11-03-2025 11:26:25 PM
భూపేశ్ బఘేల్ ఇంటి నుంచి వస్తుండగా ఘటన...
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాహనంపై రాళ్ల దాడి చేయడం సంచలనం కలిగించింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఇంటి నుంచి వాహనం తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. తమ వాహనంపై దాడికి పాల్పడిన వారిపై ఈడీ అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కాగా మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా సోమవారం ఛత్తీస్‌గఢ్ వ్యాప్తంగా మొత్తం 14 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో బిలాయ్ ప్రాంతంలో ఉన్న బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ నివాసంలోనూ తనిఖీలు నిర్వహించారు. సమాచారం అందుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు భూపేశ్ బఘేల్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకొని ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ వాహనంపై రాళ్ల దాడి చేయడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాగా ఈడీ తనిఖీలపై బఘేల్ కార్యాలయం స్పందించింది. ఏడేళ్లుగా కొనసాగుతున్న తప్పుడు కేసును కోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. కానీ ఈడీ అధికారులు మాత్రం తనీఖీలు చేయడం ఆపడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.