calender_icon.png 25 September, 2024 | 1:40 AM

కొత్త చరిత్ర సృష్టించిన స్టాక్ సూచీలు

25-09-2024 12:00:00 AM

  1. సెన్సెక్స్ @85,000 
  2. నిఫ్టీ @26,000

  3. 85,000

84,000

83,000

ముంబై, సెప్టెంబర్ 24: భారత్ ప్రధాన స్టాక్ సూచీలు కొత్త చరిత్రను సృష్టించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 85,000 పాయింట్ల స్థాయిని, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26,000 పాయింట స్థాయిని తొలిసారిగా తాకాయి. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్కెట్ అంచనాల్ని మించి వడ్డీ రేటును అరశాతం తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈక్విటీ ర్యాలీకి అనుగుణంగా భారత్ సూచీలు కొద్ది రోజులుగా పరుగు తీస్తున్నాయి.

సెన్సెక్స్ కేవలం 9 ట్రేడింగ్ సెషన్లలో 83,000, 84,000, 85,000 మైలురాళ్లను చేరడం గమనార్హం. బుల్స్ దూకుడు ప్రదర్శించడంతో వారం రోజుల వ్యవధిలోనే భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచి బీఎస్‌ఈ సెన్సెక్స్ మరో కొత్త శిఖరాన్ని అధిరోహించింది. శుక్రవారం జరిగిన భారీ ర్యాలీతో ఒక్క ఉదుటన 1,300 పాయింట్లకుపైగా పెరిగి చరిత్రలో తొలిసారిగా 84,000 శిఖరాన్ని అందుకున్నది.

84,000 పాయింట్ల నుంచి 85,000 స్థాయికి 3 రోజుల్లో ఎగిసింది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలో  సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 85,163 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకి కొత్త రికార్డును నెలకొల్పింది. తదుపరి లాభాల స్వీకరణ కారణంగా  చివరకు 14 పాయింట్ల స్వల్పనష్టంతో 84.914 పాయింట్ల వద్ద వద్ద ముగిసింది.  ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 72 పాయింట్లు ఎగిసి 26,011 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.

చివరకు 1.35 పాయింట్ల లాభంతో 25,940.40 పాయింట్ల వద్ద నిలిచింది. నిఫ్టీ ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. మరో వైపు చైనా కేంద్ర బ్యాంక్ రిజర్వ్ రేషియోను తగ్గించడంతో ఆసియా సూచీలు రెండున్నర ఏండ్ల గరిష్ఠస్థాయికి చేరాయి.  సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు గ్రీన్‌లో ముగియగా, షాంఘై, హాంకాంగ్ సూచీలు గణనీయంగా లాభపడ్డాయి. 

 రికార్డు ర్యాలీ తర్వాత...

స్టాక్ సూచీలు రికార్డు ర్యాలీ జరిపిన అనంతరం స్పష్టమైన దిశను పట్టుకునేందుకు ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతున్నారని, దీంతో స్వల్పస్థాయిలో లాభాల స్వీకరణ జరిగిందని ట్రేడర్లు తెలిపారు. యూఎస్ ఫెడ్ రేట్ల కోతతో కొత్త రికార్డుస్థాయికి సూచీలు దూసుకెళ్లినప్పటికీ, గరిష్ఠస్థాయిని నిలబెట్టుకోలేకపోయాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.

చైనా కేంద్ర బ్యాంక్ ఉద్దీపన ప్యాకేజీతో మెటల్ షేర్లను కొనుగోలు మద్దతు లభించిందన్నారు. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లలో గరిష్ఠస్థాయి వద్ద లాభాల స్వీకరణ జరిగిందన్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు, యూఎస్ ఫెడ్ సరళ వైఖరి, అక్టోబర్‌లో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల కారణంగా మార్కెట్ మూమెంటం కొనసాగుతుందని నాయర్ అంచనా వేశారు.

చైనా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం, యూఎస్ ఫెడ్ నుంచి మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. 

వెలుగులో మెటల్ షేర్లు

పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా బ్యాంక్ రిజర్వ్ రేటును అరశాతం తగ్గించడంతో మంగళవారంనాటి మార్కెట్లో మెటల్ షేర్లు జోరుగా పెరిగాయి. ఆ దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి పునరుత్తేజం కల్గించడానికి చైనా కేంద్ర బ్యాంక్ పలు చర్యల్ని ప్రకటించడంతో లోహాలకు డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేశారు. 

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా స్టీల్  6.5 శాతంపైగా పెరిగి రూ.160 వద్ద ముగిసింది.  జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కోలు కొత్త రికార్డుస్థాయికి పెరిగాయి. పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, మహీంద్రా అండ్ మహీంద్రాలు  2 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు హిందుస్థాన్ యూనీలీవర్ 2.5 శాతం మేర నష్టపోయింది.

అల్ట్రాటెక్ సిమెంట్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టైటాన్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్‌లు 1.5 శాతం వరకూ తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా మెటల్ ఇండెక్స్ 2.78 శాతం పెరిగింది.  పవర్ ఇండెక్స్ 1.38 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 1.18 శాతం, కమోడిటీస్ సూచి 0.75 శాతం, ఇండస్ట్రియల్స్ ఇండెక్స్ 0.47 శాతం చొప్పున లాభపడ్డాయి.

ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.75 శాతం తగ్గింది. టెలికమ్యూనికేషన్స్ ఇండెక్స్ 0.57 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 0.45 శాతం,  ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.40 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.31 శాతం, బ్యాంకెక్స్ 0.30 శాతం మేర క్షీణించాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ సూచి 0.04 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.21 శాతం చొప్పున తగ్గాయి.