calender_icon.png 21 April, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీపిక

21-04-2025 02:02:00 AM

ఇరివెంటి కృష్ణమూర్తి 26 వర్ధంతి

కొవ్వొత్తి కన్నీరు కారుస్తూ

కరిగిపోయింది

వెలుగు కోసమే వెలిగింది

తనకంటే ఎన్నోరెట్లు వెలుగగల్గిన

వేడి వెలుగుకు వినమ్రంగా

నమస్కరించి పోయింది

చేతనైనంతవరకు 

చీకటి నెదిరించింది 

కన్నీటికి విలువ వుందని చాటింది 

వెచ్చదనం వుంటేనే 

వెలుగ వచ్చుననే సత్యాన్ని చాటింది

తన కాంతిని పంచి యిచ్చింది 

తన కాంతిని పంచుకోనిచ్చింది 

తన వలెనే పరులు 

వెలిగితే సంతసించింది

తాను సూర్యునికి ప్రతినిధినని 

నిక్కి చెప్పుకోలేదు కాని 

ఒణుకుతూ ఒణుకుతూ 

పదే-పదే అవే మాటలు చెప్పింది 

తరతమ భేదాల పోనాడి 

అడిగిన వారికి వెలుగునిచ్చింది 

స్నేహము లేనిదే తాను వెలుగనన్నది 

తన బ్రతుకుకు మారుపేరు 

వెలుగన్నంది 

జ్ఞానానికి జీవితానికి 

పరమాత్మకు ప్రతీకయై నిల్చింది 

తన వెలుతురులో కన్ను తెరచి 

బ్రతుకమన్నది -

తనను మాత్రం ముద్దిడుకోవద్దన్నది 

తనను పూజించమని వేడుకొనలేదు

వెలుగును పూజించిన లాభమేమి?

ప్రేమించిన లాభమేమి?

వెలుగు వలె బ్రతుకవలెనంతే.

ప్రేమించి ముద్దిడుకొన్న

పతంగాల తతంగం అంతరిస్తుంది.

పతంగాల పక్షాల గాలి తాకిడికి 

తాను సురిగిపోదు

వెలుగుతో ఎలా మెలగాలో

తెలుసుకోలేని పతంగాలను

మందలించ బోలేదు దీపిక

వెలుగును కోరువారి లక్షణం 

అది కాదు కనుక

ఓపికతో దీపికను చూడు 

ఇదే మాట  -ఇదే మాట

అది వెలిగి  -వెలిగి చెప్పుతుంది

దీపిక ప్రాణం  ప్రణవం 

సత్యం శివం --సుందరం.

‘వీచికలు’ కవితా సంకలనం నుంచి.. ‘ఆర్కైవ్.ఆర్గ్’ సౌజన్యంతో..