10-04-2025 02:15:36 PM
ప్రతి అంశంపై అవగాహన ఉండాలి
చోరీకి గురి అయిన 100 ఫోన్ లను తిరిగి ఇచ్చేసిన జిల్లా ఎస్పీ డి.జానకి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సెల్ ఫోన్ లే కదా కొట్టేద్దాం... ఉపయోగించుకుందాం అనే ఆలోచన ఎవరికి రాకూడదని తప్పు చేసి బాధపడితే వచ్చే ఉపయోగం ఏముంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్(CEIR) పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితులకు పోలీసు కార్యాలయం కవాతు మైదానంలో జిల్లా ఎస్పీ డి.జానకి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మొబైల్ ఫోన్లు చోరీకి గురైన పౌరులు CEIR (Central Equipment Identity Register) పోర్టల్ ద్వారా తమ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని వివరించారు. చోరీ జరిగిన వెంటనే సీఈఐఆర్(CEIR) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో మొబైల్ ఫోన్‌లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించవచ్చని, ఇది ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రగతిశీల టెక్నాలజీపై ఆధారపడిన ఒక గొప్ప సాధనమని చెప్పారు.
సైబర్ క్రైమ్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్పీ స్వయంగా సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ(OTP) మోసాలు, బ్యాంకింగ్ మోసాలు వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. ప్రజలలో ఉన్న అవగాహన స్థాయిని అంచనా వేయడానికి ఎస్పీ పలు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు సరిగా సమాధానాలు చెప్పిన ఎలికిచర్ల గ్రామానికి చెందిన అడ్డకల శివుడు బెస్ట్ సిటిజన్ ప్రశంస పత్రాన్ని ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఇంచార్జ్ ఎస్సై రాఘవేందర్ ఆధ్వర్యంలో సీఈఐఆర్(CEIR) ద్వారా ఫోన్లను గుర్తించి రికవరీ చేయడంలో విశేష కృషి చేశారని, వారి సేవలకు గుర్తింపుగా జిల్లా ఎస్పీ వారిని క్యాష్ రివార్డుతో సత్కరించారు.