రాష్ట్ర రైళ్ల డిమాండ్లు మస్తు
- ఈసారైనా కేంద్రబడ్జెట్ కేటాయింపులు పెరిగేనా?
- కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త రైళ్ల కోసం ఎదురుచూపులు
- రీజినల్ రింగ్ రైల్, ఎంఎంటీఎస్‌కు నిధులొచ్చేనా..
- ఇప్పటికే భారీగా ప్రతిపాదనలు పంపిన ఎంపీలు
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): రైల్వే బడ్జెట్ కోసం ఎదురుచూపు లు చూడటం.. తీరా రైల్వే బడ్జెట్ రోజు మనం ఎక్కాల్సిన రైలు బిహార్, యూపీ, బెంగాల్ సహా ఉత్తరాది,తూర్పు రాష్ట్రాలకు వెళ్లిపోవడం అనేది సాధారణమే. నిరుటి రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,336 కోట్లు మాత్రమే కేటాయించారు.
ఈసారి బడ్జెట్‌లోనైనా కేటాయింపులు పెంచి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న కొత్త రైల్వే మార్గాలు, రైళ్లు, అదనంగా లైన్ల నిర్మాణానికి రూ.83 వేల కోట్లు అవసరమవుతాయని రైల్వేశాఖ తేల్చింది.
మరిన్ని రైళ్లు, ప్రాజెక్టులను కేటాయించాలని రాష్ర్ట ప్రభుత్వం గట్టిగానే కోరు తోంది. ఎంపీలు అందరూ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌ను కలిసి తమ ప్రాంతాలకు ఇవ్వాల్సిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. వీటన్నింటినీ క్రోఢీకరించిన దక్షి ణ మధ్య రైల్వే అధికారులు రైల్వేబోర్డుకు జోన్ నుంచి ప్రతిపాదనలు పంపించారు.
ఇప్పటివరకూ అనుసంధానం లేని 9 జిల్లా కేంద్రాలకు రైలు మార్గం నిర్మాణానికి నిధు లు కేటాయించాలని ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారు. తెలంగాణలో ప్రజలు ఏటా పెద్ద సంఖ్యలో వెళ్లే భద్రాచలం, రామప్ప, మేడారం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు జిల్లా కేంద్రాలైన నారాయణపేట, వనపర్తి, నా గర్ కర్నూల్, సూర్యాపేట, సంగారెడ్డి, నిర్మ ల్, భూపాలపల్లి, ములుగు తదితర ప్రాంతాలకు రైల్వే లైన్ కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ రైల్వే డిమాండ్లు ఇవి..
* హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, రాయచూరు మీదుగా హోస్పేట్, హుబ్లీ, గోవా వెళ్లేందుకు గాను రెండు దశల్లో చేపట్టిన మహబూబ్ నగర్-మునీరాబాద్ రైల్వే లైన్ ప్రస్తుతం తెలంగాణలో పూర్తయింది. మహబూబ్‌నగర్ నుంచి రాయచూరు సమీపంలోని కృష్ణా రైల్వే స్టేషన్ వరకు ట్రాక్ వేయడంతోపాటు రాయచూరు వరకు రైళ్లను నడుపుతున్నా రు.
ఇక కర్ణాటకలో రాయచూరు నుంచి మాన్వి, సింధనూరు, గంగావతి మీదుగా మునీరాబాద్ వరకు పనులు చేపట్టగా... ప్రస్తుతం సింధనూరు-మునీరాబాద్ మ ధ్య పనులు పూర్తయ్యాయి. సింధనూరు నుంచి హుబ్లీ, బెంగళూరుకు రైళ్లు కూడా తిరుగుతున్నాయి. సింధనూరు- రాయచూరు మధ్య పనులు నత్తనడకన సాగు తున్నాయి. ఈ పనులు త్వరగా పూర్తి చేస్తే హైదరాబాద్ నుంచి గోవాకు సుమారు 120 కి.మీ. దూరం తగ్గుతుంది.
* కాచిగూడ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా తిరుపతి, చెన్నై, బెంగళూరు, మంగళూరు, గోవా తదితర అత్యంత కీలకమైన నగరాలకు వెళ్లే షార్ట్ కట్ లైన్ అయిన మహబూబ్ నగర్-డోన్ మార్గం ఇంకా సింగిల్ ట్రాక్‌గానే ఉంది. కాచిగూడ-మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ పూర్తి అయినా మహబూబ్‌నగర్- డోన్ లైన్ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపిస్తోంది. ఈ లైన్ పూర్తయితే చాలా తక్కువ సమయంలో తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది.
* కొత్తగా ఏర్పాటు చేసిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి దాదాపు 21 జతల రైళ్లను నడిపించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే చర్లపల్లి నుంచి కాజీపేట, మిర్యాలగూడకు ఇంటర్ సిటీ రైళ్లను నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
* హైదరాబాద్ నుంచి చెన్నై నగరానికి ప్రస్తుతం కేవలం 3 రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. మరో 3 రైళ్లను ప్రవేశపెట్ట డంతో పాటు వందేభారత్ రైలును నడిపించాలనే డిమాండ్ ఉంది.
* సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్‌కు పెద్దగా డిమాండ్ లేనందున దాని కోచ్‌ల సంఖ్య తగ్గించి.. సికింద్రాబాద్ పూణే, ముంబయి మార్గంలో వందేభారత్‌ను ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఉంది.
* హైదరాబాద్ నుంచి మంగళూరు మీదుగా మురుడేశ్వర్ వెళ్లేందుకు ప్రస్తు తం ఒకే ఒక రైలు వారానికి రెండు రోజులు మాత్రమే తిరుగుతోంది. ఈ రైలును రెగ్యులర్‌గా నడపటంతో పాటు ఇప్పుడున్న తమిళనాడు, కేరళ మీదుగా సుదూర మార్గంలో కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు, కుక్కే సుబ్ర హ్మణ్య స్టేషన్ల మీదుగా మళ్లిస్తే ప్రయా ణ దూరం, సమయం తగ్గుతుంది.
* కొత్తగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రీజినల్ రింగ్ రైల్వే లైన్ నిర్మిస్తామని గతంలోనే కేంద్రం తెలిపింది. ఇందుకు రూ.12,408 కోట్లు కావాలని ప్రాథమికంగా అంచనా. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే తెలంగాణ అభివృద్ధికి ఊతం ఏర్పడుతుంది.
* సికింద్రాబాద్ నుంచి కాజీపేట మార్గం లో మూడో లైన్ నిర్మాణానికి 2014లో సర్వేకు అనుమతిస్తే 2018లో రైల్వే బోర్డుకు సర్వే నివేదికను ఇచ్చారు. ఇంకా లైను నిర్మాణం పూర్తి కానేలేదు.
* శంషాబాద్ విమానాశ్రయం నుంచి విజయవాడకు 220 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సెమీ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు గతేడాది రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దీని సర్వే ఏడాదిగా జరుగుతోంది. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు, పూణే, నాగ్‌పూర్‌కు సైతం సెమీ హైస్పీడ్ రైల్వే కారిడార్లపై తెలంగాణ ఆశలు పెట్టుకుంది.
* హసన్‌పర్తి నుంచి భూపాలపల్లికి రైలు మార్గం పెండింగ్‌లో ఉంది. మణుగూరు నుంచి మేడారం మీదుగా రామగుండం వరకూ కొత్త మార్గం కోసం దశాబ్దాలుగా అటవీ ప్రాంత గ్రామాల వాసులు ఎదురుచూస్తున్నారు.
* కరీంనగర్--హసన్‌పర్తి మధ్య 62 కి.మీ. దూరం కొత్త ట్రాక్ నిర్మాణానికి 2011 లోనే సర్వే మంజూరై రూ.464 కోట్లు కావాలని అంచనా. ఇప్పటికే దీని అం చనా వ్యయం రూ.1,116 కోట్లు దాటినా పనులు కావడం లేదు.
* మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే మార్గం పనులు త్వరగా పూర్తి చేసి సికింద్రాబాద్ నుంచి కరీంనగర్‌కు ఇంటర్ సిటీ రైళ్లు నడిపించాలని కోరుతున్నారు.
* వికారాబాద్ నుంచి కొడంగల్ మీదుగా కృష్ణా వరకు 122 కి.మీ రైలు మార్గం నిర్మాణానికి 2010 జూన్‌లో సర్వేకు అనుమతి ఇచ్చారు. దీని నిర్మాణానికి రూ.787 కోట్లు అంచనా నివేదికను 2012లోనే రైల్వే బోర్డుకు ఇచ్చారు. ఇప్పు డు దీని అంచనా వ్యయం రూ.2,196 కోట్లు దాటినా పనులు ప్రా రంభం కాలేదు. దీని నిర్మాణం పూర్తయి తే హైదరాబాద్ నుంచి రాయచూరు, గోవా వెళ్లేందుకు మరో షార్ట్‌కట్ రూట్ సిద్ధమవుతుంది. ఈ రైల్వే లైన్ కోసం సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కేంద్రానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
* హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వా లని ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు ఎంఎంటీఎస్ రైళ్లు వేయడానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది.