calender_icon.png 10 January, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమాకు కథే ప్రాణం

10-01-2025 12:00:00 AM

“మంచి కథే సినిమాకు ప్రాణం. మొదట్నుంచి ఆ కథను నమ్ముకునే నేను సినిమాలు తీశాను.. ‘తల్లి మనసు’ కూడా ఇంటిల్లిపాది చూసేలా చక్కగా రూపుదిద్దుకుంది” అని తెలిపారు సీనియర్ దర్శకుడు, చిత్ర సమర్పకుడు ముత్యాల సుబ్బయ్య. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా వీ శ్రీనివాస్ (సిప్పీ) దర్శకత్వంలో ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రమే ‘తల్లి మనసు’.

ముత్యాల సుబ్బయ్య తనయుడు అనంత కిషోర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సుబ్బయ్య గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యే కంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ‘దర్శకుడిగా ప్రముఖ హీరోలందరితో 50 సినిమాలను తీశాను. ఏదో ఒక సినిమా చేసెయ్యాలని ఏరోజూ అనుకోలేదు. సమాజానికి పనికివచ్చే పాయింట్‌తోనే సినిమాలు చేశాను.

కొన్ని సెంటిమెంట్ సినిమాల కారణంగా ఒక దశలో నాకు సెంటిమెంట్ సుబ్బ య్య అని కూడా పేరొచ్చింది. మా పెద్దబ్బాయి అనంత కిషోర్ అభిరుచి మేరకు తొలిసారి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నేను సమర్పకుడిగా ఉన్నాను. నా దగ్గర, దర్శకత్వ శాఖలో అనుభవం గడించిన సిప్పీని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం.

ప్రేక్షకులు కథలో, పాత్రల్లో లీనమవుతారు. పాత్రలకు తగ్గ నటీనటులను ఎంచుకున్నాం. టైటిల్ పాత్ర కోసం చాలా మంది నటీమణులను అడిగాం. చివరకు కన్నడంలో మంచి పేరు తెచ్చుకున్న రచిత మహాలక్ష్మి అంగీకరించారు. కోటి సంగీతం, సుధాకరరెడ్డి ఛాయాగ్రహణం సినిమాకు ప్లస్ పాయింట్. తప్పకుండా మా అందరి అంచనాలను ఈ సినిమా నిలబెడుతుంది” అని అన్నారు సుబ్బయ్య.