పటాన్‌చెరు తహసీల్దార్ రంగారావు...
చిట్కుల్ ప్రభుత్వ భూమిలో చేపట్టిన ఇండ్ల నిర్మాణాలు పరిశీలన...
పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలోని సర్వేనంబర్ 329 ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను తహసీల్దార్ రంగారావు రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించారు. 2008లో పేదలకు పంపిణీ చేసిన 518 ఇళ్ల స్థలాల్లో అవకతవకలు జరిగాయని అప్పట్లోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. అప్పటి నుంచి ఇచ్చిన స్థలాల్లో ఇండ్ల నిర్మాణాలు జరగలేదు. నిరుపేదలైన లబ్ధిదారులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు కొందరు నాయకుల చేతుల్లోకి వెళ్లడంతో అసలు సమస్య మొదలైంది. చిట్కుల్ గ్రామం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కలుస్తుందన్న వార్తల నేపథ్యంలో స్థలాలు ఇచ్చిన పదహారు సంవత్సరాల తరువాత ఒకేసారి ఇండ్ల నిర్మాణం చేపట్టడంతో తహసీల్దార్ రంగారవు, ఎంపీవో హరిశంకర్‌గౌడ్, పోలీస్ సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు.
రెవెన్యూ అధికారులు రావడంతో ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారితో పాటు పలువురు నాయకులు రావడంతో జనం భారీగా పొగైంది. తమకు ఇచ్చిన స్థలాల్లోనే ఇండ్లు నిర్మిస్తున్నామని లబ్ధిదారులు తహసీల్దార్‌కు తెలిపారు. కాగా పదిహేను రోజుల వరకు ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని, సమస్యను ఉన్నతాధికారులకు నివేదించిన అనంతరం వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తహసీల్దార్ ఇండ్ల నిర్మాణం చేపట్టిన వారికి తెలిపారు.