calender_icon.png 23 March, 2025 | 6:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాలి వాన బీభత్సం... హోటల్లు దుకాణ సముదాయాలు నేల మట్టం

22-03-2025 07:24:23 PM

రెండు కార్లు ఆటో ధ్వంసం

కూలిపోయిన చెట్లు విద్యుత్ స్తంభాలు

కొల్చారం,(విజయక్రాంతి): గాలివాన బీభత్సం ధ్వంసమైన హోటల్లు పలు తిను బండరాల దుకాణ సముదాయాలు గాలివానకు నేల మట్టమయ్యాయి. మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారులోని ఏడుపాయల టీ జంక్షన్ వద్ద శుక్రవారం ఈదురు గాలులతో గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో టీ జంక్షన్ వద్ద ఉన్న హర్షిత హోటల్, ఆర్ఆర్ రెస్టారెంట్ తోపాటు పలు దుకాణాలు వాయుదేవుని ఉగ్రరూపానికి ధ్వంసం అయ్యాయి. ఆర్ఆర్ రెస్టారెంట్ ముందు ఉన్న కారు ఆటో ధ్వంసం అయ్యాయి. రోడ్డు పక్కన నిలిపిన ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి.

ఒక్కసారిగా విపరీతమైన ఈదురు గాలులు వచ్చి అరగంటలో తీవ్ర నష్టం ఏర్పడింది. దీంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు. ఏడుపాయల టీ జంక్షన్ నుండి దుర్గా వైన్స్ వరకు దుకాణ సముదాయాలు గాలివానకు ధ్వంసం అయ్యాయి. రేకుల డబ్బాలు ఎక్కడెక్కడో ఎగిరిపడి పోయాయి విద్యుత్ స్తంభాలు విరిగిపడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వాయుదేవుని ఉగ్రరూపానికి తీవ్ర నష్టం వాటిల్లింది. టీ జంక్షన్ వద్ద బతుకుదెరువు కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న ఎందరో సామాన్యులు ప్రకృతి వైపరీత్యానికి రోడ్డున పడిన దుస్థితి నెలకొంది.

వ్యాపారం చేసుకుందామని ఉన్న భూమిని అమ్ముకొని టీ జంక్షన్ వద్ద సుమారు కోటి రూపాయల వరకు పెట్టుబడి పెట్టి రెస్టారెంట్ ప్రారంభించి సంవత్సర కాలంలో నే ప్రకృతి వైపరీత్యానికి హర్షిత రెస్టారెంట్ పూర్తిగా ధ్వంసం కావడంతో యజమాని రాజు బోరున విలపిస్తున్నారు . హర్షిత హోటల్ ధ్వంసం కావడం వలన సుమారు 60 లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. వాయుదేవుని ఉగ్రరూపానికి నష్టపోయిన చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు ప్రభుత్వానికి కోరారు. ఈదురు గాలులకు రోడ్లపై పడిపోయిన చెట్లను జెసిబి సహాయంతో తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్న ఎస్సై మహమ్మద్ గౌస్.