19-02-2025 01:45:39 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కృష్ణా జలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలం గాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి కేంద్రం రంగంలోకి దిగి సర్దుబాటు చర్యలకు పూనుకోవాలన్నారు.
మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో 2వ అఖిల భారత రాష్ర్ట జలమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరై మాట్లాడారు.. శ్రీశైలం ఆనకట్ట, నాగార్జునసాగర్ కుడి కాల్వ నుంచి కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
కృష్ణానది నీటి వినియో గాన్ని పర్యవేక్షించడానికి టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణకు హక్కుగా ఉన్న వాటాను కాపాడటానికి కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ--॥) కేసును పరిష్కరించాలని కోరారు.
మూసీనది పునరుద్ధరణకు సాయం..
గంగా, యమునా పునరుజ్జీవన ప్రాజెక్టులకు కేంద్రం ఎలా సాయం అందించిందో తమ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సాయం అందించాలని మంత్రి ఉత్తమ్ కోరారు. హైదరాబాద్‌కు నీటి కొరతను తీర్చడంతోపాటు నదీ పర్యావరణాన్ని పునరుద్ధరించడం, మురుగునీటి నిర్వహణను మెరుగుపరచడం కోసం మూసీ ప్రాజెక్టు దోహదపడుతుందన్నారు.
మూసీనది వెంబడి ట్రంక్, ఇంటర్‌సెప్టర్ మురు గునీటి నెట్‌వర్క్‌ల ఏర్పాటుకు రూ.4,000 కోట్లు, గోదావరి నదిని ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలతో లింక్ చేయడానికి రూ. 6,000కోట్లను మంజూరు చేయాలని కోరారు. పాలమూరు లిఫ్ట్ పథకం, సమ్మక్క-సారక్క ప్రాజెక్ట్, సీతారామసాగర్ ప్రాజెక్ట్‌లకు నీటి కేటాయిం పులను వేగవంతం చేయాలన్నారు.
ఎన్‌ఎస్‌డీఏ విచారణ పూర్తి చేయండి
మేడిగడ్డ ప్రాజెక్టుపై ఎన్‌ఎస్‌డీఏ విచారణ చాలా నెలలుగా పెండింగ్‌లో ఉందని, త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ మేరకు జల్ శక్తి మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలన్నారు. కేంద్ర సూచన మేరకు ప్రాజెక్టుల్లో పూడికతీత ప్రయత్నాలను చేపట్టినట్లు, కేంద్రం ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.