calender_icon.png 25 October, 2024 | 2:56 AM

దుర్గంధం వెదజల్లుతున్న రోడ్లు

25-10-2024 12:08:00 AM

  1. సిద్దిపేట బైపాస్ రోడ్ల వెంబడి మాంసం వ్యర్థాల పారబోతతో దుర్వాసన 
  2. ఇబ్బందులు పడుతున్న స్థానికులు

సిద్దిపేట, అక్టోబర్ 24 (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణ శివారులోని బైపాస్ రోడ్లు దుర్గంధం వెదజల్లుతున్నాయి. ప్రతిరోజు చెత్త సేకరణకు వాహనాలు ఇంటింటికీ వెళ్తున్నప్పటికీ ప్రజలు, వ్యాపారులు మాత్రం వ్యర్థాలను పట్టణ శివారున గల బైపాస్ రోడ్డుకు ఇరువైపులా పడేస్తున్నారు. సిద్దిపేటలో మాంసం విక్రయించే వ్యాపారులకు ప్రత్యేకించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులో స్థలం కేటాయించారు.

హైదరాబాద్ రోడ్డులోని హౌసింగ్ బోర్డు కాలనీలో, మెదక్ రోడ్డులోని ఎన్‌జీవోస్ కాలనీలో, కాళ్లకుంట కాలనీలో చికెన్, మటన్, చేపలు.. ఇలా ఒక్కొక్క వ్యాపారానికి అనుగుణంగా కౌంటర్లతో భవ నాలు నిర్మించి అందుబాటులోకి తెచ్చారు. వీటిని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మాం సం ఇతర ప్రాంతంలో విక్రయించవద్దని మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మాంసం విక్రయదారులు వివిధ ప్రాంతా ల్లో విక్రయిస్తున్నారు.

చికెన్, మటన్, చేపల వ్యర్థాలను వ్యాపారులు బైపాస్ రోడ్డులో విచ్చలవిడిగా పారబోస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కుక్కల బెడద పెరుగుతుంది. ఈ రోడ్డు వెంట ద్విచక్ర వాహనాదారులు వెళ్లినప్పుడు కుక్కలు వెంబడిస్తూ దాడి కూడా చేస్తున్నాయి. రోడ్డు పక్కన ఉన్న మాంసం వ్యర్థాలను రోడ్డు పైకి తీసుకొస్తున్నాయి.

ప్లాస్టిక్ పేపర్లు సైతం

సిద్దిపేటలో స్టీల్ బ్యాంక్ పద్ధతి అమ లు చేస్తున్నారు. ఎవరి ఇంట్లో వేడుక జరిగినా ప్లాస్టిక్ వినియోగించకుండా స్టీల్ ప్లేట్లు మాత్ర మే వాడాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. వాటిని వినియోగించేందుకు కొంత మొత్తంలో కిరా యి చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, కొందరు వేడుకలు జరిగినప్పుడు పేపర్ ప్లేట్లు వినియోగిస్తున్నారు. వాటిని చెత్త సేకరణ వాహనానికి ఇవ్వాలంటే ప్లాస్టిక్ పేపర్‌ను వేరు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో తడి, పొడి చెత్తగా వేరు చేయలేక వాటిని మూటలుగా కట్టి బైపాస్ రోడ్డులో పడేస్తున్నా రు.

ఈ మూటలను సైతం కుక్కలు రోడ్డుపైకి లాక్కొస్తున్నాయి. బైపాస్ రోడ్లకు సమీపంలో నివాసం ఉండేవారు దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వ్యర్థాలను పడేయకుండా చూడాలని, కోరుతున్నారు.