calender_icon.png 3 April, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిల గుట్టలు!

01-04-2025 01:52:25 AM

ప్రభుత్వ బిల్లులు రాకపోవడంతో కష్టాల్లో స్టోన్ క్రషర్ పరిశ్రమ

నడిపించలేక చేతులెత్తేస్తున్న యజమానులు

ఆదుకోవాలని ప్రభుత్వానికి మొర

కరీంనగర్, మార్చి 31(విజయక్రాంతి): కరీంనగర్లో స్టోన్ క్రషర్ యూనిట్ల మూతపడే పరిస్థితికి వచ్చాయి. రోడ్డు, భవనాల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుంచి బిల్లుల బకాయిలు పేరుకుపోతుండటంతో  కంకర రాయి సరఫరా చేసిన స్టోన్ క్రషర్ యూనిట్లకు బకాయిలు కోట్లకు చేరుతున్నాయి. దీంతో క్రషర్లు నడపలేక చాలామంది లీజుకి ఇస్తున్నారు. దీనికి తోడు ప్రైవేట్ నిర్మాణాలు నెమ్మదించడంతో క్రషర్లలో కంకర గుట్టలుగా పేరుకుపోతున్నది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని క్రషర్ల యాజమాన్యాలు కోరుతున్నాయి.

విస్తారంగా పరిశ్రమలు

కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ విస్తరించి ఉంది. కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్, ఖాజీపూర్, ఎలగందుల, నాగుల మల్యాల, గంగాధర మండలం ఒద్యారం తదితర గ్రామాలు ఈ పరిశ్రమకు కేంద్ర బిందువుగా మారాయి. తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం తదితర మండలాల్లోనూ గ్రానైట్ సంస్థలు విస్తారంగా ఉన్నాయి. గ్రాన్పై ఆధారపడి కటింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీ జీవం పోసుకుంది. అయితే, ప్రస్తుతం కటింగ్, పాలిషింగ్ యూనిట్లు కూడా నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నాయి. చాలాయూనిట్లు నడవడం లేదు. కరీంనగర్కు కూతవేటు దూరంలో ఉన్న ఆసిఫ్నగర్, ఎలగందుల, ఖాజీపూర్ గ్రామాల్లో ఈ కటింగ్, పాలిషింగ్ ఇండస్ట్రీ విస్తరించింది. ఈ ప్రాంతంలో దాదాపు 291 పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి గ్రానైట్కు ఇతర రాష్ట్రాలతోపాటు చైనా వంటి దేశాల్లోనూ డిమాండ్ ఉంది. ప్రస్తుతం చైనాకు ఎగుమతి తగ్గడం ఆందోళన కలిగిస్తున్న అంశం. గ్రానైట్ పరిశ్రమ ఆధారంగా 31 స్టోన్ క్రషర్ పరిశ్రమలు వెలిశాయి. వీటి ద్వారా సుమారు 500 మంది ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం స్టోన్క్రషర్ యూనిట్లు కూడా నడవలేని స్థితికి చేరుకొంటుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.

నడపలేక పోతున్నాం: కనకయ్య

బకాయిలు పేరుకు పెరుకుపోవడం, గృహ నిర్మాణాలు తగ్గడం, రోడ్డు తదితర పనులు తగ్గడంతో స్టోన్ క్రషర్ లను నడపలేకపోతున్నాం. ఈ పరిశ్రమని నమ్ముకున్న వారికి కష్టాలు ఎదురవునున్నాయి. తమని ప్రభుత్వం ఆదుకోవాలి, ఈ పరిశ్రమపై ఆధారపడ్డ వారిని ప్రోత్సహించాలి.