calender_icon.png 25 September, 2024 | 2:07 PM

స్టాక్ మార్కెట్ రికార్డు పరుగులు

24-09-2024 12:00:00 AM

  1. మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
  2. 85 వేల పాయింట్లకు చేరువలో సెన్సెక్స్
  3. 26 వేల దరిదాపుల్లో నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లతో సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. గరిష్ఠాల వద్ద సూచీలకు కాస్త అమ్మకాల ఒత్తిడి ఎదురైనప్పటికీ.. రికార్డు గరిష్ఠాల వద్ద ముగియడం గమనార్హం. సెన్సెక్స్ 85 వేలు, నిఫ్టీ 26 వేల మార్కుకు కాస్త దూరంలో నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 84,651.15 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 84,544.31) లాభాల్లో ప్రారంభమైంది.

రోజంతా లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 84,980.58 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ. చివరికి 339.19 పాయింట్ల లాభంతో 84,883.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో 25,939 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.55గా ఉంది.

సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.62 డాలర్లు, బంగారం ఔన్సు 2645 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

రాణించిన వొడాఫోన్ షేర్లు 

4జీ,-5జీ నెట్‌వర్క్ పరికరాల కోసం నోకియా, ఎరిక్‌సన్, శామ్‌సంగ్ కంపెనీలకు రూ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్లు సోమవారం రాణించాయి. ఇంట్రాడేలో 11 శాతం మేర లాభపడ్డ షేరు చివరికి 3.72 శాతం లాభంతో 10.86 వద్ద ముగిసింది.