తెలంగాణ రాష్ట ఉద్యమ సమయంలో అనేక డిమాండ్లతో పాటు, తెలంగాణలో విద్యాభివృద్ధికి తోడ్పడే ముఖ్య అంశం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యం గా విద్యార్థులు దీంట్లో ప్రత్యేక పాత్ర పోషించారు. పాఠశాల విద్యార్థుల నుంచి యూనివర్సిటీ విద్యార్థుల వరకు అందరూ ప్రత్యేక పాత్ర పోషించిన విషయం మనకు తెలిసిందే. అయితే, రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన తర్వాత కూడా తెలంగాణలో విద్యా నాణ్యతకు పెద్ద చర్యలు తీసుకుంటున్న సందర్భాలు ఎక్కడా కనిపించడం లేదు. బీఆర్‌ఎస్‌తో పాటు 9 నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతో ఆశతో ఉన్న విద్యార్థులకు చెప్పుకునేటంత గొప్ప పరిణామాలు చోటు చేసుకోలేదు.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ తో పోలిస్తే, విద్యాశాఖకు కేటాయించిన మొత్తం సుమారుగా నాలుగు శాతం ఎక్కువ. ఇది ఇప్పటికైతే చాలా మంచి విషయమైనప్పటికీ, చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అందజేస్తామని చెప్పారు. తెలంగాణలో గత ఐదు సంవత్సరాలలో కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆల్ ఇండియా హ య్యర్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ఐదు సంవత్సరాలలో సగటు 1,123,560 విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదువుతున్నారు.
ఈ విద్యార్థులకు సంవత్సరానికి రూ.5 లక్షలు విద్యా భరోసా కింద ప్రభుత్వం ఇస్తే, రూ. 56,178 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఆచరణకు సాధ్యం కాని విషయం, ఎందుకంటే తెలంగాణ ప్రస్తుత మొత్తం విద్యారంగానికి బడ్జెట్ కేటాయిస్తున్నది రూ. 21,292 కోట్లు మాత్రమే. అంతేకాదు, ఈ బడ్జెట్‌లోనే కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆలోచన మంచిదైనప్పటికీ, ప్రస్తుత బడ్జెట్లను చూసినప్పుడు ఇవి ప్రభుత్వాలు వాస్తవానికి అమలు చేసే ఆలోచనలో ఉండవని కనబడుతుంది. .
కాబట్టి, ఐదు లక్షల ఆశల కంటే వాస్తవ దృష్టితో, కనీసం నెలకు రూ. 5,000 చొప్పున ఉపకార వేతనంగా పీజీ చేసే విద్యార్థులకు ఇవ్వడమే బాగుంటుంది. దానితోపాటు, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ.25,000 రూపాయలు ఫెలోషిప్ సదుపాయాన్ని కల్పిస్తే బాగుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టకపోతే, ఇప్పటికే కుదేలైన ఉన్నత విద్యారంగం ఇంకా కిందికి దిగజారి, తెలంగాణలో వచ్చే తరం విద్యావంతులు కరువయ్యే పరిస్థితి కూడా మరికొన్ని సంవత్సరాల్లో మనం చూడగలం.
- అశోక్ ధనావత్