నిర్లక్ష్యం వీడండి
- బనకచర్లపై మౌనం ఎందుకు?
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ఏపీ ప్రభుత్వం పోలవరం కెనాల్‌ను మూడింతలు పెంచి యుద్ధప్రాతిపాదికన ముందుకు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) ఆరోపించారు. సీతారామా(Sitarama), సమ్మక్క సాగర్(Sammakka Sagar), కాళేశ్వరం(Kaleshwaram) 3వ టీఎంసీ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ఈ నాలుగు ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ను సాధించడం లో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నా రు. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడంపై రేవంత్ సర్కారు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరిగేషన్ సలహాదారుగా ఆంధ్రా అధికారిని పెట్టుకోవడంపై ఆయన మండిపడ్డారు.
గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యా యం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చెప్పారని హరీశ్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వ్యతిరేకించలేదని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు.
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే వ్యతిరేకిస్తూ లేఖలు రాశామన్నారు. శుక్రవారం మొదట హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో బనకచర్ల అంశంపై మీడియాతో మాట్లాడారు. అనంతరం హరీష్ మాటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఉత్తమ్ వ్యాఖ్యలపై మరోసారి హరీశ్ ప్రకటన విడుదల చేశారు.
కేఆర్‌ఎంబీకి, కేంద్ర ప్రభుత్వానికి, జలశక్తి మంత్రి షెకావత్‌కి తాము ఎన్నో ఉత్తరాలు రాసినట్లు గుర్తు చేశారు. తాము చేసిన ఒత్తిడికి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేయొద్దని జలశక్తి మంత్రి షెకావత్ కూడా ఏపీకి లేఖ రాశారన్నారు. తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే తెచ్చామని గుర్తు చేశారు.
నా వ్యాఖ్యలను వక్రీకరించారు..
గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై తన వ్యాఖ్యలను వక్రీకరించడం శోచనీయమని హరీశ్ పేర్కొన్నారు. తాను 200టీఎంసీలు తీసుకుపోతున్నారని ఎక్కడ అనలేద ని, ఆ ప్రాజెక్టు రూపకల్పన చేస్తుంటే సీఎం, మంత్రి మౌనం వహించడంపై తప్పుబట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం తాను ప్రశ్నిస్తే గానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర వీడలేదన్నారు.
తాను పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మేల్కొని మంత్రి లేఖను విడుదల చేశారని, అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు అని అన్నారు. 512-299 ఒప్పందం అనేది ఒకే ఏడాదికి అని డాక్యుమెంట్లలోనే స్పష్టంగా ఉందన్నారు. మంత్రి హోదాలో ఉండి ఎందుకు అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ ప్రశ్నించారు.
ఒకవేళ 512-299 ఒప్పందం ఉండి ఉంటే, సెక్షన్ 3 ప్రకారం, నీటి పంపకాలు అనే విషయం ఎందుకు ఉత్పన్నమైతదని అడిగారు. ట్రిబ్యునల్ సమావేశానికి మంత్రి హోదాలో హాజరైన మొదటి వ్యక్తిని తానేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో అబద్ధం చెప్పారని హరీశ్ పేర్కొన్నారు.
2016లోనే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా తాను ట్రిబ్యునల్ మీటింగ్‌లో పాల్గొన్నామన్నారు. నాటి మీటింగ్ మినట్స్‌లో ఉంటుందని.. చూసుకోవాలన్నారు.
అబద్ధాలు ఆపండి
- నదీజలాల విషయంలో బీఆర్‌ఎస్ హయాంలోనే నష్టం
- నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రజాప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు.
సచివాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలోనే నదీజలాల విషయంలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే నష్ట నివారణ చర్యలు చేపడుందని చెప్పారు.
ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టు చేపడుతున్నారని, ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు కేటాయించొద్దంటూ కేంద్ర జలశక్తి శాఖమంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాసినట్లు చెప్పారు. అసలు బనకచర్ల ప్రాజెక్ట్ లేనే లేదని, అలాంటిది ఆ ప్రాజెక్ట్ నుంచి ఏపీ ప్రభుత్వం 200 టీఎంసీల నీటిని ఎలా మళ్లించుకుంటుందో హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమమంటూ గొప్పలు చెప్పిన బీఆర్‌ఎస్ నేతలు.. అధికారం చేపట్టిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేవలం ప్రతిపాదనలు మాత్రమే చేసిందని, ఇందుకు సంబంధించి కేంద్ర ఆర్థిక, జలవనరుల శాఖామంత్రులకు లేఖలు పంపిందన్నారు.
దీంతో ఈ రెండు మంత్రిత్వశాఖలు కృష్ణా, గోదావరి నదీజలాల బోర్డులకు లేఖలు రాయగా, అధికారికంగా మనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. విషయం తమ దృష్టికి రాగానే అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మంత్రి స్పష్టం చెప్పారు. కృష్ణానదీ జలాల కేటాయింపులకు సంబంధించి ప్రాజెక్టు ఆధారంగా బోర్డు నీటిని కేటాయించలేదని, మొత్తంగా 811 టీఎంసీలు కేటాయించిందని చెప్పారు.
ఇందులో 70 శాతం నదీ పరివాహక ప్రాంతంగా ఉన్న తెలంగాణకు ఈ మేర కేటాయింపులు ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందని, ఈ విషయాన్ని కృష్ణానదీ జలాల బోర్డుకు ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు. అదే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరైన అప్పటి సీఎం కేసీఆర్ తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు చాలంటూ ఒప్పకోవడంతో ఆంధ్రాకు 512 టీఎంసీల నీటిని కేటాయించారన్నారు.
రాయలసీమ ఎత్తిపొత్తల ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ లోపయికారిగా సహకరించిందని ఆరోపించారు. లక్ష కోట్లు అప్పుతెచ్చి నిర్మించిన కాళేశ్వరం బీఆర్‌ఎస్ హయాంలోనే కూలిపోయిందని, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా అని ప్రశ్నించా రు.