17-03-2025 12:11:48 AM
36 మంది మృతి.. చాలా చోట్ల ఇళ్లు నేల మట్టం
వాషింగ్టన్, మార్చి 16: అమెరికాలో టోర్నడోలు, తుఫానులు బీభత్సం సృష్టించడంతో 36 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. శనివారం కాన్సస్‌లో తీవ్ర ధూళి తుఫాను వల్ల ముందు వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడంతో సుమారు 50కిపైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక పోలీసులు వెల్లడించారు. అలాగే మిస్సోరీలోని బేకరర్స్ ఫీల్డ్‌లో తుఫాను కారణంగా 12 మంది, వేన్ కౌంటీలో 6 మంది, ఓజార్క్ కౌంటీలో ముగ్గరు మరణించారు. అంతేకాకుండా టెక్సాస్‌లో వాహనాలు ఢీకొని నలుగురు మరణించారు.
ఆర్కాన్సాస్‌లో తుఫాను బీభత్సానికి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 29 మంది గాయపడ్డారు. టోర్నడోలు, తుఫాను బీభత్సానికి చాలా చోట్ల ఇళ్లు నేలమట్టం అయ్యాయి. సెంట్రల్ అమెరికాలోని 2లక్షల ఇళ్లు, కార్యాలయాలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. తుఫాను కారణంగా ఆర్కాన్సాస్‌లో ఎమర్జెన్సీ విధిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.