- నేటితో ముగియనున్న కులగణనలో మొదటి దశ
- హుస్నాబాద్‌లో సర్వేను పరిశీలించిన మంత్రి పొన్నం
హైదరాబాద్ నవంబర్ 7(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కులగణన స్టిక్కరింగ్ ప్రక్రియ ముమ్మ రం గా సాగుతోంది. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా రెండో రోజైన గురువారం కొనసాగింది. మొత్తం 94,750 మంది ఎన్యుమరేటర్లు కుటుంబాలను గుర్తించే పనిలో నిమగ్నమ్యారు. శుక్రవారం మొదటి దశ పూర్తి కానుంది.
తర్వాత రోజు నుంచి అసలు సర్వే ప్రారంభం అవుతుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గట్ల నర్సింగపూర్‌లో స్టిక్కరింగ్ ప్రక్రి యను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. కులగణనకు సంబంధించి అధికారులు అడిగిన అన్ని వివరాలను చెప్పాలని స్థానికులకు సూచించారు.
ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఇదిలా ఉండగా.. అంబర్‌పేట్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హన్మంతరావు సర్వేలో పాల్గొన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కులగణనలో పాలుపంచుకున్నారు.
ఏ ఒక్క ఇంటిని కూడా వదలొద్దు: సీఎస్
సమగ్ర కుటుంబ సర్వేలో ప్రతి కుటుంబం పాల్గొనేలా విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారుల ను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. గురువారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణపై ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా కలిసి ప్రత్యేకాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కులగణన లో ఏ ఇంటినికూడా వదలకుండా సర్వే చేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వేను పరిశీలించడంతో పాటు, కలెక్టర్లు, నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించా లన్నారు.
వివరాలను కం ప్యూటరైజ్ చేయడానికి సుశిక్షితులైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుండటంతో సీఎం ప్రత్యేకంగా సర్వేను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.