calender_icon.png 27 October, 2024 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంపశయ్యపై ఆది ధ్వని!

15-05-2024 12:05:00 AM

ఇప్పటి సమాజానికి తెలియని ఎన్నో కళలు ఉన్నాయి. అతి ప్రాచీన కళలకు గుర్తింపు లేక ఎన్నో అంతరించిపోతున్నాయి. వాటిలో జానపద కళాకారులు వాడిన వీరణాలు, మూగ డోలు/ మువ్వ డోలు, రుంజ, కొమ్ము బూరలు వంటి సంగీత వాయిద్యాలున్నాయి. వాయిద్యం తాను పుట్టినప్పటి నుంచి ఎన్నో ఘర్షణలను, పోరాటాలను ఎదుర్కొని నిలిచింది. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, వర్గకుల పోరాటాల సంక్షోభాలు, సాంస్కృతిక వినాశనాలను ఎదుర్కొంది. ఆకాశం, నేల, ప్రకృతి కలగలసిన శబ్దం ఒక్కొ వాయిద్యమై మనిషిని మహోన్నతునిగా చరిత్రలో నిలిపాయి. ప్రస్తుతం సంగీతానికి సంబంధించిన కొన్ని వాయిద్య పరికరాలు ఒక్కొక్కటిగా హననం అవుతున్నాయి. అంచులకు నెట్టివేయబడుతున్నాయి. కనుమరుగు అవుతున్న అరుదైన వాయిద్య పరికరాల గురించి ఈ వారం మన ఖజానాలో..!

"మానవీయ ధ్వనులు మాయమై కొత్త ధ్వనుల ‘కోలాహలం’ సంగీతమవుతున్న సమయం ఇది. ఎన్ని రకాల శబ్దాలు రాగాలు, తాళ గతిలయలు. అన్నింటికన్నీ అణగారిపోతున్నాయి. వైవిధ్యత తగ్గి యాంత్రికత పెరుగుతోంది. ఏకవాద నమూనా తెరపైకి తరుముకొస్తుంది. అందుకే వాద్య బహుళత తగ్గి, నాలుగు వైపులా సంగీతసృజన తరిగి శబ్దంలో బల‘హీన’త పెరిగింది. దేశీయ సంగీత సంప్రదాయ వాద్య నైపుణ్యాలు చివరిదశకి చేరాయి. ప్రస్తుతం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. వాటిని భద్రపరుచుకోవడం, కాపాడుకోవడం ప్రభుత్వాలు కల్పిస్తే బాగుంటది. జానపద గిరిజన సంగీతంలో ఫ్రీడమ్, అవకాశాలు, అవసరాలు ఎక్కువ. వాటికి అనుగుణంగా సంగీత వాయిద్యాన్ని, వాదనని మారుస్తూ ఉంటారు. కళారూపాలను, కళకారులను, వాయిద్యాలను బతికించుకోవడం నేడు మన బాధ్యత. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని ముందడుగు వేస్తే అంతరించిపోతున్న కళరూపాలను కాపాడుకోవచ్చు."

     జయధీర్ తిరుమలరావు, విశ్రాంత ప్రొఫెసర్ 

కొమ్ము బూరలు

కొమ్ము బూరను అడవి దున్న కొమ్ముతో తయారు చేస్తారు. బూరను గట్టిగా, బలంగా ఊదితే ఏడు గూడేలకు వినిపించేంత శబ్దం వినిపిస్తుంది. అడవి దున్న ఏదైన జంతువు దాడి వల్ల చనిపోయినప్పుడు లేదా ప్రమాదం వల్ల మరణించినప్పుడు మాత్రమే దున్న కొమ్మును ఆదివాసీలు సేకరిస్తారు. బూరను ఎప్పుడు ఊదుతారంటే దైవాలను స్మరించుకునేప్పుడు, తమ పూర్వీకుల ఆత్మలను ఆవహన చేసుకున్నప్పుడు వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆ అడవి దున్నలు తగ్గిపోయాయి. అంటే ఎక్కడో పాతది 20 ఏళ్ల కిందిదో.. 500 ఏళ్ల కిందిదో ఉన్నాయి. కానీ అవి కూడా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రభుత్వ అధికారుల అవగాహన లోపం వల్ల ఈ సంగీత వాయిద్యాల తయారీ ఆగిపోయింది. ఇప్పుడు వీటిని తయారు చేయలేరు, దాన్ని వాయించనూ లేరు. సంగీతం ఒక గొప్ప సంస్కృతిక వ్యక్తీకరణ, వేల ఏళ్ల నుంచి వస్తున్న వ్యక్తీకరణ, ఈ వ్యక్తీకరణ పోవడం బాధాకరం. దానికి బదులుగా జాతరలో బూరలు ఊదటం చేస్తుంటారు. అవి వికృత, పిచ్చి శబ్దాలను వినిపిస్తాయి. సహజంగా కొమ్ము నుంచి ఊదే వాయిద్యంలో మెలోడి ఉంటుంది. కృత్రిమమైన కొమ్ము బూరలు ఊదటం వల్ల భయంకరమైన, కర్ణ కఠోరమైన శబ్దాలు వెలువడటం జరుగుతున్నది. సహజ సిద్ధమైన వాయిద్యాలకు బదులుగా కృత్రిమ మైన వాటిని ఉపయోగించడం బాధాకరం. దండకారణ్యంలో కూడా అవి తగ్గిపోయాయి. పులి వేటాడి చంపిన దున్న కొమ్మును, చర్మాన్ని తీసుకొని వాయిద్యల రూపంలో బతికించేవాళ్లు ఆదివాసీలు. దానికొక కొత్త జన్మనిస్తారు. ఇది ప్రస్తుతం కనుమరుగు అవుతున్న వాయిద్య పరికరం.

వీరణాలు

తెరచీరల వాళ్లు కూడా కథలు చెప్పేటప్పుడు వీటిని ఉపయోగిస్తారు. వీటి తయారీ కష్టమైనది. వాయించడం మరీ కష్టతరం. దీన్ని తయారు చేయడంలోనే కాదు భద్రపరచడంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. యాదవుల ఉపకులం అయిన తెరచీరల వారు ఉపయోగించే చర్మ వాద్యమే వీరణం. సాధారణంగా ఒకటి కర్రతో, రెండోది ఇత్తడి లేదా కంచుతో తయారు చేసి ఏకవాద్యంగా మలుస్తారు. దాదాపు మూడు జానల పొడవు, ఒక జానెడు వెడల్పు ఉండే వీరణం జోడీలో ముందుది కాస్త చిన్నగా, వెనకది కొద్దిగా పెద్దగా ఉంటాయి. రెండువైపులా చర్మం కప్పుతారు. ఒక దిక్కు చేతి వేళ్ళతో వాయిస్తారు. రెండువైపులా చర్మం కప్పుతారు. ఒక దిక్కు వాయిస్తారు. రెండు రకాల వాద్యంతో ఒకే తాళ గతులతో శబ్దం ఐదు రకాల వాద్య ధ్వనులను వెలువరిస్తారు. ఎంతో చక్కగా రాగతాళ ధ్వనులు పలికించగల నేర్పరులు ఈ వాద్యకారులు. ప్రధాన కథకుడికి ఇరువైపులా గల సహాయకులు వంత, సంగీత వాద్య సహకారం అందిస్తారు. వాయిస్తూ ముప్పు రకాల కథలు పాడతారు. దీనిని వినడం ఒక గొప్ప అనుభవం. రుంజ వాయిద్యం చాలా ప్రత్యేకమైనది. దీని తయారీ కూడా చాలా కష్టం. ఇప్పుడు వాటిని తయారు చేసేవాళ్లు కూడా తగ్గిపోతున్నారు. భయంకరమైన శబ్దలను పలికించడంతో పాటు మర్థవమైన శబ్దలను పలికించడం దీని ప్రత్యేకత.

మూగ/ మువ్వ డోలు

మూగ, డోలు తయారీకి పెద్దమాను చెట్టు బాగా లావుగా వుండి చేవ పట్టిన చెట్టు మొదలును నరికి మూగ అయితే రెండు మీటరు, డోలు అయితే ఒక మీటర్లు పొడుగు నరికి దానిపై ఉండే వేళ్లనంతా కావలసిన సైజుకి గొడ్డలి, బాడిస, ఉలులతో చెక్కుతారు. మూగ వెడల్పాటి పక్క అడుగు వ్యాసంతో రెండవ పక్క తొమ్మది అంగుళాల వ్యాసంలో ఉంచుతారు. పైనున్న ఎల్ల మొత్తం చెక్కిన తర్వాత చుట్టూరా అర అంగుళం మందం వదలి గొట్టం లాగా లోపలి కర్రనంతా తొలిచి తీసివేస్తారు. చెక్కడం పూర్తి అయిన తర్వాత నునుపుగా ఉండేందుకు దూగోడ పట్టిన తర్వాత ఆముదాన్ని డోలు కర్రకంతటికీ పట్టిస్తారు. డోలు కొయ్య పెలుసుగా మారి పగుళ్ళు రాకుండా ఆముదం నూనె కాపాడుతుంది. అదే క్రమంలో డోలుకొయ్య నునుపు బాగా పెరిగినట్లుగా కన్పిస్తుంది. ఎప్పుడైనా వర్షంలో తడిసినా కర్రకు నీరు పట్టదు. ఎండలో ఎండినా పెళుసు వచ్చి పగుళ్ళు రావు. ఇలా తయారు చేసిన మూగ, డోలి కొయ్యలను పూర్వకాలంలో కొండగొర్రె, కొండముచ్చు తోలుతో బాగా మూసేవారు. ప్రస్తుతం మేకతోలును ఉపయోగిస్తున్నారు. ఈ డోలుని రకరకాలుగా వాయిస్తూ కొలుపులు చేస్తారు. నృత్యాలు చేసేటప్పుడు వాయిస్తారు.

రుంజ వాయిద్యం

రుంజ వాయిద్యం చాలా ప్రత్యేకమైనది. పెద్ద డ్రం వాద్యంగా దీన్ని చెప్పొకోవచ్చు. మెక్సికో, ఆఫ్రికా దేశాలలోని ఆదివాసీలు ఇలాంటి పెద్ద చర్మవాద్యాలను ఉపయోగిస్తారు. కళాకారుడు నడుం భాగం వరకు మీటరు నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. మొదట చెట్టుకాండం తొలిచి ఒకవైపు చర్మాన్ని అతికిస్తారు. కొన్ని చోట్ల తాటి చెట్టు లేదా కేరళలోనయితే పెద్ద కొబ్బరి చెట్టు నరికి డొళ్లనీ తయారు చేసేవారు. ఆ తరువాత లోహం కనిపెట్టబడిన తరువాత ఇనుము, ఇత్తడి వంటి లోహాలతో వాయిద్యాల తయారీ మొదలైంది. రుంజ వాద్యం వాయించేవారు విశ్వకర్మలకు ఉపకులం. వీరు కూడా పంచాణం సంస్కృతిలో ఉన్నవారే. కాబట్టి మొదట తామే ఇత్తడితో ఈ వాద్యాన్ని తయారు చేసుకున్నారు. రౌంజకాసురుని వధించి అతడి వివిధ అంగాలతో వాద్యం తయారు చేశారు. కాబట్టి దీనికి రుంజ, రౌంజ అని పేరు వచ్చింది. తలను నరికి శరీరాన్ని డొల్లగా జేసి నరాలను తాళ్లుగా చేశారట. బాహువులు వలయాలుగా, సన్న నరాలు అడుగు చిక్కంగా, తల జుట్టు మెట్టు తాళ్లుగా, చర్మాన్ని పైన బిగించారు. అతడి వేళ్ళని రుంజ వాయించే పుల్లలుగా చేశారు.

రుంజ పై 32 రకాల వాద్యాలను పలికిస్తారు. సప్త స్వరాలను వినిపిస్తారు. ఇరవై రాగాలు వాయిస్తారు. రుంజ కళాకారులు నడుం వరకు గల పొడవైన ఈ వాద్యం పై రెండు చేతులతో ఒకేసారి మోగిస్తారు. రెండు పుల్లలను వాయిస్తూ విచిత్ర శబ్దాలతో విశ్వకర్మ చరిత్రని సృష్టిస్తారు. రుంజని వాయించేటప్పుడు డెభ్బైరెండు కీళ్ళు, అరవై ఆరు నాడులు, మణుగు నాలుగు సేర్ల మాంసకండరాలు కిందమీదకు కదులుతాయి. కళాకారుని నవరంధ్రాలు వాద్యానికే అంకితం అవుతాయి. ఈ కళాకారులు రోజుల తరబడి విశ్వకర్మ పురాణం గానం చేస్తారు. రుంజ గాన సంప్రదాయం, ప్రదర్శన అపురూప రాగపర్వతం. అన్ని సంగీత వాద్యాల వలనే దీనికి కాలం దగ్గర పడింది. మొత్తం రాష్ట్రంలో నిపుణులైన వారు ఇద్దేరే మిగిలారు. భావోద్వేగం, వీరోద్రేకం, నవరస ప్రధానమైన జీవితం సంగీతానికి పునాది. ఆదిమ సమాజంలో అనుకరణ అవసరం. శబ్దానుకరణ సంగీతమైంది. సమాజంతో విడివడి శాస్త్రీయమైంది. దీనికి పునాదిగా ఉన్న ఆదివాసీ, జానపద వాయిద్యాలు మాత్రం అనామకమయ్యాయి.