calender_icon.png 18 October, 2024 | 3:57 PM

గ్రూప్ 1 పరీక్షలు ఆపండి

18-10-2024 02:48:37 AM

  1. కీలో తప్పులున్నా సింగిల్ జడ్జి పట్టించుకోలేదు
  2. నేడు విచారణ చేయనున్న హైకోర్టు డివిజన్ బెంచ్

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): తప్పుడు సమాధానాలతో కూడిన తుది కీ ప్రకారం గ్రూప్1 మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తే, ఆ ప్రభావం ఎంపికలపై పడుతుందంటూ పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఈ నెల 15న ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ జీ దామోదర్‌రెడ్డి ఇతరులు అప్పీల్ చేశారు.

పిలిమినరీ కీలో తప్పులు ఉన్నాయని పలు ఆధారాలను సమర్పించినప్పటికీ సింగిల్ జడ్జి పట్టించుకోలేదని పేర్కొన్నారు. టీజీపీఎస్సీ ప్రకటించిన తుది కీలోనూ తప్పులున్నాయని పిటిషనర్లు ఆధారాలు చూపినా వాటికి జోలికి వెళ్లలేదని చెప్పారు. ప్రశ్నకు ఐచ్చిక సమాధానాల్లో సరైనది లేనపుడు ప్రశ్నను తప్పుగా పరిగణించాలని, ఆ విధంగా చేయలేదని అన్నారు.

మెలికలతో కూడిన ప్రశ్నలు ఉండాలంటూ సర్వీస్ కమిషన్ చేసిన వాదనను సింగిల్ జడ్జి ఆమోదించడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. 41, 119 ప్రశ్నలను పరిశీలిస్తే.. తమకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేవి. ఈ రెండు ప్రశ్నలను తొలగించడం వల్ల మెరిట్ జాబితాపై ప్రభావం చూపుతుందని అన్నారు. ఇలాంటి కీ ద్వారా మెయిన్‌కు అభ్యర్థుల జాబితా రూపొందించడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు.

అభ్యర్థుల వడపోతకు ప్రాథమిక పరీక్ష కీలకమని, గతంలో ప్రాథమిక పరీక్ష నిర్వహణలో తప్పులు జరిగాయనే రెండుసార్లు పరీక్షలను రద్దు చేసినట్టు గుర్తుచేశారు. ప్రస్తుతం తప్పుడు సమాధానాలతో ఉన్న కీ ఆధారంగా మెయిన్స్‌కు అర్హత జాబితాను రూపొందించడానికి వీల్లేదని, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేయాలని పేర్కొన్నారు. అప్పీల్ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.