calender_icon.png 23 January, 2025 | 6:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసుల కక్కుర్తితో కడుపు కోత

05-07-2024 12:36:15 AM

  • అవసరం లేకపోయినా ఆపరేషన్లు 
  • ‘ప్రైవేట్’లో పెరుగుతున్న సిజేరియన్లు 
  • నానాటికీ తగ్గుతున్న సాధారణ ప్రసవాలు 
  • ప్రైవేట్ దవాఖానలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

వనపర్తి, జూలై 4 (విజయక్రాంతి): వైద్యో నారాయణ హరి అంటారు.. వైద్యుడు దేవుడితో సమానం అని అర్థం. కానీ, వైద్యుల మీద నమ్మకంతో  దవాఖానలకు వస్తున్న రోగులకు లేనిపోని అనుమానాలను, భయాన్ని సృష్టించి వైద్యులు క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉన్నా.. గర్భిణి, వారి కుటుంబాలను భయబ్రాంతులకు గురిచేసి సిజేరియన్ చేసుకొనేందుకు  మళ్లిస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో విచ్చలవిడిగా సిజేరియన్లు జరుగుతుండటం ఇందుకు నిదర్శనం.

కాన్పు కోసం ప్రైవేట్ దవాఖానాలకు వెళ్లితే కాసులకు కక్కుర్తి పడి అత్యధిక శాతంగా అమ్మ కడుపులను కోస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సహజ కాన్పులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా బేఖాతర్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రవేట్ దవాఖానల్లో  75 శాతానికి పైగా సిజేరియన్లు జరుగుతున్నట్టు వైద్యాధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఇంత జరుగుతున్నా నివారించడంలో వైద్యారోగ్య శాఖ ఎందుకు విఫలం అవుతున్నదోనని సామాన్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాములుగా ఊరుకుంటున్నారా? మాములుకు అలవాటుపడి పట్టించుకోవడం లేదా అని బహిరంగంగాంగానే అంటున్నారు. 

రోగి భయమే వరం

మాతృత్వం అమ్మలకు ఓ వరం. అలాంటి వరాన్ని భయబ్రాంతులకు గురిచేసి కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు క్యాష్ చేసుకుంటున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో కూతురో, కోడలో గర్భం దాల్చితే పడే సంతోషం కంటే డెలివరీ ఖర్చుల భయమే వెంటాడుతుంది. ప్రైవేట్ దవాఖానల్లో ప్రతిసారి చెకప్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేలు తీసుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి సారి రక్త పరీక్షలు, స్కానింగ్ అంటూ దోచుకుంటున్నారు. సహజ కాన్పులు అయితే రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు, సిజేరియన్లు అయితే ఆయా దవాఖానను బట్టి రూ.30 వేల పైచిలుకు వసూలు చేస్తున్నారు.

ఇందుకోసం ప్రైవేట్ ఆసుపత్రులు ఓ చైన్ సిస్టమ్‌నే ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. గ్రామా ల్లో పనిచేసే కొంతమంది ఆర్‌ఎంపీ, పీఎంపీలను మధ్యవర్తులుగా పెట్టుకొంటున్నారు. గర్భిణులను ఆయా దవాఖానాల్లో చేర్పించి, కమిషన్ పొందుతున్నారు. అమాయక ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలనే టార్గెట్ చేసుకుని ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు సాగుతుందని బహిరంగాంగానే విమర్శలు ఉన్నాయి. 

2688 కాన్పుల్లో 1984 సిజేరియన్లు

జిల్లాలో 50 పైచిలుకు పెద్ద దవాఖానలు ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో డెలివరీలు జరుగుతున్నాయి. గత సంవత్సరం మార్చి నుంచి 2024 జూలై ౧ వరకు 8,877 కాన్పులు జరిగాయి. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో 6,189 కాన్పులు జరగగా, ఇందులో 3,580 (70.5 శాతం) సహజ కాన్పులు కాగా, 2,609 (29.5 శాతం) సిజెరియన్లు అయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో మొత్తం 2,688 కాన్పులు జరగగా ఇందులో 704 (25 శాతం) సహజ కాన్పులు కాగా, 1984 (75 శాతం) సిజేరియన్లు అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. దాదాపు 80 శాతానికి పైగా సిజేరియన్లు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయంటే  ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ముహుర్తపు డెలివరీలు చేయవద్దని ఆదేశాలిచ్చినా ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు లైట్ తీసుకుంటూ సిజేరియన్లు చేస్తున్నట్టు బహిరంగంగానే చర్చ జరుగుతుంది. 

సిజేరియన్లపై కలెక్టర్ సమీక్షలు

ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యధిక శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, వాటిని నివారించే దిశగా జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలంటూ కలెక్టర్ ఆదర్శ్ సురభి గత నెల 28న, జూలై 2న వేర్వేరుగా సమీక్ష సమావేశాన్ని పెట్టి ఆదేశాలను జారీ చేశారు. ప్రైవేట్ దవాఖానల్లో కాకుండా ప్రభుత్వ దవాఖానలో అత్యధిక ప్రసవాలు జరిగేలా చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. క్రమంతప్పకుండా ప్రైవేట్ ఆసుపత్రు లను సందర్శించి సిజేరియన్ కేసులపై ఆరా తీయాలని, అవసరం లేకున్నా సిజెరియన్ చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని జిల్లా వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. 

అనవసరంగా సిజేరియన్ చేస్తే చర్యలు  

అనవసరం సిజెరియన్లు చేసే దవాఖానలపై ప్రత్యేక నిఘా ను ఏర్పాటు చేశాం. కలెక్టర్ ఆదేశాల మేర కు ఇటీవల జిల్లా కేం ద్రంలోని అత్యధికంగా ప్రసవాలు, సిజేరియన్లు జరుగుతున్న ఆసుప త్రులకు నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చిన తరువాతా సిజేరియన్లు ఎక్కువగా  చేసినట్టుతై ఆ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుం టాం. ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు. సేవలు ఉపయోగించుకోవాలి. 

 శ్రీనివాసులు, అదనపు జిల్లా వైద్యాధికారి, వనపర్తి