calender_icon.png 9 October, 2024 | 6:05 AM

రికార్డు స్థాయికి స్టాక్ సూచీలు

30-08-2024 12:00:00 AM

  1. సెన్సెక్స్ 350 పాయింట్లు జంప్ 
  2. నిఫ్టీ 100 పాయింట్లు అప్

ముంబై, ఆగస్టు 29: ఇండెక్స్ హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ ర్యాలీ జరపడంతో గురువారం స్టాక్ సూచీలు సరికొత్త రికార్డును సృష్టించాయి. రోజంతా పరిమితశ్రేణి కొట్టుమిట్టాడిన మార్కెట్ ముగింపు సమయంలో జోరు చూపించింది.  ఇంట్రాడేలో 500 పాయింట్లు పెరిగి బీఎస్‌ఈ సెన్సెక్స్ 82,285 పాయింట్ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. చివరకు  349 పాయింట్లు లాభంతో 82,134 పాయింట్ల వద్ద  ముగిసింది. ఈ స్థాయిలో ముగియడం కూడా ఇదే ప్రధమం.

అలాగే ఈ సూచీ పెరగడం వరుసగా ఇది ఎనిమిదో రోజు. ఈ 8 ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,710 పాయింట్లు ర్యాలీ చేసింది. ఇదేబాటలో వరుసగా 11వ రోజూ అప్‌ట్రెండ్ సాగించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 140 పాయింట్లు జంప్‌చేసి ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయి 25,193  పాయింట్ల వద్ద నూతన రికార్డు నెలకొల్పింది. తుదకు 99 పాయింట్లు లాభపడి  25,152 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం కూడా ఇదే ప్రధమం. 11 ట్రేడింగ్ రోజుల వరుస ర్యాలీలో నిఫ్టీ 1,012 పాయింట్లు ఎగిసింది. ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లు జరిగాయని ట్రేడర్లు తెలిపారు. 

రిలయన్స్ బోనస్ ప్రకటనతో ఉత్సాహం

డెరివేటివ్ ట్రేడింగ్ ముగింపు రోజున ఒడిదుడుకులకు లోనవుతున్న మార్కెట్‌కు 1:1 నిష్పత్తిలో రిలయన్స్ బోనస్ షేర్ల ప్రకటన ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ షేరుతో పాటు ఇతర ప్రధాన షేర్లలోనూ కొనుగోళ్లు జరిగాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. రిలయన్స్ ఏజీఎంపై వివిధ అంచనాలతో మధ్యాహ్న సెషన్‌లో హెచ్చుతగ్గుల ట్రెండ్ నెలకొన్నదని, కానీ ముగింపు సమయంలో సెంటిమెంట్ మెరుగుపడటంతో సూచీలు రికార్డుస్థాయికి దూసుకెళ్లాయని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. 

టాటా మోటార్స్ టాపర్

సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా టాటా మోటార్స్ 4 శాతం పెరిగింది. బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీం ద్రా, మారుతి, ఎస్బీఐలు 3 శాతం వరకూ లాభపడ్డాయి రిలయన్స్ 2 శాతం మేర పెరిగింది. మరోవైపు మహీంద్రా అండ్ మహీం ద్రా, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్,   కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్‌లు   2 శాతం వరకూ నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.91 శాతం పెరగ్గా, ఎనర్జీ ఇండెక్స్ 0.88 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.58 శాతం, టెలికమ్యూనికేష న్స్ ఇండెక్స్ 0.44 శాతం చొప్పున పెరిగాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.68 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.44 శాతం చొప్పున పెరిగాయి. ఇండస్ట్రియల్స్, యుటిలిటీస్, కమోడి టీస్, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు తగ్గాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.27 శాతం పెరగ్గా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.72 శాతం తగ్గింది.