calender_icon.png 19 November, 2024 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లగచర్లలో అరెస్టులు ఆపండి

19-11-2024 05:13:09 AM

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ 

పదిరోజుల్లో పూర్తినివేదిక ఇవ్వాలని డీజీపీ, సీఎస్‌కు ఆదేశం

లగచర్ల, రోటిబండ తండాల్లో బాధితులను కలిసిన కమిషన్

వికారాబాద్, పరిగి, నవంబర్ 18 (విజయక్రాంతి): లగచర్ల, రోటిబండ తండాల్లో అక్రమ అరెస్టులను ఆపేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ పోలీసులను ఆదేశించారు. సోమవారం లగచర్ల, రోటబండ తండా గ్రామాల్లో  ఆయన పర్యటించారు. బాధిత కుటుంబాలతో ఆయన నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు పోయినా ఫార్మాసిటీకి భూములు ఇచ్చేది లేదని రైతులు కమిషన్ సభ్యుల ఎదుట తేల్చిచెప్పారు.

అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ రోజు చోటు చేసుకున్న సంఘటనను అడిగి తెలుసుకున్నారు. గొడవతో తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధం లేకపోయినా పోలీసులు అరెస్టు చేసి జైలులో పెట్టారని పలువురు మహిళలు కమిషన్ సభ్యుల ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. తమ కొడుకులను అన్యాయంగా కొట్టి జైలులో పెట్టారని వృద్ధులు కన్నీటిపర్యంతమయ్యారు. బాధితుల గోడును ఓర్పుగా విన్న కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్.. వారికి కమిషన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

లగచర్ల ఘనటలో ఇకపై అరెస్టులు నిలిపివేయడంతో పాటు గిరిజనులను భయబ్రాంతులకు గురిచేయడం ఆపివేయాలని హుసేన్ నాయక్ అక్కడే ఉన్న ఎస్పీ నారాయణరెడ్డిని ఆదేశించారు. లగచర్ల, రోటిబండ తండాల్లో పర్యటించిన సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను సుమోటోగా స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులందరితో చర్చలు జరిపి వారి సమ్మతి ఉంటేనే భూసేకరణపై ముందుకు వెళ్లాలన్నారు.

సంగారెడ్డి జైల్లో రైతులను కలిసిన హుస్సేన్ నాయక్ 

సంగారెడ్డి అర్బన్, నవంబర్ 18: లగచర్ల దాడి ఘటనలో అరెస్టు సంగారెడ్డి జైల్లో ఉన్న గిరిజన రైతులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సోమవారం సాయంత్రం కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు కమిషన్ తరపున న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు.