calender_icon.png 27 October, 2024 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణది అస్తిత్వ పోరాటం

16-05-2024 12:05:00 AM

ప్రొఫెసర్ హరగోపాల్.. అధ్యాపకుడిగా.. పౌర హక్కుల నేతగా అందరికీ సుపరిచతం. జీవితంలో ఎన్నో నిర్బంధాలు, బెదిరింపులను ఎదుర్కొన్న వ్యక్తి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ప్రభుత్వానికి వారధి. సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు మేధావులు పరిష్కారం చూపించాలి అంటారు. తెలుగు సమాజానికి ఏ సమస్య వచ్చినా పరిష్కారంతో ముందు వరుసలో నిలబడే వ్యక్తి ప్రొఫెసర్ హరగోపాల్.  తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమానికి తనదైన తోడ్పాటును అందించారు. తెలంగాణ ప్రజల అస్తిత్వమే పోరాటానికి బీజమని కుడి భుజంగా నిలిచారు. ఏడు దశాబ్దాల జీవిత కాలపు అనుభవాలను, అనుభూతులను 

‘వీర తెలంగాణ’తో పంచుకున్నారు..!

కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?

మాది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్‌నగర్ దగ్గర మొగలిగిద్ద అనే గ్రామం. వ్యవసాయ కుటుంబం మాది. పదిమంది పిల్లలం. నా బడి చదువంతా గ్రామంలోనే సాగింది. మా స్కూల్ చాలా పాతది. దాన్ని 1862లో స్థాపించారు. నూట యాభై ఏళ్లు పూర్తిచేసుకున్నది. మన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయ ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన రాఘవాచారి ఇక్కడి వాళ్లే. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్ హైస్కూల్‌గా మారింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో  స్కూల్లో ఇంటర్మీడియట్ కూడా ప్రారంభించేలా చేశాం. చంద్రబాబు నాయుడు పబ్లిక్ సెక్టార్ పట్ల సానుకూలంగా లేకపోయినప్పటికీ పాత బడి కావడం.. అందులోనూ ఎక్కువ మంది అమ్మాయిలు చదవడం వల్ల.. వాళ్లు చదువు మానేస్తే బాల్యవివాహాల వైపు వెళ్లే అవకాశం ఉంటుందని గ్రామస్తులు అంతా ఆయనకు కోరడం చేత ఆ స్కూల్‌ను అప్‌గ్రేడ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ విధంగా మండల కేంద్రం కానప్పటికీ ఇంటర్మీయట్  ప్రారంభించిన మొదటి స్కూల్‌గా దాన్ని చెప్పుకోవచ్చు. నా స్కూల్ చదువు తర్వాత ప్రీయూనివర్సిటీ కోర్సును సిటీ సైన్స్ కాలేజీలో పూర్తిచేశాను  . ఆ కాలంలో ఇంజనీరింగ్, మెడిసిన్ అనే పిచ్చిలేదు. కాబట్టి నేను సామాజిక శాస్త్రాల వైపు మళ్లాను. మా ఇంట్లో వాళ్లకి నన్ను వైద్యున్ని చేయాలని ఉండేది. కానీ నేను వచ్చింది తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్, పైగా అప్పటి వరకు ఒక్కసారే తప్ప హైదరాబాద్ వచ్చింది లేదు. డైరెక్ట్ అడ్మిషన్ సందర్భంగా వచ్చాను. జానకీరాం సార్ నన్ను తీసుకొచ్చి అడ్మిషన్ ఇప్పించాడు. డిగ్రీలో అప్పుడే కొత్తగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంట్రడ్యూస్ చేస్తే అందులో జాయిన్ అయ్యాను.

మీ అధ్యాపక జీవితంలో ఎన్నో ఉద్యమాలను చూసి ఉంటారు. వాటిలో బాగా గుర్తుండిపోయేది అంటే ఏం చెబుతారు?

ప్లానింగ్ కమిషన్‌లో పనిచేయడం ఒక మంచి అనుభవం. ఎంఏ చదువుతున్నప్పుడు మాకు టీచర్‌గా రాం రెడ్డి అనే ఆయన ఉండేవాడు. తర్వాతి కాలంలో వీసీగా, యూజీసీ ఛైర్మన్ అయ్యాడు. నిబద్ధత కలిగే టీచర్‌గానే కాకుండా గుడ్ హ్యూమన్ బీయింగ్. పైగా కరీంనగర్ నుండి వచ్చిన వాడు కాబట్టి రూరల్ పిల్లల్ని బాగా చూసుకోవాలి అనే కన్సర్న్ ఉండేది. అందుకే టీచర్‌గా, వైస్ ఛాన్స్‌లర్‌గా ఉండి కూడా హాస్టల్‌కు వచ్చేవాడు. పిల్లల బాగోగులు అడిగి తెలుసుకునేవాడు. తర్వాతి కాలంలో చనిపోయే వరకు ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉన్నారు. ఆయన నుండి సిన్సియారిటీ, కమిట్ మెంట్ ఇలా చాలా నేర్చుకున్నాను. ఇది ఒక రకమైన గుర్తుండిపోయే సంఘటన. ఇక రెండవది. నేను ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయిన పదిహేను రోజుల తర్వాత ఒక విద్యార్థి అడిగాడు సార్ మీరు ఎంత కాలం నుంచి టీచింగ్  చేస్తున్నారని. నేను ఇదే ఫస్ట్ టైం టీచింగ్‌లో అని చెప్పాను. మొదటి సారి  టీచింగ్ అంటే పిల్లలు కాస్త డిస్ట్రబ్ చేసేవాళ్లు కానీ నా విషయంలో అది జరగలేదు. నేను ఎక్స్‌పీరియెన్స్ టీచర్ అనుకున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఆరోజుల్లో అందరూ సినిమాలు చూసే అవకాశం ఉండేది కాదు కదా... ఆర్థిక స్థోమత కూడా అందరికి ఉండేది కాదు. నాలాంటి వాళ్లం సినిమా చూసివచ్చి దానికి కాస్త జోడించి చెప్పే వాళ్లం అలా పది, పదిహేను మందికి చెప్పిందే చెప్పి చెప్పి ఒక నరేషన్ డెవలప్ అయ్యింది.

అలా అది బాగా ఉపయోగపడింది అనుకుంటా.. బహుశా అందుకే ఆర్ట్స్ కాలేజీలో బోధిస్తున్నప్పుడు పిల్లలు కూడా కొత్తగా పాఠాలు చెబుతున్నాడు అనే ఫీలింగ్ వాళ్లకు రాకపోయేది. అయితే తర్వాతి కాలంలో నేను ఈవినింగ్ కాలేజీకి బదిలీ అయ్యాను. అక్కడ విద్యార్థులంతా సీనియర్స్. ఆ తర్వాత నేను వరంగల్‌కు బదిలీ అయ్యాను. అది అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పీజీ సెంటర్‌గా ఉండేది. అక్కడికి వెళ్లేందుకు చాలా మంది టీచర్స్ సుముఖత చూపేవాళ్లు కాదు. కానీ నేను అప్పటికి పెళ్లిచేసుకోలేదు. కాబట్టి మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ పిలిచి చెబితే నేను అక్కడికి వెళ్లాను. అయితే నేను వెళ్తుంటే నా స్టూడెంట్స్ అంతా నన్ను వెళ్లనివ్వకుండా స్ట్రుక్ చేశారు. నాకంటే సీనియర్స్ వాళ్లంతా నన్ను వెళ్లనివ్వకుండా నాకోసం స్ట్రుక్ చేయడం బాగా గుర్తుండిపోయింది. అందులో ఒక విద్యార్థి అప్పటికే ఐడీపీఎల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉండేవాడు. అతను కూడా  మీరు ట్రాన్సర్ అయితే ఎలా సార్ అని బాధపడ్డాడు. అయినా ట్రాన్స్‌ఫర్ చేశారు. కాబట్టి తప్పని పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లాక అక్కడి ఆర్ట్స్ కాలేజీలో టీచింగ్ చేశాను. అక్కడ ప్రొ. కోదండరాం, ప్రొ.తిరుపతి రావు నా స్టూడెంట్స్. అక్కడ రెండేళ్ల తర్వాత నేను మళ్లీ పీజీ సెంటర్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యాను. తిరిగి అక్కడ కూడా పిల్లల నుండి అదే పరిస్థితి. నేను ట్రాన్స్‌ఫర్ అయ్యానని తెలిసి బాగా ఏడ్చారు. ఇవన్నీ కూడా మరిచిపోలేని సంఘటనలు నా టీచింగ్ జీవితంలో.

పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు బెదిరింపులు, నిర్బంధాలు ఏమైనా వచ్చాయా?

సెంట్రల్ యూనివర్సిటీలో టీచింగ్ చేస్తున్నప్పుడు స్టేట్ నుండి కొంత ఒత్తిడి ఉండేది. ఆయన సివిల్ రైట్స్ మూవ్‌మెంట్‌లో తిరుగుతున్నాడని వైస్ ఛాన్స్‌లర్ దగ్గరకు వెళ్లి చెప్పేవాళ్లు. దానికి వైస్ ఛాన్స్‌లర్  ఆయన ఓ గుడ్ టీచర్, పాపులర్ టీచర్, మంచి అకడమీషియన్. అలాంటి ఆయన్ని మేం ఏం అనగలం. ఆయనకు ఆ ఫ్రీడం ఉంది కదా అనేవాడు. పైగా ఆయన ఏనాడు ఒక టీచర్‌గా తన బాధ్యతను విస్మరించలేదు కదా అనేవాడు. అందుకే సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నంత కాలం నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు. నేను  హైదరాబాద్‌లో ఉన్న నేషనల్ పోలీసు అకాడమీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ముస్సోరిలోని ఐఏఎస్ శిక్షణా కేంద్రం, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆర్మీ వాళ్లకు ఆరు సంవత్సారాల  పాటు టీచింగ్ చేశాను. ఇలా చాలా మందికి క్లాసులు చెప్పాను. చివరకు జడ్జెస్‌కు కూడా క్లాసులు చెప్పాను. నా దృష్టిలో టీచర్ అంటే కేవలం విద్యార్థులకు క్లాసు రూంలో బోధించేవాడు మాత్రమే కాదు. టీచర్ అంటే సొసైటీలో భాగం అని. మన సర్వీస్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోధించాలి అనే అభిప్రాయం. సో ఎక్కడ వీలు అయితే అక్కడ నా బాధ్యతను పోషించడానికి ప్రయత్నించాను.

మీలాంటి వాళ్లు ఎమర్జెన్సీని చూశారు? కానీ ఇప్పటి మోదీ పాలనకు ఎందుకు భయపడుతున్నారు?

దానికి దీనికి ఒక తేడా ఉంది. ఇందిరా గాంధీ పేద ప్రజల పేరు మీద ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. కానీ ఆ ఎమర్జెన్సీ అనేది వ్యతిరేకమైనది.  పైగా ఆమె వ్యక్తిగత క్రైసెస్ కాలంలో దాన్ని డిక్లేర్ చేసింది. కానీ దానికి ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. పైగా అంతర్జాతీయంగా ఆమెపై ఒత్తిడి కూడా వచ్చింది. కానీ ఇది అలా కాదు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఇది స్లో పాయిజన్‌లా పని చేస్తుంది. మోదీ మొదట సంస్థలను నిర్వీర్యం చేస్తూ పోయాడు. అడ్మినిస్ట్రేషన్‌లను, చట్టసభలను వీక్ చేస్తూ పోయాడు. ఇది ఒక రకంగా సుదీర్ఘమైన ఎత్తుగడగా సాగింది. ఇదంతా కూడా ఎమర్జెన్సీని ప్రకటించకుండానే చేస్తూ పోయాడు. కానీ ఎమర్జెన్సీలో ఏం జరిగిందో అదే జరుగుతోంది. అందుకే సామూహిక ఉద్యమాలు, పోరాటాలు కష్టమైపోయాయి. ఇక్కడే రెండింటీకి తేడా ఉంది. ఇందిరగాంధీ అందరినీ తీసుకెళ్లి జైళ్లో వేసింది. జయప్రకాశ్ నారాయణ మొదలు వాజీపేయి, జార్జ్ ఫెర్నాండేజ్ వరకు అందరిని జైల్లో వేసింది. కానీ మోదీ అలా చేయడం లేదు. అక్కడొక్కరిని, ఇక్కడొక్కరిని ఇలా తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను నిర్బంధిస్తూ పోతున్నాడు. కానీ ఢిల్లీ వేదికగా జరిగిన రైతు ఉద్యమం, షాహీన్ బాగ్ పోరాటం, విద్యార్థి ఉద్యమాలు కాసింత నమ్మకాన్ని కలిగించాయి. అయితే ఎమర్జెన్సీ కాలంలో ఉపా లాంటి చట్టాలు లేకపోవడంతో  ఏదో ఒకరోజు విడుదల అవుతారనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. చట్టాన్నే మార్చేశారు. ఎవరిని ఎప్పుడైన అరెస్టు చేయవచ్చు. ఆరు నెలల పాటు ఎటువంటి విచారణ లేకుండా, బెయిల్ కూడా లేకుండా నిర్బంధించవచ్చు. ఏ నేరం చేయకపోయిన జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీలో కొందరికైనా బెయిల్ వచ్చింది. ఇక్కడ చట్టాన్నే మార్చేశారు. అదే రెండింటికి ఉన్న తేడా.

1969 ఉద్యమం గురించి చెప్పండి?

నేను చాలా వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చినవాణ్ని. నేను ఎప్పుడూ జాతీయ రాజకీయాల గురించే ఆలోచిస్తాను. చిన్న చిన్న రాష్ట్రాల ప్రాముఖ్యత పార్లమెంట్‌లో తక్కువగా ఉంటుంది. అదే సమయంలో భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఇంకా ఎక్కువ ప్రమాదం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంటే ప్రజాస్వామ్యం కొంత నిలుస్తుందని ఒక అవగాహన నాకు ఉండేది. అందుకనే ఒక పెద్ద రాష్ట్రంగా ప్లారమెంట్‌లో పెద్ద వాయిస్ వినిపించాలనే ఒక ఆలోచన నాకు ఉండేది. ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చేసుకోవచ్చని నేను అప్పుడు వాదించాను. తర్వాత చెన్నారెడ్డి నాయకత్వాన్ని కూడా నేను ఇష్టపడలేదు. చెన్నారెడ్డి మీద నాకు చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఏంటి అసలు ఆయన వచ్చి ఉద్యమం నడపడం? వాళ్ళు అసలు నిజంగానే నిజాయితీగా ఉద్యమం నడుపుతారా? లేదా మధ్యలో ముంచిపోతారో? అనే సందేహం ఉండేది. ఆయనోక ఫ్యూడల్ నాయకుడు. అనే ఒక రిజర్వేషన్ కూడా నాకు చాలా సీరియస్‌గా ఉండేది. 

మరి ఉద్యమానికి ఎప్పుడు సపోర్టు చేశారు?

మా జిల్లాలో కూడా ఒక సమస్య ఉండేది.. మాది వెనుక బడిన జిల్లా.. 200, 300 కిలో మీటర్ల దూరంలో కృష్ణాజాలలు ప్రవహిస్తున్నా మనకు నీళ్ళే రావడం లేదని ప్రజా సంఘాల ఆవేదన. మనకు కనీసం 10 టీఎంసీ నీళ్లు కూడా రాలేదని ఆరోపణ వచ్చింది. మన జిల్లా భవిష్యత్ ఏంటని బాధపడేవారు.  ఆ సమయంలో విభజన గురించి కాక నేనేమో ఒక ప్రత్యామ్నాయం వెతుకుతున్నాను. కానీ అప్పటికే బాలగోపాల్ కచ్చితంగా తెలంగాణ రావాలని కమిట్ అయ్యాడు. కృష్ణా జాలల పునః పంపిణీ వరకే ఆయన కమిట్ అయిపోయాడు. ప్రజల ఆకాంక్షను మనం గౌరవించాలి. ఈ మొత్తం అనుభవం తర్వాత పౌర హక్కుల సంఘం అప్పటికే తెలంగాణ నిర్ణయం తీసుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం ఉందని చెబితే ఎవరూ వినడం లేదు. రాజకీయ పార్టీలు స్పందించడం లేదు. బయట ఒక పాపులర్ మూవ్‌మెంట్ వచ్చింది. ఎంతకాదన్నా ప్రజల ఆకాంక్ష ఉంది. అంటే ఏమిటి దీంట్లో మనం అనే ప్రశ్న వచ్చినప్పుడు. ఎక్కడో ఒకచోట మనం కమిట్ కావాల్సి వస్తుంది. బహుశా ఇదే న్యాయం కావొచ్చు అనుకున్నాను. కొంత న్యాయం జరగొచ్చు అని నేను హుజురాబాద్‌లో పబ్లిక్ మీటింగ్ జయశంకర్ పెడుతుంటే అక్కడికి వెళ్లి మొదటిసారిగా మూవ్‌మెంట్‌కు సపోర్టు చేశాను. 

రాష్ట్ర విభజనను ఎందుకు వ్యతిరేకించారు? 

ఇక్కడ నాకు ఇంకో సమస్య కూడా ఉంది. ఆంధ్ర ప్రాంతం నన్ను ప్రేమించిన ప్రాంతం. నా పట్ల చూపిన గౌరవం ప్రత్యేకంగా ఉంది. అది నెల్లూరే కావొచ్చు, విశాఖపట్నమే కావొచ్చు, నార్త్ ఆంధ్రే కావొచ్చు, గుంటూరే కావొచ్చు. నేను రిటైర్డ్ అయిన తర్వాత గుంటూరులో ఒక్క రోజు 21 సంఘాలు సన్మానం చేశాయి. విభజనకు అభిమానం అడ్డు వచ్చింది. కానీ ఇది నా వ్యక్తిగతమే కావొచ్చు. నా వ్యక్తిగతమైన బలహీనత కూడా. కానీ నా వ్యక్తిగత బలహీనతను సమాజం మీద రుద్దలేను కదా. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం తప్పని పరిస్థితి. అనివార్యంగా తెలంగాణ కోసం మనం మాట్లాడాల్సిందే అని అర్థం అయింది. ఉద్యమం బలంగా నడుస్తోంది. ప్రజల ఆకాంక్ష కూడా చాలా బలంగా ఉంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ సాధించుకున్నాం. ప్రజల ఆకాంక్షలను రాజకీయాలు సంపూర్ణంగా స్పందించడంలో కానీ వ్యక్తీకరించడంలో కానీ ఒక పెద్ద అగాథం ఏర్పడ్డది. సాధారణంగా ఉద్యమాలు జరిగినప్పప్పుడు ఈ అగాథం తక్కువ ఉంటుంది. 

తెలంగాణలో ప్రస్తుత సీఎం రేవంత్ పాలన ఎలా ఉండబోతుంది?

గత పాలన మీద విజయం సాధించి సీఎం అయ్యాను కాబట్టి నేను ప్రజాస్వామ్యాన్ని  గౌరవిస్తాను, హక్కులను పరిరక్షిస్తాను, ప్రజలతో సంభాషిస్తాను అనే వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ఇవన్ని ఉన్నాయి. అయితే డెమోక్రసీని గౌరవించినా గౌరవించకపోయినా సంపద పెరగాలి అనే అభివృద్ధి మోడల్‌కు అలవాటు పడిపోయారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో పెద్దగా మార్పు ఉండదు. కానీ పరిపాలనలో కొంత వెసులుబాటు ఉంటుంది. కాబట్టి జనాలకు కొంత రిలీఫ్ దొరుకుతుంది. అయితే కాంగ్రెస్‌లో ఉండే అంతర్గత విధానం ఏంటంటే దీంట్లో పోటీ తత్వం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రిగా పోటీ పడుతుంటారు. కేసీఆర్‌లా అంతా నేనే అనే పరిస్థితి ఉండదు. అందుకే కాస్త ప్రజాస్వామ్యయుతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అందుకే సంఘాలతో, పౌర సమాజంలో నిత్యం ఏదో మేరకు సంభాషించే వెసులుబాటు ఉంటుంది.

ఒక వేళ కేంద్రంలో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే తెలంగాణ రాజకీయం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది. కేంద్రంలో వీళ్ల ప్రభుత్వమే  ఉంటే ఇక్కడ బలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఎక్కువకాలం కాంగ్రెస్‌ను కొనసాగనివ్వదు. కాంగ్రెస్‌లో మిగతా వాళ్లు కూడా సీఎం కావాలనుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్‌ను చీల్చడం బీజేపీకి సులభం అవుతుంది. అయితే ఇక్కడ కూడా ప్రజల్లో పరిపాలన పరంగా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ దీన్ని పడగొట్టాలని చూసినా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చివేసినప్పుడు ఎలాంటి వ్యతిరేకత అయితే వచ్చిందో అలా ప్రజల నుండి సపోర్టు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నూతన ఆర్థిక విధానాల విషయంలో ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల లాగానే కొనసాగిస్తూవుంటే ఎక్కువ కాలం మనుగడ సాగించడం కష్టం.

మేడం గురించి ఏమైనా చెప్పండి?

ఒక కవి ఎమంటాడంటే గొడవలు లేకుండా జీవించిన దాంపత్యం చాలా అందమైనది. గొడవలు పడుతూ జీవించిన జీవితం అద్భుతమైనదని. మా దాంపత్యం అద్భుతమైనదనే చెప్పాలి. నేను బయట తిరిగి పనిచేయడాన్ని ఆమె వ్యతిరేకించదు కానీ ఆమెకు కొన్ని భయాలు ఉంటాయి. కానీ ఎవరైనా వచ్చి భయపెట్టినా తనేం భయపడదు. కారణం తాను లెక్చరర్‌గా పని చేసింది. అక్కడ ఉండే ప్రెజర్స్ అన్నీ చూసింది కాబట్టి కొంత అర్థం చేసుకోగలదు. అక్కడ ఉండే వర్క్ ప్రెజర్స్ మళ్లీ బయటకు వెళ్లాక వచ్చే ప్రెజర్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటి విషయంలో కొంత కంప్లుంట్స్, టెన్షన్స్ ఫ్యామిలీలో ఉంటాయి. కానీ మీరు ఈ పనిచేయకూడదని గానీ ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే పౌరహక్కుల ఉద్యమంలో పనిచేసిన కన్నాభిరాన్, ఖాన్, బాలగోపాల్, పురుషోత్తం వంటి వాళ్లు చాలా సార్లు ఇంటికి వచ్చివెళ్లేవాళ్లు. వాళ్లకు సమాజంలో ఉండే గౌరవం అర్థం చేసుకునేది. వీళ్లేమీ చెడ్డవాళ్లు కాదుగదా అనే ఒపీనియన్ ఆమెకు ఉండేది.

అయితే ఒక భయం కూడా ఉండేది. ఒకసారి బాలగోపాల్‌ను ఖమ్మంలో కొట్టినప్పుడు దాదాపు 21రోజులు ఇక్కడే మా ఇంట్లోనే ఉన్నాడు. ఆయనకు దగ్గరుండి సపర్యలు చేసింది. అలాగే పురుషోత్తంని చంపేశారని తెలిసినప్పుడు. స్పృహతప్పిపోయింది. విపరీతంగా ఏడ్చింది. అందుకే అలాంటి భయాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ రెండింటీని బ్యాలెన్స్ చేస్తూ నాకు సహకరిస్తుంది. కలెక్టర్‌ను నక్సల్స్ కిడ్నాప్ చేసినప్పుడు మధ్యవర్తిగా వాళ్ల దగ్గరికి వెళ్లినప్పుడు తను కూడా రావడానికి సిద్ధపడింది. కానీ చిన్న హెలికాప్టర్‌లో వెళ్లడం వీలుకాలేక రాలేదు. కానీ మిగతా సందర్భాల్లో అభ్యంతరం చెప్పదు. తను వచ్చిందే ఫ్యూడల్ లాండ్ లార్డ్ ఫ్యామిలీ నుండి. చదువుతో పాటు అన్నింటి విషయంలో స్ట్రగుల్ పడుతూనే సాధించుకున్న స్వభావం కాబట్టి తనలో ఉన్న మిక్స్‌డ్ స్వభావం నన్ను అర్థం చేసుకుంటుంది.

1969, 2009 ఉద్యమానికి తేడా ఏంటి?

1969లో ఎమోషన్ ఎక్కువగా ఉండే కాబట్టి ఉద్యమం బాగా జరిగింది. నేను ఆర్ట్స్ కాలేజీలో టీచ్ చేస్తున్న సమయంలో మురళీధర్ అనే ఒకాతను చాలా అగ్రహ పడ్డాడు. ‘తెలంగాణ ఒస్తే నీ రక్తం ఆర్ట్స్ కాలేజీ మీద చల్లుతా’ అని. అయ్యా రాదయ్య బాబు..? వాళ్ళ నాయకత్వంలో తెలంగాణ రావడం సాధ్యం కాదని నేను వాదించేవాణ్ని. అట్లా ఆ రోజుల్లో మళ్లీ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత 2009 ఆ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలోనే నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, అభివృద్ధి విషయంలో మనం ఏం పరిష్కార మార్గాలు కనుక్కోలేమా..? కొంత తెలంగాణకు అన్యాయం జరిగిందని మనం అంగీకరిస్తే.. తెలంగాణకు జరిగిన అన్యాయానికి ఉమ్మడి రాష్ట్రంలోనే మనం దీనికి మనం పరిష్కారం కనుక్కోలేమా? అని ఒక ప్రయత్నంలో ‘కృష్ణ జలాల పునఃపంపిణి’ అని తీసుకొచ్చాం. దానికి నేను, బాలగోపాల్ కన్వీనర్స్‌గా ఉన్నాం. ముఖ్యంగా బాలగోపాల్  నీళ్ల మీద చాలా అధ్యయనం చేశారు. అధ్యయనంలో భాగంగా పరిష్కార మార్గాన్ని అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లాం. ఇంత స్టడీ చేసి రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లితే ఎవరూ కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోవడానికి సిద్ధంగా లేరని అర్థం అయింది. రాజశేఖర్ రెడ్డి దగ్గరకు వెళ్లి అడిగితే ఆయన ఒక్కటే చెప్పారు.

ఈ కృష్ణా నదిలో నీళ్ళు ఎక్కడ ఉన్నాఅన్నారు. అదేంటి సర్ 800 అండ్ 39 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి కదా అని అడిగాం. అంత అయిపోయింది. అదేం లేదు అన్నాడు. మళ్ళీ దానిపై కొద్దిసేపు వాదించాం. ఆయన కృష్ణాజలాల మీద ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని చేప్పేశారు. బాలగోపాల్ ఏంటంటే మేం ఒక ఫార్ములా చేశామండి.. మీరు ఫార్ములా చూడండి.. అంటే చూసేదేంటి? అని రిజెక్ట్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత నాకు, బాలగోపాల్‌కు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఏంటి రాజకీయ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కార మార్గాలు కన్కుక్కోవాలన్న విషయంలో ఇట్లా రియాక్ట్ అయ్యారని చాలా ఆశ్చర్యం వేసింది. వెంటనే బాలగోపాల్ అన్నారు మనం ప్రజల దగ్గరకు వెళ్లాలన్నారు. అప్పుడు నాకు కూడా అనిపించేది ఏంటంటే.. తెలంగాణలో ఏమో జయశంకర్ నాకు సన్నిహితులు. కోదాండరామ్ నేను కూడా కలిసి పని చేశాం. జనార్థన్ అని ఒక అబ్బాయి ఉండే వాడు.. ఇప్పుడు చనిపోయాడు. జనార్థన్ ఒక రోజు వచ్చి నా మీద గోడవ చేశాడు. మీరెందుకు రారు తెలంగాణ ఉద్యమానికి.. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా రండి సర్.. రండి సర్ అనేవారు. నా అభిప్రాయం ఏంటంటే మూవ్‌మెంట్ వచ్చిందని పోవడం కాదు కదా! దీనికి గట్టిగా నిలబడి ఒక అల్టర్నెట్ వెతకాలి కదా అని అభిప్రాయం.

మళ్లీ ఉద్యమాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందా?
తెలంగాణలో రెండు ఉద్యమాలు జరిగాయి. ఒకటి 1969, రెండోది 2009 మలిదశ ఉద్యమం. వరంగల్‌లో రెవల్యూషనరీ ఉద్యమాలు చాలా వచ్చాయి. ఇప్పుడున్న మావోయిస్టు పార్టీలో ఎక్కువమంది ఆ ఉద్యమాల నుండి వచ్చినవాళ్లే. ముఖ్యంగా కొండపల్లి సీతారామయ్య వంటి వాళ్లు అక్కడ టీచర్‌గా పని చేయడం కారణం కావచ్చు. అయితే నేను కొంత కాలం డబ్బులు తీసుకోకుండా కోచింగ్ చెప్పిన సమయంలో 10మంది విద్యార్థుల దాక ఐఏఎస్‌లు అయ్యారు. కొద్ది మంది పొలిటీషియన్స్ అయ్యారు. అందులో ఇప్పుడు మినిస్టర్‌గా ఉన్న శ్రీధర్ బాబు కూడా ఒకరు. అయితే ఆ రోజుల్లో విప్లవోద్యమం బలంగా ఉండటం వల్ల ఉద్యమాలు వచ్చాయి. అదే విధంగా 2009లో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో లక్షలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. వీళ్లే లేకపోతే ఉద్యమం ఇంత వైబ్రెంట్‌గా ఉండేది కాదు. విద్యార్థులు క్రియాశీలకమైన పాత్రను పోషించారు. 1969 ఉద్యమంలో విద్యార్థులు 370 మందికి పైగా చనిపోయారు. కానీ రెండో దశలో ఉద్యమాన్ని జాగ్రత్తగా చేయడం వల్ల పోలీసు కాల్పుల్లో చనిపోలేదు కానీ వేరే విధంగా మరణించారు. కానీ పిల్లల యాస్పిరేషన్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే 1990ల నుండి విద్యావ్యవస్థలో తీవ్రమైన మార్పులు రావడం, కాంట్రాక్ట్ వ్యవస్థ రావడం వల్ల విద్యా విధానంలో మార్పు వచ్చింది.

అయితే ఈ ఉద్యమం తర్వాత మార్పు వస్తుందనుకున్నాం కానీ రాలేదు. ఆనాడు విద్యార్థులు చదువుకునేందుకు దేశ విదేశాల నుండి అనేక జర్నల్స్ వచ్చేవి, విభిన్న అంశాలను చదివే అవకాశం ఉండేది. కానీ ఈ మొత్తం కాలంలో ఆ వ్యవస్థ అంతా నాశనం అయ్యింది. మా లాంటి వాళ్లం తెలంగాణ వచ్చిన తర్వాత  విద్యావ్యవస్థలో పూర్వ వైభవం వస్తుంది అనుకున్నాం కానీ అది జరగలేదు. చివరకు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ల పాలన కాలంలో అయినా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్లను అపాయింట్ చేసేటప్పుడు మా లాంటి వాళ్లం చెబితే వినేవాడు. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది.  అందుకే పెద్దగా ఉద్యమాలు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. స్కూళ్లను, కాలేజీలను, యూనివర్సిటీలను నాశనం చేశారు. ఈ పరిస్థితిలో ఉద్యోగావకాశాలు కల్పించకపోతే, ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తప్పకుండా ఉద్యమాలు వస్తాయి. ఇవాళ మనం అమెరికాలో చూస్తే అన్ని యూనివర్సిటీలలో ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. 1960లో కూడా ఇలానే ఉండేది. వియాత్నాం యుద్ధం సందర్భంగా విద్యార్థులంతా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు. ఇప్పటి యూత్ రెస్ట్ లెస్‌గా ఉన్నారు. కానీ వాళ్లకు ఓ విజన్, ఓ డైరెక్షన్ అనేది లేకపోవడం వల్ల ఉద్యమరూపం తీసుకోలేకపోతోంది.

పౌరహక్కుల ఉద్యమంలోకి రావడానికి కారణం ఏంటి?

నేను వరంగల్‌లో ఉన్నకాలంలోనే ఎమర్జెన్సీ రావడం, పౌరహక్కుల ఉద్యమాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో నేను తరుచూ ఆ మీటింగ్‌లకు వెళ్లేవాణ్ని. 1981లో బాలగోపాల్ పౌరహక్కుల ఉద్యమంలో జాయిన్ అయ్యారు. అతి తక్కువ కాలంలోనే దాని కార్యదర్శికూడా అయ్యారు. అన్ని రంగాల్లో ప్రతిభావంతుడు అని చెప్పవచ్చు. అతని జీవితం ఆకర్షించింది. అదే సమయంలో వరవరరావు టీచర్‌గా ఉండటం, మేం ఇద్దరం కలిసి మీటింగ్స్ వెళ్లే వాళ్లం. అలాగే కన్నాభిరాన్, రామనాథం వంటి వాళ్లు పరిచయం. వాళ్ల ప్రభావం నా మీద బాగా ఉండేది. 1985లో నేను పౌరహక్కుల సంఘానికి వైస్ ప్రెసిడెంట్‌గా అయ్యాను. యూనివర్సిటీల్లో పాఠాలు చెప్పేదే రాజకీయాలు, హూమన్ రైట్స్ గురించి కాబట్టి సహజంగానే పౌరహక్కుల ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఏర్పడింది. ప్రాక్టికల్ అనుభవాలను క్లాస్ రూంలో చర్చించే అవకాశం ఉండేది. అందుకే అకాడమిక్ వాతావరణ, పౌరహక్కుల ఉద్యమం రెండు కూడా ఎప్పుడు విభిన్నమైనవిగా అనిపించలేదు.

బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా?

ఒకసారి నయీం నుండి బెదిరింపులు వచ్చాయి. అతను చాలా మందిని చంపుతూ పోయాడు. కొంత మందిని చంపుతాను అని ప్రకటించిన వాళ్లలో నా పేరు కూడా ఉంది. ఆ సమయంలో పేరు చెప్పడం, వాళ్లను చంపడం చేశాడు. ఆ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. మధ్య తరగతి జీవితాలలో అనుకున్నంత ధైర్యం సహజసిద్ధంగానే ఉండదు. పెరిగిన వాతావరణం కారణంగా భయంలోనే పెరుగుతారు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఆ భయం అనేది పనిచేస్తుంది. నా గురించి నువ్వు ఎక్కడా మాట్లాడకూడదు అంటూ ఫోన్ చేసి భయపెట్టాడు. మేం మాట్లాడేదే పౌరహక్కుల గురించి కదా నువ్వు జనాలను చంపుతూ పోతున్నావు కాబట్టి  మాట్లాడకుండా ఎలా ఉంటాం. అంటే లేదు నా గురించి ఎక్కడా మాట్లాడకూడదు అంటూ, మాట్లాడితే మాత్రం సీరియస్‌గా ఉంటుందని భయపెట్టాడు. నేను మాత్రం  నువ్వు ఎంత భయపెట్టినా మాట్లాడటం అనేది ఆగదు. నువ్వు నీ పనులు మానుకుంటే నేను మాట్లాడటం మానేస్తాను అని చెప్పాను.

ఒక 30, 45 నిమిషాల సంభాషణ జరిగింది అతనితో.. వాళ్లు జనం కోసం పనిచేస్తున్నారు లక్షల మందిని సమీకరిస్తున్నారని నేను అంటే ‘దానిదేముంది, సార్ నేను కూడా మీటింగ్ పెడితే ఐదు లక్షల మంది వస్తారు’ అన్నాడు. నేను వెంటనే నయీం నువ్వు అంత మందిని సమీకరించి మీటింగ్ పెడితే ఆ మీటింగ్‌లో నేను చీఫ్ గెస్ట్‌గా ఉంటాను పో అని చెప్పాను. చివరికి ఏమనుకున్నాడో ఏమో కానీ మీరు చాలామందికి అడ్వైజర్‌గా ఉంటారు కదా సార్ మాకు కూడా ఉండండి సలహాలు ఇవ్వండి అని అన్నాడు. ముందు నువ్వు ఈ  పనులను మానుకోమని చెప్పాను. అవసరం అయితే మవోయిస్టులతో నీకు మీటింగ్ అరెంజ్ చేస్తాను. నేను మధ్యవర్తిగా పనిచేసిన ఉన్న అనుభవం ఉంది కాబట్టి విషయాన్ని మాట్లాడుకొని సెటిల్ చేసుకో, పీస్‌ఫుల్ లైఫ్ జీవించు అని చెబితే లేదు సార్ “ఆ కొడుకులు నన్ను చంపుతారు” అంటూ అభ్యంతరకంగా మాట్లాడాడు. అలాంటి భయాలు సహజంగానే ఉంటాయి. అన్నింటికి సిద్ధపడాలి.