calender_icon.png 16 November, 2024 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రిటన్ పీఠంపై స్టార్మర్

06-07-2024 12:00:00 AM

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో 14 ఏళ్ల కన్సర్వేటివ్ పార్టీ పాలనకు తెరపడింది. దీంతో లేబర్ పార్టీ అధ్యక్షుడు కెయిర్ స్టార్మర్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధానిగా స్టార్మర్ నియామకానికి కింగ్ చార్లెస్-3 ఆమోదించారు. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటులో లేబర్ పార్టీ 411కు పైగా స్థానాల్లో ఘన విజయం సాధించగా, కన్సర్వేటివ్ పార్టీ 119 స్థానాలకే పరిమితమైంది. పార్టీ ఓటమికి పూర్తిగా తనదే బాధ్యత అని వీడ్కోలు ప్రసంగంలో రిషి సునాక్ చెప్పుకున్నా వాస్తవానికి ఆయన బాధితుడేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి సునాక్ శక్తి వంచన లేకుండా ప్రయత్నించినా ఆయనకు ముందు ప్రధానులు బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్‌ల తీరుతోనే పార్టీ పతనమైందని, వారు చేసిన తప్పులకు ఆయన బలయ్యారని సొంత పార్టీవారే అభిప్రాయపడ్డారు. ఏడాదిన్నరలో నలుగురు ప్రధానులు మారడం, ప్రభుత్వం తీసు కున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యాయంటున్నారు. జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరిస్తానని, మౌలి క సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతోపాటు సమర్థవంతమైన, నైతిక పాలనను అందిస్తామన్న హామీలతో కెయిర్ స్టార్మర్ నేతృత్వంలో లేబర్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం తాజా ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయానికి దోహదం చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

2019 పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ 85 ఏళ్ల చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సరిగ్గా ఏడాది తర్వాత పార్టీ పగ్గాలు అందుకున్న కెయిర్ స్టార్మర్ ఓటమి బాధనుంచి నేతలు, కార్యకర్తలను బైటికి తీసుకువచ్చి మార్పు దిశగా ప్రయాణం ప్రారంభించారు. ఐదేళ్లలో పార్టీ సిద్ధాంతాలు, విధానాలను ఆధునీకరించి ‘మారిన లేబర్ పార్టీ’గా ప్రజల ముందుంచారు. ఆ నిర్విరామ ప్రయత్నమే 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీకి మళ్లీ అధికారాన్ని తెచ్చిపెట్టింది. 61 ఏళ్ల స్టార్మర్ తొమ్మిదేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2015లో తొలిసారి ఉత్తర లండన్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

2019 లోనూ మరోసారి విజయం సాధించిన ఆయన ఏడాది తర్వాత పార్టీ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. న్యాయవిద్యను అభ్యసించి చదువు పూర్త య్యాక నార్తన్ ఐర్లాండ్ పోలీసులకు మానవ హక్కుల సలహాదారుగా పని చేశారు. కింగ్ చార్లెస్‌ను కలిసిన తర్వాత నూతన ప్రధానిగా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన స్టార్మర్ దేశానికి తన మొదటి ప్రాధాన్యమని తర్వాతే పార్టీ అని స్పష్టంచేశారు.

కాగా, లేబర్ పార్టీ అధికారంలోకి రావడంతో భారత్- సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. గతంలో కశ్మీర్ సమస్యపై లేబర్ పార్టీ  భారత వ్యతిరేక వైఖరిని అనుసరించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ ప్రభుత్వం వైఖరి ఎలా ఉండబోతున్నదనే చర్చ మొదలైంది. భారతీయ మూలాలున్న రిషి సునాక్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇరు దేశాలమధ్య ఆర్థిక, రాజకీయ సంబంధాల బలోపేతానికి కృషి చేశారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునే దిశ గా ప్రయత్నాలు చేశారు. ఈ ఒప్పందంపై రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నా ఒక కొలిక్కి రాలేదు.

అయితే, ఎఫ్‌టీఏతోపాటు సాంకేతికత, భద్రత, విద్య, వాతావరణ మార్పులలో భారత్‌తో మెరుగైన ద్వైపాక్షిక సహకారానికి తాను కట్టుబడి ఉన్నట్లు స్టార్మర్ ఇదివరకే ప్రకటించారు. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌తో  కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలనే నిబద్ధతతో వున్నట్లు ఆయన మేనిఫెస్టోలో స్పష్టంచేశారు. ఎన్నికల ప్రచా రం సందర్భంగా బ్రిటన్‌లోని భారతీయ సంతతి ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన గుళ్లు, గురుద్వారాలు సందర్శించారు కూడా. మారిన కాల మాన పరిస్థితులలో స్టార్మర్ కూడా భారత్‌కు మిత్రుడిగానే కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.