కేసు తేలే వరకు వాయిదా వేయండి
‘దిశ’ పిల్‌లో హైకోర్టుకు పోలీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): దిశ నిందితుల ఎన్‌కౌంటర్ వ్యవహారంలో జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్‌ను సవాల్ చేస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు తేలే వరకు నిందితుల ఎన్‌కౌంటర్ వ్యవహారంపై కేసు విచారణను వాయిదా వేయాలని పోలీసు అధికారులు హైకోర్టును కోరారు.
మధ్యంతర పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను హైకోర్టు సోమవారం ఆదేశించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును సీబీఐకి అప్పగించాలనే పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.
ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసుల తరఫు సీనియర్ న్యాయవాది ఆర్ ఎన్ హేమేంద్రనాథ్‌రెడ్డి వాదిస్తూ.. జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ల సింగిల్ జడ్జి విచారిస్తున్నారని తెలిపారు. సింగిల్ జడ్జి తమ పిటిషన్లను అనుమతిస్తే ఆ నివేదిక ఉనికిలో ఉండదని చెప్పారు.
అక్కడి కేసు దాఖలయ్యే వరకు పిల్‌పై విచారణ వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వసుధానాగరాజ్ స్పందిస్తూ.. కౌంటర్ వేస్తామని చెప్పడంతో విచారణ దసరా సెలవుల తర్వాత చేపడతామని హైకోర్టు ప్రకటించింది.