calender_icon.png 28 December, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశ్రామిక పార్క్‌కు అడుగులు

03-12-2024 12:38:35 AM

  1. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి పరిధిలో 826.25 ఎకరాల భూసేకరణకు సిద్ధం 
  2. శని, ఆదివారాల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ 
  3. అభ్యంతరాలకు 2 నెలల సమయం 
  4. తాండూరు డివిజన్ సబ్ కలెక్టర్‌కు భూసేకరణ బాధ్యత 
  5. మౌలిక వసతుల కల్పన బాధ్యత టీజీఐఐసీకి.. 

వికారాబాద్, డిసెంబర్ 2(విజయక్రాంతి): సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని దుద్యాల మండలం లగచర్లలో  చేపట్టదలిచిన ఫార్మాసిటీ ఏర్పాటు వివాదాస్పదమవడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

అయితే ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేలా సీఎం రేవంత్‌రెడ్డి లగచర్ల, హకీంపేట్ గ్రామాల పరిధిలో ఫార్మాసిటీకి బదులుగా బహుళార్థక సాధక పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే పారిశ్రామికవాడకు సంబంధించిన భూసేకరణ పనులపై అధికారులు వేగం పెంచారు.

భూసేకరణకు శనివారం రోజు తొలి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం ఆదివారం మరో నోటిఫికేషన్ ఇచ్చింది. లగచర్ల, హకీంపేట్ గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల భూమి సేకరించనున్నట్లుగా శనివారం నాటి నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. లగచర్ల గ్రామ పరిధిలో 497 ఎకరాలు, హకీంపేట్‌లో 146.34 ఎకరాల భూమి సేకరించనున్నారు.

ఆదివారం విడుదల చేసిన మరో  నోటిఫికేషన్‌లో పోలెపల్లి, లగచర్ల గ్రామాల్లో మరో 182.31 ఎకరాలు సేకరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో లగచర్లలో 110.32 ఎకరాలు, పోలెపల్లిలో 71.39 ఎకరాలున్నాయి. ఈ  రెండు నోటిఫికేషన్ల ద్వారా లగచర్ల, హకీంపేట్, పోలెపల్లి పరిధిలో మొత్తం 826.25 ఎకరాలు సేకరించనున్నారు.

25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

సీఎం రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్ధేశంతో ఉన్నారు. ందులో భాగంగానే మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దుద్యాల మండలంలోని లగచర్ల, పోలెపల్లి, హకీంపేట్ గ్రామాల నిరుద్యోగ యువతతో పాటు నియోజకవర్గంలోని ఇతర గ్రామాల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.  ఈ ఐదేళ్లలో 25 వేల మందికి టెక్సైటైల్ తదితర రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సీఎం ఉన్నట్లు చెబుతున్నారు.

టీజీఐఐసీకి మౌలిక వసతుల కల్పన బాధ్యతలు..

మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్‌కు అవరమైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీజీఐఐసీ)కు అప్పగించింది. భూసేకరణ ప్రక్రియ అనంతరం భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించే పనులను ఈ సంస్థ చేపట్టనుంది.

భూములు కోల్పోనున్న వారికి నష్ట పరిహారంతోపాటు ఉపాధి, పునరావాసం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం ఏ విధమైన పరిహారం, పునరావాసం కల్పించనుందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. 

ప్రతిపాదిత ప్రాంతాల్లోనే..

ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలనుకున్న లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి రెవె న్యూ గ్రామాల పరిధిలోనే ఈ ఇండస్ట్రీయల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు తీవ్ర వివాదాస్పదమైన నేపథ్యంలో వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వాటి స్థానంలో పారిశ్రామిక పార్క్ ని ర్మాణం చేపట్టాలనే పట్టుదలతో ఉంది.

మల్టీపర్పస్ ఇండస్ట్రీయల్ పార్క్‌కు సేకరించ నున్న భూములకు సంబంధిం చిన సర్వేనెంబర్లు, రైతుల పేర్లు, భూ విస్తీర్ణం తదితర వివరాలను నోటిఫికేషన్లలో క్లుప్తంగా పేర్కొన్నారు. భూ సేకర ణకు సంబంధించిన అధికారిక ప్లాన్‌ను రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చూడొచ్చని తెలిపారు. నోటిఫికేషన్‌లో ఉన్న సర్వే నంబర్లలో ఏ భూమిలోకైనా ప్రవేశించి..

భూమిని సర్వే చేసి లెవెల్స్ తీసుకునేందుకు, బోరు వేయడం వం టి పనులు చేపట్టేందుకు తాండూరు సబ్ కలెక్టర్‌కు ప్రభుత్వం అధికారం కట్టబెట్టింది. నోటిఫికేషన్ జారీచేసిన నాటి నుంచి ఆ భూములపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేదని స్పష్టం చేశా రు.అభ్యంతరాలుంటే.. నోటిఫికేషన్ విడుదలైన 60 రోజుల్లోగా  కలెక్టర్ దృష్టికి తేవాలని పేర్కొన్నారు.