ఆనాటి జ్ఞాపకాలను  విజయక్రాంతితో పంచుకున్నారు. 

ఖమ్మం జిల్లా పాల్వంచలో దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రధానమైన విద్యుత్ కేంద్రాన్ని ‘కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్’ అనే పేరుతో 1961లో స్థాపించారు. తెలంగాణ నిధుల నుంచి ఈ ప్రాజెక్టుకు డబ్బులు కేటాయించారు. స్థానిక రైతులు సుమారు 1300 ఎకరాల భూమిని కోల్పోయారు. ప్రాజెక్టు పని నిమిత్తం అనేకమంది ఉన్నతాధికారులను కావాలని ఆంధ్ర ప్రాంతీయులను నియమించారు. ఎంతో అనుభవమున్న తెలంగాణ వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ప్రాంతీయ అభిమానం వల్ల ఆంధ్ర అధికారులు తమ ప్రాంతానికి చెందిన అనేక మందిని ఇక్కడికి పిలిపించి, పూర్తిగా ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాలు ఇచ్చారు. స్థానికంగా భూములు కోల్పోయిన వారికి కూడా ఉద్యోగాలివ్వలేదు.

1968 ఎండాకాలంలో ‘తెలంగాణ ప్రాంతీయ సమితి’ని కొలిశెట్టి రామదాసు స్థాపించారు. దీనికి ఈయన అధ్యక్షులుగా, ముత్యం వెంకన్న ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తర్వాత 1969, జనవరి 22 సాయంత్రం జలగం వెంగళరావు ఒత్తిడి వల్ల 15 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న రవీంద్రనాథ్ దీక్ష విరమించారు. దీంతో తెలంగాణ రక్షణల అమలు కోసం చేస్తున్న తెలంగాణ విద్యార్థుల ఉద్యమం చల్లారిపోయింది. 

కొలిశెట్టి రామదాసు ఎవరు? 

కొలిశెట్టి రామదాసు స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సమీపంలోని గేటుకారేపల్లి. చదువుకునే సమయంలోనే విద్యార్థి నాయకుడిగా పని చేశారు. ఆ సమయంలో ఇల్లెందులో ప్రజాదరణ సంపాదించారు. చదువు పూర్తయ్యాక ఆయన సింగరేణిలో ఉన్నతోద్యోగిగా పని చేశారు. 1954 మధ్యకాలంలో విశాంధ్ర వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 

మీ కాలేజీ రోజులు ఎలా ఉండేవి?

ప్రత్యేక తెలంగాణ కోసం కాలేజీ రోజుల్లోనే ఉద్యమాన్ని నడిపించేవాళ్లం. రామదాసు తన ఆలోచనలను అమలు చేయడానికి కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధమై.. జిల్లాల్లో పర్యటనలు చేసి.. నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసువచ్చేందుకు కృషి చేసేవాళ్లం. నిరుద్యోగులుగా ఉండటానికి కారణం.. నాన్ భావించేవాళ్లం.  

ఆరు సూత్రాల పథకం అంటే ఏంటి?

ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నాయకులతో సంప్రదించిన పిదప ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకాన్ని 23 సెప్టెంబర్ 1973లో ప్రకటించింది. దీంతో అప్పటి వరకు అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు  రద్దయి, దాని స్థానంలో ఆరుసూత్రాల పథకం రాష్ట్రపతి ఉత్తర్వులతో అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల సత్వర అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధానిని నిర్ణీత పద్ధతిలో అభివృద్ధిపర్చడానికి కచ్చితమైన నిధులను కేటాయించాలి. విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చే విషయంలో రాష్ట్రానికంతా ఒకే విధానాన్ని వర్తింపజేయాలి. ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలి. ప్రమోషన్ల విషయంలో కూడా ఒక నిర్ణీత స్థాయి వరకు ఈ నిబంధన పాటించాలి. ఉద్యోగ నియామకాలు, సీనియారిటీ, ప్రమోషన్ వంటి విషయాల్లో ఉత్పన్నమయ్యే ఫిర్యాదులను పరిశీ లించేందుకు ఉన్నతాధికారాలు గల ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలు పర్చాలి. పైన సూచించిన మార్గాన్ని అవలంబిస్తే ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అవసరమవుతాయి. 

కొంతమంది ఉద్యమ నాయకుల పేర్లు చెప్పండి?

విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు అన్నీ ప్రాంతాలు తిరిగి ఉద్యమ నిర్మాణం చేశాం. ఇందులో ముఖ్యంగా నాతో పాటు బత్తుల రవీంద్రనాథ్, టీ.కైలాష్ నాథ్, బోళ్ల వెంకటేశ్వర్లు, మహ్మద్ ముజాఫరుద్దీన్, గాడేపల్లి నర్సింహారావు, అత్తులూరి పుల్లారావు, అర్వపల్లిసుధాకర్, మహ్మద్ ఫజలుల్లాహ్, మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్, వొంటికొమ్ము రాంచంద్రారెడ్డి, రిటైర్డ్  డీఎ స్పీ పి.రామస్వామి, గట్టుమోహన్‌రావు, మరికొంద రు విద్యార్థి నాయకులతో ఉద్యమ నిర్మాణం చేశాం.

మొదట ఆమరణ నిరహార దీక్ష చేసిందెవరు?

మొదటిసారి 1969లో ఆమరణ దీక్షలో కూర్చుంది బత్తుల రవీంద్రనాథ్.  ఆరు సూత్రాల పథకం అమలుతో పాటు  తెలంగాణ సేఫ్‌గార్డ్ మూమెంట్‌ను బలపర్చాలని నిర్ణయించాం. ఆమరణ నిరహార దీక్షలో మాజీ కేంద్రమంత్రి మల్లికార్జున్, మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ మంత్రి మదన్‌మోహన్, హైగ్రీవాచారి ఉద్యమంలో పాల్గొన్నారు. 

ఉద్యమకారులకు గుర్తింపు దక్కిందా?

తొలిదశ  తెలంగాణ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాసుకు పదేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి గుర్తింపు దక్కలేదు. అయితే ప్రభుత్వం బత్తుల రవీంద్రనాథ్ కుటుంబానికి రూ.10లక్షలు సాయం చేశారు. రవీంధ్రనాథ్ నా ఆధ్యర్యంలోనే లా కోర్సు పూర్తి చేసి కొంతకాలం జూనియర్ లాయరుగా పని చేశారు.

తొలితరం ఉద్యమం ఎంతకాలం జరిగింది?

పరాయి ప్రాంతం వారి పాలన మాకొద్దు అంటూ నాటి ఉమ్మడి పాలకులతో జరిగిన పోరాటం అది. 1968లో ప్రారంభమై 1972 వరకు ఉద్యమం నడిచింది. నాటి పాలకుల రాజకీయ జోక్యం వల్ల  హింసాత్మకంగా  మారి చల్లారింది.  రాజకీయ చర్య లేకుండా ఉంటే  ఆనాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఉండేది.

టీ.పీ.ఎస్ ఏమైంది?

టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి జూబ్లీహాల్‌లో మీటింగ్ పెట్టారు. దానికి ఖమ్మం నుంచి వెళ్లిన మేం వేదిక పైకి చెప్పులు విసిరి నిరసన తెలిపాం. పోలీసుల చేత బలవంతంగా మమ్మల్ని బైటికి నెట్టివేయించారు. కొన్ని రాజకీయ ఒప్పందాల మూలంగా టీపీఎస్ కాంగ్రెస్‌లో విలీనమైందని  తర్వాత తెలుసుకున్నాం.

ఆమరణ దీక్ష గురించి చెప్పండి?

రవీంద్రనాథ్ దీక్ష ఉద్యమాన్ని మలుపు తిప్పింది. నాడు జలగంవెంగళరావు రాష్ట్ర కేబినెట్‌లో హోంమంత్రి హోదాలో ఉండి ఖమ్మం గాంధీచౌక్‌లోని దీక్షా శిబిరానికి రానున్నట్లు తెలుసుకుని నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాం. ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకోలేకపోయాం. సరిగ్గా వెంగళరావు సందర్శన సమయంలోనే  ఆయన టార్గెట్‌గా చేసుకుని బాంబ్ దాడి జరిగింది. ఆయన జీపుకు కొంత దూరంలో ఆవుపై  పడి, ఆవు అక్కడి కక్కడే మృతి చెందింది. రవీంద్రనాథ్‌ను బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. దీక్షను భగ్నం చేశారు. కానీ తదనంతరం ఉద్యమం నీరు కారిపోలేదు. తిరుగుబాటు ఆగలేదు. కార్యచరణ మారింది. ఉద్యమ ఉద్ధృతిని గమనించే నిర్ణయాలు జరిగాయి. 

(కొలిశెట్టి రామదాసు యాదిలో)

 అన్సార్ పాషా, ఖమ్మం, విజయక్రాంతి