ఆచార్య మసన చెన్నప్ప :
సుఖానికి పొంగిపోకుండా, దుఃఖానికి కుంగిపోకుండా, మనసును అత్యంత స్థిరంగా ఉంచుకోగల ఉద్ధండులు ఈ కాలంలో చాలా అరుదు. అటువంటి వారిలో చిలుకూరి బాలాజీ దేవాలయం ప్రధాన పురోహితులు ఎం.వి.సౌందర్ రాజన్‌ను ఒకరిగా నాకు దర్శనమిచ్చారు. దీనిని నిరూపించే ఒకానొక సంఘటన గత కొన్ని దశాబ్దాల క్రితమే జరిగింది. దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇటీవలె వారిని కలిసిన సందర్భంలో ఆనాటి ఆ సన్నివేశం నా కళ్లముందు కదలాడింది.
సౌందర్ రాజన్ పరమ వైష్ణవుడేకాక పరమాచార్యుడు కూడా. ఉస్మానియా యూనివర్సిటీలో కామర్స్ శాఖాధిపతిగా, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎ గ్జామినేషన్స్‌గా, రిజిస్ట్రార్‌గా ఆయన పలు పదవులు నిర్వహించారు. అలాగని, విద్యార్థులకు పాఠాలూ చెప్పే బాధ్యతను మాత్రం మానలేదు. వారు తలపాగా ధరించే వారు. తిరునామం దిద్దుకునే వారు. ఆశయ సిద్ధికోసం లక్ష్యశుద్ధితో పనిచేసే వారు. తమిళ సంప్రదాయమే అయినా తెలుగులోను అనర్గళంగా మాట్లాడే వారు. ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, తమిళ భాషల్లోనూ సిద్ధహస్తులు.
సౌందర్ రాజన్ మా ఆచార్యులందరిలోనూ ప్రత్యేకంగా గుర్తింపదగిన వ్యక్తి. చాలా కాలం చి లుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారిగా బాధ్యతలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరుని ఆలయాలలో చిలుకూరు బాలాజీకి ప్రత్యేక గుర్తింపు తేవడంలో వారి పాత్ర వెలకట్టలేనిది. అక్కడ ఎవరికీ విఐపీ దర్శనాలు ఉండవు. వీసా దేవుడిగా ఈ స్వామికి గొప్ప పేరుంది. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం నా అదృష్టం. ఒకసారి హుండీమీద నన్నొక కవిత రాయమంటే ఇలా రాసినట్లు గుర్తు. “దేవుడు కోరడు హుండీ/ భక్తి చూపితే చాలండీ/ పైసలో దేవుడుండడండీ/ మనసులోనే ధ్యానించండి”. వారి పెద్ద కుమారుడు రంగరాజన్ ఒక దళిత సోదరుణ్ణి తన భుజాలమీద ఎక్కించుకుని స్వామి దర్శనం చేయించిన అరుదైన, ఆదర్శవంతమైన ఘటన యావత్ ప్రపంచానికి తెలిసిందే.
సికింద్రాబాద్ పీజీ కళాశాలలో నేను ఆచార్యునిగా పని చేస్తున్నప్పటి రోజులు అవి. అప్పుడు సౌందర్ రాజన్ మా కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉ న్నారు. వారికింద మేం అన్ని ఫ్యాకల్టీలకు సంబంధించి 120 మంది ఆచార్యులం ఉన్నాం. కళాశాల కు వారు ఏనాడూ ఆలస్యంగా రాలేదు. విధులు నిర్వహిచే వేళ మధ్యలో పని విడిచిపెట్టి బయటికి వెళ్లింది కూడా లేదు. ఉదయం 8.30 గం॥లకే క్లాసులు మొదలయ్యేవి. సౌందర్ రాజన్ ఉద యం 8 గంటలకే వచ్చి, 8.30కు క్లాసుకు వెళ్లేవారు. వారికి వరుసగా రెండు క్లాసులు ఉండేవి.
ఆ రోజు అప్పటికి ఒక క్లాసు గడిచింది. అంతలోనే ప్యూను హడావిడిగా వచ్చాడు. సౌందర్ రాజన్ క్లాస్ రూమ్ ముందు ఆగాడు. బయటి నుంచే ఏదో చెప్పబోతుండగా ఆయనే బయటికి వచ్చి అడిగారు ‘ఏమిటని’.
“సార్! మీ కుమారునికి రోడ్డు ప్రమాదం జరిగింది. తలకు పెద్ద గాయమైందట. గాంధీ హాస్పటల్‌లో జాయిన్ చేశారు. కాసేపట్లో ఆపరేషన్ చేస్తారట..”
అక్కడికి దగ్గరే వున్న మా అందరికీ ఈ మా టలు వినిపించాయి. ఆందోళనతో వెంటనే ఆ యన క్లాసు మధ్యలో విడిచి పెట్టి వెళ్లిపోతారనుకున్నామంతా. కానీ, ఆశ్చర్యంగా ఆయనలో ఏ ఆం దోళన, భావోద్వేగమూ మాకు కనిపించలేదు. చాలా స్థిరంగా చెప్పాడు వాచ్‌మన్‌తో.
“.. సరే. అన్నింటికీ భగవంతుడు ఉన్నాడు. తా ను చూసుకోగలడు!” అని వెను తిరిగి క్లాసులోకి ప్రవేశించారు. యథావిధిగా పాఠం చెప్పుకు పోసాగారు.
భారమంతా భగవంతునిపై వేస్తే సరి
మేమంతా నమ్మలేక, అలాగే ఒకరినొకరం చూసుకుంటూ ఉండిపోయాం. ఎలా? అంత షా క్ వార్త విని కూడా ఆయన వెంటనే హాస్పటల్‌కు వెళ్లకుండా ఎలా ఉండగలుగుతున్నారు?! ఆయనకు మేమెవరమూ ఏమీ చెప్పే సాహసం కూడా చేయలేక పోయాం. రెండవ క్లాసు అయ్యాకైనా వెంటనే బయల్దేరి హాస్పటల్‌కు వెళతారేమో అనుకుంటే, ఆ పనికూడా ఆయన చేయలేదు. అప్పటికీ వారి ముఖంలో ఏ మాత్రం భయాందోళన కనిపించక పోవడం మాకందరికీ విచిత్రం అనిపించింది. కన్న కొడుకు ప్రాణాపాయం ఆయనలో ఎలాంటి ఆవేదనను కలిగించడం లేదా? లేక దేవునిపై వారికి వున్న ప్రగాఢ విశ్వాసమా! మాకెవరికీ ఏమీ అర్థం కాలేదు.
గదిలో తలొంచుకొని పని చేసుకుంటున్న వా రి ముందుకు మేం వెళ్లి నిల్చున్నాం మౌనంగా. “హాస్పటల్‌లో డాక్టర్లున్నారు. వారు చేయలేని పని నేను చేయగలనా చెప్పండి? వట్టి గాభరా పడడం తప్ప..” అన్నారు మాకేసి కనీసం చూడనైనా చూడకుండా, మా మనోభావాన్ని అర్థం చేసుకొని.
ఆ రోజు మధ్యాహ్నం తర్వాత ఎప్పుడో, విరా మం దొరికి, సౌందర్ రాజన్ హాస్పటల్‌కు వెళ్లారని తెలిసింది. నిజమే, జరగాల్సింది జరక్క మాన దు. మనం ఏం చేసినా దేనినీ నిలువరించలేం. అలాగని, ఆత్మీయుల కోసం గుండె కొట్టుకోకుండా ఉండగలదా? ఏమో. మన మనసును ఇంత స్థిరంగా, ఆందోళనలకు అతీతంగా వుంచుకోగలగడం ఆయన వంటి వారికే సాధ్యమేమో.