‘లోన్ రికవరీ ఏజెంట్స్’ తీరువల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతున్నాయి. పెరిగిన డిజిటల్ సేవలవల్ల ఈజీగా రుణాలు పొందే అవకాశం ఏర్పడింది. దేశంలో ఎన్నో బ్యాంక్‌లు ఉన్నాయి. రకరకాలుగా బ్యాంకింగ్ సేవలు కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం ఆర్బీఐ పరిధిలో వుంటుందన్న సంగతి తెలిసిందే. అయినా, ‘లోన్ రికవరీ ఏజెంట్స్’ టార్చర్ తట్టుకోలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ముఖ్యంగా బ్యాంక్ సిబిల్ స్కోర్‌పై ఆధారపడి ఉంటుంది. దానివల్ల అదనంగా బ్యాంక్ డబ్బులు వాడుకోవడం కోసం క్రెడిట్ కార్డ్ ఇస్తుంది. ప్రజలు ఇవి తీసుకొని వాడుకున్న తరువాత లోన్ కట్టలేకపోతే రికవరీ ఏజెంట్స్ టార్చర్‌కు లోనవాల్సి వస్తుంది.
ఏజెంట్స్ ఆర్బీఐ బ్యాంక్ గైడ్‌లైన్స్‌ను విస్మరించి రికవరీ చేయడం బాధాకరం. వీరికి ఒక సమయం, అంటూ ఉండటం లేదు. ఏదో సమయంలో కాల్ చేసి, ‘మీ ఇంటికి వస్తాం, ఎక్కడ ఉన్నావ్?, డబ్బులు వాడుకొని ఎందుకు కట్టడం లేదు?’ అని మానసికంగా వేధింపులకు గురి చేయడం భావ్యం కాదు. అనేకమంది ఏజంట్స్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఈమధ్య కాలంలో క్రెడిట్ కార్డ్‌లు బాగా వాడుతున్నారు. దీనివల్ల వచ్చే ఇబ్బందులు కూడా వారు తెల్సుకోవాలి. లేకపోతే, రికవరీ ఏజెంట్స్‌కి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. బ్యాంకింగ్ వాళ్లుకూడా కార్డ్ ఇచ్చేముందు ఎలాంటి నిబంధనలు ఉంటాయో చెప్పరు. కార్డ్ తీసుకున్నాక పరిస్థితులు పూర్తిగా మారుతాయి. లోన్ అమౌంట్ కట్టలేని దశలలో ఏజెంట్స్ ప్రవేశిస్తారు.
ఏమైనా, ఏజంట్స్‌వల్ల మరీ తీవ్ర ఇబ్బందులు ఎదురైతే కస్టమర్ కోర్టుకి వెళ్లి ఇంజక్షన్ పొందే అవకాశమూ ఉంటుంది. అయితే, కస్టమర్ దివాలా తీస్తే ఒకేసారి సెట్టిల్‌మెంట్ చేసుకునే అవకాశమూ ఉంటుంది. కస్టమర్‌కి కూడా చాలా హక్కులు ఉంటాయి. కార్డ్ వాడేవాళ్ళు వీటినీ తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు బ్యాంకింగ్ వ్యవస్థ ఇలాంటి విషయాలలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. పేదవాళ్లు, నిరక్షరాస్యులు అవగాహన రాహిత్యం వల్ల లోన్ కట్టలేని స్థితిలో ఏజెంట్స్ వల్ల ఇబ్బందులు పడకుండా చూడాలి. వేల కోట్లు కొల్లగట్టి దేశం దాటుతున్న కార్పొరేట్ మోసగాళ్లని పట్టుకునే నాథుడు లేడు. కానీ, సామాన్యులను ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఆర్బీఐ కూడా ఏజెంట్స్ విషయంలో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలి.
బి కిరణ్ ఫిషర్