ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణపై హైకోర్టు స్టే
కోర్టుకు వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు
ఎన్నికల సమయంలో అమరవీరుల స్మారకం వద్ద ఇంటర్వ్యూ.. కోడ్ ఉల్లంఘించారని పోలీసుల కేసు
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమరవీరుల స్మారకం వద్ద ఇంటర్వ్యూ నిర్వహించారన్న ఆరోపణలతో పోలీసులు నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు మేరకు కేటీఆర్‌పై నమోదైన కేసులో పోలీసులు ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ కోర్టులో నడుస్తున్న కేసు విచారణతోపాటు కేటీఆర్ వ్యక్తిగత హాజరును మినహాయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమరవీరుల స్మారకం వద్ద డ్రోన్ కెమెరాలు వినియోగిస్తూ ఇంటర్వ్యూ నిర్వహించడంపై కాంగ్రెస్ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారి కేటీఆర్‌తోపాటు ఇంటర్వ్యూ చేసిన గోరటి వెంకన్న పై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపి ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జిషీట్ వేశారు. దీనిని కొట్టేయాలంటూ హైకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఏ ప్రభాకర్‌రావు వాదనలు వినిపిస్తూ కోడ్ ఉల్లంఘన జరగలేదని తెలిపారు. వాదనల తర్వాత హైకోర్టు కేటీఆర్‌పై కేసు విచారణను నిలిపివేస్తూ ఆదేశాలి చ్చింది. కింది కోర్టులో కేటీఆర్ హాజరు నుంచి మినహాయింపు కూడా ఇచ్చింది. విచారణను 30వ తేదీకి వాయిదా వేసింది.