05-04-2025 12:48:33 AM
వాషింగ్టన్, ఏప్రిల్ 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలు ఆ దేశ స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందన్న భయాలు నెలకొనడంతో అగ్రరాజ్యం మార్కెట్లు గురువారం కుప్పకూలాయి. ఎస్‌ఆండ్‌పీ 500 సూచీ 4.8 శాతం, నాస్డాక్ సూచీ 6 శాతం నష్టపో గా, డోజోన్స్ ఇండస్ట్రియల్ సగటున 1,679 పాయింట్లు నష్టపోయింది.
ఎస్‌అండ్‌పీ, డోజోన్స్ సూచీల పతనంతో సుమా రు 2 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైందని ఇండెక్స్ సీనియర్ విశ్లేషకుడు హూవార్డ్ సిల్వర్‌బ్లాట్ పేర్కొన్నారు. ముడి చము రు మొదలుకొని ప్రధాన టెక్ కంపెనీల షేర్లు పడిపోయాయి. 2020 కొవిడ్ ప్రభావం తర్వాత అగ్రరాజ్య మార్కెట్లు ఇంత లా పతనం కావడం ఇదే తొలిసారి.
డాలర్ విలువతోపాటు ఇప్పటివరకు పరుగులు తీసిన బంగారం ధర నేలచూపులు చూసింది. ఇదిలా ఉంటే ప్రతీకార సుంకాల వల్ల ఈ ఏడాది అమెరికా వృద్ధిరేటు 2శాతం తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం 5 శాతం పెరుగనుందని యూబీఎస్ అభిప్రాయపడింది.
నష్టాల బాటలో ప్రపంచ మార్కెట్లు
అమెరికా ఆర్థిక మాంద్యం భయం వెంటాడంతో ఆసియా- పసిఫిక్ మార్కెట్లు కూడా నష్టాల్లో పయనించాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్‌ఎక్స్ 2.06 శాతం, జపాన్ నిక్కీ 2.67 శాతం, హాంకాంగ్ హోంగెసెంగ్ 1. 55 శాతం నష్టంతో ముగిశాయి. ఈ ప్రభావం బిలియనీర్లనూ వదల్లేదు. ప్రపంచ వ్యాప్తంగా 500 మంది కుబేరులకు సంబంధించిన 208 బిలియన్ డాలర్ల (రూ.17లక్షల కోట్లకుపైగా) సంపద ఆవిరైంది. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సహా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వంటివారు పెద్ద మొత్తంలో నష్టపోయారు.
900 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. శుక్రవారం ఉదయం 76,160 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 75,364 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్లు నష్టపోయి 22,904 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్, టా టా మోటార్స్, ఎల్‌అండ్‌టీ, అదానీ పోర్ట్స్ షే ర్లు నష్టాలను చవిచూడగా బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.