calender_icon.png 15 November, 2024 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపు నిండుగా..

15-11-2024 12:00:00 AM

అసలే చలికాలం పైగా కార్తీక మాసం.. ఇంట్లో నాన్‌వెజ్ బంద్.. చలికాలంలో కొంచెం స్పైసీగా, ఘాటుగా ఉంటేనే నోట్లోకి ముద్ద దిగుతుంది. లేదంటే.. రోజంతా ఉపవాసంగా ఫీల్ అవుతారు.. అలా కాకుండా కొంచెం ఘాటుగా.. కారం కారంగా ఉండాలంటే ఈ వెజ్ రైస్‌లను ట్రై చేయండి. రుచితో పాటు ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తారు. మరెందుకు ఆలస్యం కడుపు నిండుగా లాగించేసేయండి.. 

స్వీట్ కార్న్ రైస్

కావాల్సిన పదార్థాలు:  స్వీట్ కార్న్-ఒక కప్పు, ఉడికించిన అన్నం-రెండు కప్పులు, ఉల్లిపాయలు-ఒకటి, అల్లం, వెల్లుల్లి పేస్ట్-కొద్దిగా, మసాలా దినుసులు-లవంగాలు, యాలకులు, కొద్దిగా సజీర, ఒక బిర్యాని ఆకు సువాసన కోసం, కారం-కొద్దిగా, పసుపు-చిటికెడు, నెయ్యి-రెండు చెంచాలు, నూనె-ఒక చెంచా, ఉప్పు కొత్తిమీర-కొద్దిగా. 

తయారీ విధానం:  ముందుగా స్వీట్ కార్న్‌ని బాగా ఉడికించుకోవాలి. అన్నం కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌపై పాత్ర పెట్టి దాంట్లో రెండు చెంచాల నెయ్యి, మసాలా దినుసులు వేసి వేయించాక.. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టాలి. ఉల్లిపాయలు మగ్గాక చిటికెడు పసుపు, అల్లం ముద్ద, స్వీట్ కార్న్ వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కాసేపటి తర్వాత ఉడికించిన అన్నం వేసి కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్వీట్ కార్న్ రైస్ రెడీ. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 

 సందేపాగు లావణ్య, వనపర్తి

జిరా రైస్

కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం-రెండు కప్పులు, జిలకర్ర-ఒక చెంచా, ఎండు మిరపకాయలు-రెండు, కరివేపాకు-ఒక రెమ్మ, పచ్చిమిరపకాయ-రెండు, ఇంగువ-చిటికెడు, పసుపు-కొద్దిగా, ఉప్పు-రుచికి సరిపడా, నూనె-రెండు చెంచాలు. నిమ్మకాయ రసం-సగం చెంచా, కొత్తిమీర, పుదీనా-తరిగినవి సగం కప్పు. 

తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో నూనె వేసి చేసి, జిలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, పసుపు వేసి బాగా వేయించాలి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత నానబెట్టిన బియ్యం, నీరు, ఉప్పు, నిమ్మకాయ రసం వేసి బాగా కలపాలి. అలా అన్నం మగ్గిన తర్వాత స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చివరగా కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని కంబినేషన్‌గా ఆలూ కుర్మా, రైతతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. 

 వల్లాల సుమలత, హైదరాబాద్ 

బగారా రైస్

కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం-రెండు కప్పులు, బిర్యాని ఆకులు-రెండు, లవంగాలు-ఐదు, అనాస పువ్వు-ఒకటి, దాల్చిన చెక్క-రెండు, యాలకులు-మూడు, నల్ల మిరియాలు-సగం చెంచా, అల్లం, వెల్లుల్లి ముద్ద--ఒక చెంచా, పచ్చిమిర్చి-రెండు, నెయ్యి-ఒక చెంచా, టొమాటో-ఒకటి, నూనె-కొద్దిగా, ఉప్పు-తగినంత. 

తయారీ విధానం: స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి దాంట్లో నూనె, నెయ్యి వేయాలి. తర్వాత అందులో లవంగాలు, యాలకులు, పలావ్ ఆకులు, జీలకర్ర, అనాస పువ్వు, మిరియాలు వేసి కలపాలి. తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి. ఇవి బాగా వేయించిన తర్వాత సరైన మొత్తంలో నీరు, ఉప్పు వేసి మూత పెట్టి మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగాక బియ్యం వేసి ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకుం టే సరిపోతుంది. బగా రా అన్నంలోకి గుత్తివంకాయ కూర బాగా బాగుంటుంది. 

 మచ్చ లక్ష్మి, తార్నాక

పన్నీర్ పలావ్

కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం-ఒక కప్పు, ఉల్లిపాయలు-ఒకటి, పచ్చిమిర్చి-రెండు, పన్నీర్-సగం కప్పు, క్యారెట్-ఒకటి, పచ్చి బఠాణీలు-ఒక చెంచా, కారం-సగం చెంచా, అల్లం వెల్లుల్లి పేస్ట్-సగం చెంచా, పులావ్ మసాలాలు-ఒక చెంచా, ఉప్పు-తగినంత, పసుపు- చిటికెడు, గరం మసాలా-సగం చెంచా, కొత్తిమీర, పుదీనా-కొద్దిగా, నెయ్యి లేదా నూనె-రెండు చెంచాలు. 

తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఓ అరగంట సేపు నాన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్‌పై పాత్ర పెట్టి.. అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడి కాగానే.. పన్నీర్ ముక్కలను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పలావ్ దినుసులు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, బఠాణీలు, క్యారెట్ వేసి రెండు నిమిషాలు వేగిస్తే సరిపోతుంది.

ఇవి మగ్గాక పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి ఒక నిమిషాం వేయించాక.. బియ్యం వేసి ఓసారి కలుపుకోవాలి. బియ్యం కొలతకు సరిపడా నీళ్లు, పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి అంతా ఒకసారి కలుపుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా పన్నీర్ ముక్కలు వేసి అంతా ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే పన్నీర్ పలావ్ రెడీ. 

 గొడుగు రమాదేవి, మహబూబ్‌నగర్