మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. యుక్తవయసులోనే పొట్ట సమస్యతో బాధపడుతూ జీవితకాలం బరువును మోస్తున్నారు. స్థూలకాయం వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబపరంగా, అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈరోజుల్లో దాదాపు 40% మంది స్త్రీలు, 20% మంది పురుషులు అధిక బరువును తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధిక బరువు చికిత్స పేరిట లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు. సత్వర ఫలితాల మోజులో క్రాస్ వెయిట్ లాస్ కోర్సులు చేసి బరవును తగ్గించుకుంటున్నారు.
అయితే బరువు తగ్గడం విషయం పక్కనపెడితే.. ఈ క్రాస్ కోర్సుల కారణంగా గుండె, డయాబెటిస్, గురక, క్యాన్సర్, కీళ్లకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇక అధిక బరువుతో కీళ్లు, వెన్నెముక, హెర్నియా, ఆయాసం, శ్వాసకోశ సమస్యలూ స్థూలకాయంతో ముడిపడి ఉంటాయి. మధుమేహం, కొలస్ట్రాల్ లాంటివి స్థూలకాయులపై ప్రభావం చూపుతాయి. గుండె మీద అదనపు ఒత్తిడి పడటం ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని కల్పిస్తుంది. బరువు తగ్గించుకునే క్రమంలో స్టెరాయిడ్స్, ఇన్సులిన్ మొదలైన మందులు వాడేవారిలో ఆకలి వేసి మరింత బరువుకు దారితీస్తుంది. మరో ముఖ్యవిషయం ఏమిటంటే.. కిడ్నీ, లివర్, గుండెజబ్బుల కారణంగా శరీరంలో నీరు చేరి స్థూలకాయం భ్రమను కలిగిస్తుంది.
ఈ జాగ్రత్తలతో..
జీవనశైలిలో కొన్ని కొన్ని మార్పులు చేస్తే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు. క్రమం తప్పకుండా కూరగాయలు, ఆకుకూరలు తినాలి. రైస్‌ను తక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామాలు చేయడం వల్ల అధిక బరువు నియంత్రణలోకి వస్తుంది. మైదాతో చేసిన బేకరీ ఫుడ్స్ తినకూడదు. ఆయిల్ వాడకం కూడా తగ్గించాలి. భోజనం చేసిన తర్వాత ఒక గంట తర్వాత నీళ్లు తాగాలి. తినడానికి అరగంట ముందు మాత్రమే పండ్లు తినాలి.
లంచ్, డిన్నర్ మధ్యలో గ్రీన్ టీ తాగొచ్చు. ఉదయాన్నే తేనెతో కలిపిన నిమ్మరసం తాగాలి. ఎగ్స్‌లో ఎల్లో మానేసి వైట్ మాత్రం తినాలి. వీటితో పాటుగా కొవ్వును కరిగించడానికి ఒక అరగంట రన్నింగ్ చేస్తే ఫలితం ఉంటుంది. రన్నింగ్ చెయ్యలేనివారు స్టెప్స్ ఎక్కడం, బయటకు వెళ్లేటప్పుడు నడవడం, స్విమ్మింగ్, లేదా డాన్సింగ్ లేదా గేమ్స్ ఆడటం లాంటివి చేయాలి.
ఇలా తగ్గొచ్చు
వివిధ రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటిన్, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. క్యాలరీలు బర్న్ చేయడానికి, కండరాన్ని పెంపొందించడానికి ఏరోబిక్ వ్యాయామం (జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి) అవసరం. వెయిట్ లిఫ్టింగ్‌తో జీవక్రియను పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నప్పటికీ, అతిగా తినకూడదు. అధికస్థాయి ఒత్తిడి వల్ల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. ధ్యానం, యోగా శ్వాస వ్యాయామాలు చేయాలి. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి.
డా. ముచ్చుకోట అఖిలమిత్ర