calender_icon.png 29 November, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిరాయింపు ఎమ్మెల్యేలను అడ్డుకోం

29-11-2024 03:32:42 AM

  1. ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉత్తర్వులు ఇవ్వబోము 
  2. కేఏ పాల్ మధ్యంతర పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు శాసనసభలో జరిగే ఓటింగ్‌లో పాల్గొనకుండా, సభలో జరిగే వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు స్పీకర్ ఎదుట విచారణలో ఉన్నందున తాము మధ్యంత ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.

తగిన సమయంలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్లను విచారణ పూర్తి చేయాలని తాము ఇటీవలే ఆదేశాలను జారీ చేశామని గుర్తుచేసింది స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉత్తర్వులు జారీ చేయలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్టి జే శ్రీనివాస్‌రావులతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. బీఆర్‌ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, ఎంసంజయ్ కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేఏ పాల్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

దీనిపై తుది ఉత్తర్వులు వెలువరించే వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలనే మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే వరకు తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. కేఏపాల్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను తుంగలోకి తొక్కారని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు.

ఈసారి అసెంబ్లీ సమావేశాలు డిసెంబరు 9 నుంచి ప్రారంభం అవుతాయన్నారు. అసెంబ్లీలో పలు బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని, పిరాయింపు ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొనకుండా చేయాలని కోరారు. అనంతరం దానం, గూడెం మహిపాల్‌రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. పదో షెడ్యూల్ ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోరాదని అన్నారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమేనని చెప్పారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు పై తీర్పును వెలువరించింది. మధ్యంతర పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించింది.

  1. లబ్ధి పొందాక అభ్యంతరం సరికాదు
  2. పలువురు రిటైర్డు అధికారుల పెన్షన్ కేసులో క్యాట్ 

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): ప్రయోజనం పొందేటప్పుడు నిబంధనలకు అంగీకరించి, ఆ తర్వాత అభ్యంతరం తెలపడం సరికాదని క్యాట్ ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలను, చట్టాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని, హైకోర్టుల ఆదేశాలను మాత్రమే ప్రస్తావిస్తే ప్రయోజనం లేదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇబ్బంది కలిగిస్తే తొలుత కాంపిటెంట్ అథారిటీని సంప్రదించాలి కాని, నేరుగా ట్రిబ్యునల్‌కు రావడాన్ని తప్పుబట్టింది.

సుప్రీంకోర్టు అన్ని అంశాలు పరిశీలించి 15 ఏళ్ల నిర్ణయం సరైందే అని ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఆ తీర్పు, ఆ దేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ సమయంలో భవిష్యత్‌లో వచ్చే ఫించన్ నుంచి 40 శాతాన్ని మినహాయించుకోవచ్చు. వారు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందుకుంటారు. ఈ మొత్తాన్ని వచ్చే 15 సంవత్సరాల(75 ఏళ్లు వచ్చే వరకు)కు వారి పెన్షన్ నుంచి రికవరీ చేస్తారు.

తాము పొందిన మొత్తాన్ని వడ్డీతో కలిపి రికవరీ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ 12 ఏళ్లులోపు మొత్తం సొమ్ము రికవరీ అయినప్పుడు సమస్య వస్తుందని పేర్కొంటూ అటవీ శాఖకు చెందిన రిటైర్డ్ చీఫ్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్లతో పాటు మరికొందరు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)లో పిటిషన్ వేశారు. దీనిపై డా. లతా బస్వరాజ్ పట్నే(న్యాయ), షాలినీ మిశ్రా(అడ్మినిస్ట్రేటివ్) బెంచ్ విచారణ చేపట్టింది.

12 ఏళ్లకే పూర్తయితే అప్పటి నుంచి పూర్తి ఫించన్ ఇవ్వాలని పలు హైకోర్టులు తీర్పులిచ్చాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఏపీ రిటైర్డ్ తహసీల్దార్ బొబ్బాది అప్పారావు, మరికొందరు పిటిషన్లు వేయగా, రికవరీ ఆపేయాలని ఏపీ హైకోర్టు ఆదేశిందని వెల్లడించారు. ఎంవీ ఎస్‌ఎన్ ఆచార్యులుతో పాటు మరో 11 మంది దాఖలు చేసిన పిటిన్‌పై తెలంగాణ హైకోర్టు జస్టిస్ సుజోయ్పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ చేపట్టి.. ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిచ్చిందన్నారు. ఇతర పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను వివరించారు. అయితే ఉద్యోగుల వాదనలపై క్యాట్ బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్‌ను కొట్టివేసింది.

యూజీసీ, బీసీఐ  గైడ్‌లైన్స్ మేరకు  లా అడ్మిషన్లు
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): లా కోర్సుల అడ్మిషన్లు ప్రక్రియను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ), బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గైడ్‌లైన్స్ ప్రకారమే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ క్యాలెండర్ మేరకు అడ్మిషన్లు చేసేందుకు వాద,ప్రతివాదులు అమోదిం చారు. దీంతో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను జూలైలోపు పూర్తి చేయకపోవడంతో క్లాసులు ప్రారంభించడం తీవ్ర జాప్యం అవుతోందంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎ. భాస్కర్‌రెడ్డి వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ పూర్తయినట్లు ప్రకటించింది. పిల్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ జరపాలి.

అయితే బీసీఐ నుంచి గుర్తింపు పొందిన కాలేజీల లిస్ట్‌లో నల్సార్ లా వర్సిటీ కూడా ఉండటంతో సీజే విచారణ నుంచి తప్పుకోవడంతో జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు డివిజన్ బెంచ్ గురువారం విచారణను పూర్తి చేసింది. పార్టీ ఇన్ పర్సన్‌గా పిటిషనర్ భాస్కర్‌రెడ్డి , ప్రభుత్వం తరఫున ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ వాదించారు. ఈ ఏడాదికి లా అడ్మిషన్ల ప్రక్రియ ముగియడంతో వచ్చే సంవత్సరం నుంచి యూజీసీ, బీసీఐ మార్గదర్శకాలు పాటించాలనే వాదనలను ఇరుపక్షాలు ఆమోదించడంతో అందుకు అనుగుణంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.