calender_icon.png 28 September, 2024 | 10:50 AM

కడుపు మాడుస్తున్నరు!

27-09-2024 02:13:03 AM

  1. పురుగుల అన్నం.. నీళ్ల చారే దిక్కు 
  2. పిల్లల బియ్యం మింగేస్తున్న వార్డెన్లు 
  3. నాసిరకం కూరగాయలతో మమ 

గురుకుల పాఠశాల విద్యార్థుల గోస 

పట్టించుకోని అధికార యంత్రాంగం

‘పెట్టింది తిను.. నచ్చకుంటే పస్తులుండు’ అన్నట్టు తయారైంది రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల దుస్థితి. పేద విద్యార్థులకు కడుపు నిండా అన్నంపెట్టి, ఉచిత వసతి కల్పించి, విద్య అందించేందుకు ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలపై ప్రభుత్వ పట్టింపులేనితనం, అధికారుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థులు అరిగోస పడుతున్నారు. పురుగుల అన్నం, నీళ్ల చారుతోనే పబ్బం గడుపుకొంటూ పౌష్టికాహార లోపానికి గురువుతున్నారు. పిల్లల బియ్యాన్ని హాస్టల్ వార్డెన్లు మింగేస్తున్నారు. నాసిరకం బియ్యం, కూరగాయలతో సరిపెడుతున్నారు. దినదిన గండంగా విద్యార్థులు కష్టాలు పడుతుంటే.. పట్టించుకోవాల్సిన అధికారులు మాకేం సంబంధం అన్నట్టు వ్యవహరించడం గమనార్హం.

విజయక్రాంతి నెట్‌వర్క్, సెప్టెంబర్ ౨౬ : ప్రభుత్వం వసతి గృహాల్లో నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం.. సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతలేని ఆహారం, నలకలతో కూడిన తాగునీటితో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిచడంతో నిర్వహణ అధ్వానంగా మారింది.

పిల్లలు తమలాగా కావొద్దని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తూ పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లకి విద్యకోసం పంపితే.. చాలీచాలని ఆహారంతో వారు అరిగోస పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలికల పోస్టు మెట్రిక్ వసతి గృహం దీనికి చక్కటి నిదర్శనంగా నిలుస్తోంది. వసతిగృహంలో విద్యార్థినులు భోజనం, తాగు నీటి విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాహమేస్తే నీళ్లు తాగుదామంటే నలకలతో ఉండటం, అన్నం తిందామంటే పురుగులు కనిపిస్తుండటంతో  తినలేక పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది.

అధికారులు, వంట మనుషులు, వార్డెన్లు ఇష్టాను సారంగా వ్యవహరిస్తుండటంతో విద్యార్థుల పరిస్థితి అరణ్యరోదనగా మారింది. వసతి గృహంలో భోజనం రుచికరంగా లేక పోవడంతో అర్ధాకలితో ఉండాల్సిన పరిస్థితి ఉంది. రుచికరంగా లేక పోయినా ఫర్వాలేదు శుభ్రంగా ఉంటే చాలని అనుకున్నా అదీ సాధ్యం కావడంలేదు. మూడు రోజుల క్రితం వండిన పప్పులో వెంట్రుకలు వచ్చాయని, కుప్పలుగా వెంటుక్రలు ఉండటంతో తినలేక పడేశామని విద్యార్థులు ‘విజయక్రాంతి’కి చెప్పారు.  ఈ విషయం బయటకు చెబితే ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోనని భయంతో గోప్యంగా ఉంచారని తెలుస్తోంది.  

మూలకు పడ్డ ఆర్వో ప్లాంటు

భోజనం సరిగా చేయకపోయినా, కనీసం నీళ్లు తాగి పడుకుందామన్నా నీళ్లలో నలకలు వస్తున్నాయని విద్యార్థులు వాపో తున్నారు.  ప్రభుత్వం విద్యార్థులకు శుద్దజలం అందించాలనే లక్ష్యంతో 1000 లీటర్ల ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినా నిర్వహణలోపం కారణంగా  అది 8 నెలలుగా మూలన పడింది. మరమ్మతు చేయకపోవడంతో బోరునీరు తాగుతున్నారు. ఇంత అధ్వానంగా నిర్వాహణ ఉన్నప్పటికి విష యం వెలుగులోకి రావద్దని అధికారులు ప్రయత్నిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతుంది. ఎవరికైనా చెబితే వేధింపులకు గురి కావాల్సి వస్తుందని విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారు. 

బియ్యం అమ్ముకొంటున్న వార్డెన్?

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు అందించాల్సిన పౌష్టికాహారం కొంతమంది వార్డెన్‌లు పందికొక్కులా మెక్కేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి బాలుర వసతి గృహ వార్డెన్ నరేశ్‌కుమార్ అతిథి పాత్ర పోషిస్తూ చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారని.. వాచ్‌మెన్, వంటమనిషే ఇక్కడ వార్డెన్ పాత్ర నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల రాత్రి సమయంలో వార్డెన్ హడావుడిగా వచ్చి హాస్టల్‌లోని బియ్యాన్ని బయటకు తరలిస్తుండగా విద్యార్థులు అడ్డుకొన్నారు. దీంతో విద్యార్థులను జోరువానలో బయటనే ఉంచారని తెలిసింది. స్థానికంగా ఉండి విద్యార్థుల బాగోగులు చూడాల్సిన వార్డెన్..

తన స్వగ్రామం నుంచి రాకపోకలు సాగిస్తుంటాడు. ఏనాడు విద్యార్థులకు హాజరువేసిన పాపాన పోలేదని, రిజిస్టర్లు సైతం తన రూములో ఉంటుందని, దానికి తాళంవేసి ఉంటుందని చెప్తున్నారు. ఇందులో ఉంటు న్న పది మంది విద్యార్థులకు కూడా రుచికరమైన ఆహారం పెట్టట్లేదని వాపోతున్నారు. విద్యార్థులకు వచ్చే బియ్యం, నిత్యవసరాలను అమ్ముకోవడంతోపాటు నోటు పుస్తకాలను సైతం మాయం చేస్తున్నాడని ఆరోపించారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపంతో.. విద్యార్థుల నోటికాడ బువ్వను వార్డెన్లు తన్నుకు పోతున్నారని తెలుస్తోంది. తమ పిల్లలకు రక్షణ ఉంటుందని నమ్మి హాస్టల్‌లో చేర్పిస్తే.. పట్టించుకొనే నాథుడే లేకుండా పోయారని, వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.  

పిల్లలపై పట్టింపేది? 

సిద్దిపేట జిల్లాలోని గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలుర గురుకుల పాఠశాలల్లో మరుగు దొడ్లు, స్నానపు గదులు అందుబాటులో లేవు. సిద్దిపేట రూరల్ మండలం లోని చింతమడకలోని బాలికల గురుకుల పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మించలేదు. వసతిగృహాల్లో డైనింగ్ హాల్ లేకపోవడం, ఉన్నచోట కూర్చునే సౌకర్యం లేకపొవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. చాలా పాఠశాలలకు మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కావడం లేదు.

వాటర్ ఫిల్టర్లు ఉన్నా అవి పని చేయడం లేదు. నీటి కొరత వల్ల విద్యార్థులు వంతులవారీగా స్నానాలు చేస్తున్నారు. బియ్యంలో నూకలు అధికంగా ఉండటం వల్ల అన్నం పలుకు అవడంతో విద్యార్థులకు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. గురుకులాలు ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలో డార్మిటరిలోనే పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. అనేక సార్లు అధికారులకు సమ స్యలను విన్నవించినప్పటికీ స్పందించడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.  

నాసిరకం నిత్యావసరాలతో వంటలు 

సంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు నాసిరకం నిత్యావసరాలతో తయారు చేసిన వంటే దిక్కవుతుంది. పిల్లలకు పౌష్టికాహారం అందేలా ప్రభుత్వం మెనూ రూపొందించినా ఎక్కడా అమలు కావట్లేదు. కూరగాయలతో తయారు చేసిన కూరల బదులు నిత్యం నీళ్ల సాంబార్. చప్పిడి మెతుకులు పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ధరల పెరుగుదల సాకుతో విద్యార్థులకు గుడ్డు, పండ్లు ఇవ్వడం లేదని తెలిసింది. వారంలో ఒక్కటి, రెండుసార్లు మాత్రమే కూరగాయలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

ఏజెన్సీ నిర్వాహకుల చేతివాటం

గురుకులాల్లో టెండర్లు చేజిక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులు సైతం తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెనూ ప్రకారం అందించే చికెన్, మటన్, గుడ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు, మంచినూనె నాణ్యతగా లేకపోవడంతో విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. ప్రభుత్వం తమకు బకాయీలు గడువులోగా చెల్లించకపోవడంతో అప్పులు తెచ్చి సరుకులు సరఫరా చేస్తున్నామని ఏజెన్సీ నిర్వాహకులు వాపోతున్నారు.

ఆర్‌ఓ ప్లాంట్ మరమ్మతు చేయిస్తాం

కొత్తగూడెంలోని పోస్టు మెట్రిక్ వసతి గృహంలో చెడిపోయిన ఆర్వో వాటర్ ప్లాంటును మరమ్మతు చేయిస్తాం. అప్పటివరకు మినరల్ వాటర్ సరఫరా చేస్తాం. అన్నంలో పురుగులు రావడం అవాస్తవం. ఎప్పటిబియ్యం అప్పుడే వండుతుంటే పురుగులు పట్టే పరిస్థితి ఉండదు. 

 అనసూర్య, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి, భద్రాద్రి కొత్తగూడెం