calender_icon.png 17 October, 2024 | 4:52 AM

డాంభికాలు ఆపి భూమ్మీదికి రండి

17-10-2024 02:36:07 AM

గురుకులాల కిరాయి కట్టడానికి కూడా డబ్బుల్లేవా? 

రాష్ట్ర వాటా ఇవ్వనందుకే కేంద్ర నిధులు ఆగినయ్  

రాష్ట్రానికి సహకరించేందుకు కేంద్రం సిద్ధం

ఢిల్లీలో మీడియాతో ఎంపీ ఈటల

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి డాంభికాలు, బుల్డోజ్ చేసేలా మాట్లాడటం పక్కన పెట్టి భూమ్మీదికి రావాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హితవు పలికారు. పేద పిల్లలు చదువుకునే గురుకులాల దుస్థితిని సరిచేయాలని సూచించారు.

బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల భవనాలకు కిరాయి చెల్లించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా అని ప్రశ్నించారు. అద్దె చెల్లించకపోవడంతో తాళాలు వేశారని పేర్కొన్నారు.

గురుకులాల్లో ఉప్పు, పప్పులకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో నిత్యావసరాల సరుకులు కూడా అందటం లేదని, డైట్ చార్జీలు కూడా ఇవ్వలేని దుస్థితిలో రాష్ర్ట ప్రభుత్వం ఉందని ఈటల విమర్శించారు.గత ప్రభుత్వానికి దాపురించిన పరిస్థితిని చూసైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు.

ఇంటిగ్రేటెడ్ పేరుతో ఇప్పటికే ఉన్న గురుకులాలను ఎత్తేయకుంటే చాలని అన్నారు. గురుకులాల కొత్త భవనాలు నిర్మించడం దేవుడెరుగు.. కనీసం గురుకులాల్లో సౌకర్యాలను మెరుగుపర్చాలని కోరారు. 

అందుకే కేంద్ర నిధులు ఆగినయ్..

కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు రాష్ట్రం తన వాటా నిధులను ఇవ్వనందుకే కేంద్రం నిధులను విడుదల చేయడం లేదని ఈటల అన్నారు. ఎఫ్‌ఆర్బీఎం రుణాలు జీఎస్డీపీలో 25% దాటవద్దనే నిబంధన ఉన్నా కూడా రాష్ర్ట ప్రభుత్వ లెక్కల ప్రకారమే 50% దాటిందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని తెలిపారు.

ఇంతమంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారని బీజేపీ మీద ఆడిపోసుకుంటున్నారని.. కానీ గ్రామపంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీల కింద, హైవేలు, రైల్వే, అర్బన్ హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్‌కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తేనే ఆ మాత్రం సోకులు చేస్తున్నారని అన్నారు. 

ఆర్‌ఆర్‌ఆర్ రైతులకు మెరుగైన పరిహారం..

రాష్ర్ట ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు పె ట్టే పరిస్థితి లేదన్నారు. ఇప్పుడున్న ఓఆర్‌ఆర్‌కి 40 కి.మీ దూరంలోనే రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్తున్నారని... కానీ గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతంలో కేవలం 28 కి.మీ లోపే రీజినల్ రింగ్ రోడ్డును వేస్తున్నారని అన్నారు.

ఆ ప్రాంతంలో ఇప్పటికే ప్రాజెక్టులు, కాలువలు, కరెంటు లైన్లు, ప్రభుత్వ అవసరాల కోసం భూములు కోల్పోయిన రైతులు... ఉన్న కొంత భూమితో బతుకుతుంటే ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ పేరిట మళ్లీ భూసేకరణ చేస్తే వారి పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. ఆర్‌ఆర్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతుల కు మెరుగైన పరిహారం ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించినట్లు ఈటల తెలిపారు.

స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీస్ కింద నగర అభివృద్ధికి నిధులతో పాటు డబుల్ బెడ్రూం ఇండ్లను పెద్ద ఎత్తున కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. తన నియోజకవర్గం పరిధిలో హైడ్రా పేరుతో వేలాదిమందికి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈటల అన్నారు.