- రోజుకు 7వేల వరకు క్రయవిక్రయాలు
- సాంకేతిక సమస్య కారణంగా 1000కి పడిపోయిన వైనం
- రాష్ట్రవ్యాప్తంగా ఇక్కట్లు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఆధార్ సెంట్రల్ సర్వర్‌లో గురువారం సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశవ్యాప్తంగా యూడీఐఏలో ఈ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ పనిచేయకపోవ డంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు మధ్యా హ్నం నుంచి నిలిచిపోయినట్లు అధికారులు చెప్పారు. సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల రిజిస్ట్రేషన్‌కు వచ్చినవారు ఇబ్బందిపడినట్లు వెల్లడించారు. ఢిల్లీలో వర్షాల కారణంగా యూడీఐఏ ఆన్‌లైన్ వ్యవస్థలో సమస్య తలెత్తినట్లు రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ వెల్లడించారు.
ఆధార్ ఆన్‌లైన్ సేవలకు అంతరాయం వల్ల రాష్ట్రంలోని 140 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో ఆయా కేంద్రాల వద్ద క్రయవిక్రయదారులు బారులుదీరారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణంగా రోజుకు ఏడువేలకు పైగా రిజిస్ట్రేషన్లు అయ్యేవని, సాంకేతిక సమస్య కారణంగా గురువారం 1,000 మాత్రమే జరిగినట్లు ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ వెల్లడించారు. ఈ సమస్యలను అర్థరాత్రిలోగా పరిష్కరిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా రోజుకు ప్రభుత్వానికి రూ. 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఆదాయం వస్తోంది.
శుక్రవారానికి రీ షెడ్యూల్
సాంకేతిక సమస్య కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆధార్ సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ సర్వీసులపై తీవ్రమైన ప్రభావం పడిందని చెప్పింది. గురువారం నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లను శుక్రవారానికి రీ షెడ్యూల్ చేసినట్లు పేర్కొంది.