- ఏబీసీ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు
- హైకోర్టుకు జీహెచ్‌ఎంసీ రిపోర్ట్
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): వీధి కుక్కల సంఖ్య నియంత్రణకు స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ బుధవారం హైకోర్టుకు నివేదించిం ది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) నిబంధనలు-2023 ప్రకారం చర్యలు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవట్లేదని, ఆహారం లేక అవి మనుషులపై దాడి చేస్తున్నాయంటూ వనస్థలిపురానికి చెందిన ఎంఈ విక్రమాదిత్యతోపాటు పత్రికా కథనాల ఆధారంగా దాఖలైన పిల్స్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఏబీసీ నిబంధనల వీధికుక్కల సంఖ్యను తగ్గించడంతోపాటు యాంటీ రేబిస్ వ్యాధి నివారణకుగాను జంతు జనన నియంత్రణ(ఏబీసీ), యాంటీ రేబిస్(ఏఆర్) కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని జంతు మొత్తం 898 సంరక్షణ కేంద్రాలు (కెన్నెల్స్), 92 బోన్లు ఉన్నాయని చెప్పారు. కెన్నెల్స్, బోన్లలో దాదాపు 2,164 వీధి కుక్కలను ఉంచే సామర్థ్యం ఉందన్నారు. రోజుకు 433 వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేయవచ్చని, వాటికి 5 రోజులపాటు సంరక్షణ చర్యలకు ఏర్పాట్లు చేశామని, సంబంధించిన ఫొటోలను సమర్పించారు.
సుమారు 2 వేలకుపైగా వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసినట్టు తెలిపారు. ఏబీసీ, ఏఆర్ కార్యక్రమం కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 5 జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వాదనలను విన్న ధర్మాసనం జీహెచ్‌ఎంసీ నివేదికపై అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
శంషాబాద్‌లో 51 పంచాయతీల విలీనంపై వివరణ ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): శంషాబాద్ మున్సిపాలిటీలో చుట్టు పక్కల 51 గ్రామ పంచాయతీలను విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీచే సింది. విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్ 3ను సవాలు చేస్తూ మాజీ సర్పంచి జీ పద్మావతి మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీ సంజన వాదనలు వినిపిస్తూ పట్టణీకరణతో సహజ జీవనానికి ఇబ్బందులు ఎదురవుతాయని, జీవన వ్యయం పెరిగిపోతుందన్నారు.
పట్టణీకరణ పేరుతో గ్రామీణ వాతావరణం దెబ్బతింటుందని, పన్నుల పెంపు ఉంటుందని చెప్పారు. అభివృద్ధి పేరుతో కంటితుడుపు చర్యలు చేపట్టి పన్నులు పెంచుతు న్నారని ఆరోపించారు. వాదనలను విన్న ధర్మాసనం పురపాలకశాఖ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులు, న్యాయ శాఖ కార్యదర్శి, పురపాలకశాఖ డైరెక్టర్, రంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేసిం ది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.