calender_icon.png 21 March, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డోర్నకల్-గద్వాల రైల్వేలైన్‌కు అడుగులు

21-03-2025 01:09:44 AM

  1. ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతి ఇచ్చిన రైల్వేశాఖ 
  2. సింగరేణి బొగ్గు, మిర్యాలగూడ నుంచి సిమెంట్,
  3. బియ్యం రవాణాకు అనుకూలం 
  4. బెంగళూరు-ఢిల్లీ మధ్య మరో ప్రత్యామ్నాయ రైల్వేమార్గం

హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): తెలంగాణలో రైల్వేమార్గం ఎరు గని జిల్లా కేంద్రాలకు మంచిరోజులు రాబోతున్నాయి. సూర్యాపేట, నాగర్‌కర్నూలు, వనపర్తి, ములుగు, నిర్మల్, సంగారెడ్డి, భూపాలపల్లికి ఇప్పటికీ రైల్వే సదుపాయం లేదు. వీటికి వివిధ మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు కావాలని ప్రజలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇందులో కనీసం  మూడు జిల్లాలకు రైల్వేమార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. డోర్నకల్ జంక్షన్  నుంచి గద్వాల జంక్షన్ వరకు కొత్తగా రైల్వేలైన్ నిర్మించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఫైనల్ లొకేషన్ సర్వే(ఎఫ్‌ఎస్‌ఎల్) పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైలుకూత కోసం ఎదురుచూస్తున్న సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లా కేంద్రాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది.

గద్వాల-మాచర్ల పోయి..డోర్నకల్ వచ్చె

నిజాం పాలన సమయంలోనే రాయచూరు నుంచి గద్వాల మీదుగా ఏపీలోని మాచర్ల (పల్నాడు జిల్లా)కు రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అయితే అనేకమార్లు సర్వే చేసినా ఈ ప్రతిపాదన ముందుకు కదలలేదు. ఈ నేపథ్యంలోనే రైల్వేశాఖ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది.

గద్వాల నుంచి డోర్నకల్ వరకు లైన్ నిర్మిస్తామని ప్రతిపాదించింది. ఆ మేరకు వెంటనే సర్వే కోసం రైల్వేశాఖ ఆదేశాలు కూడా ఇచ్చింది. మధ్యలో సర్వేకు సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు ఎఫ్‌ఎల్‌ఎస్ పూర్తయినట్లు అధి కారులు వెల్లడించారు.

సుమారు 296 కి.మీ. మేర రూ.5,330 కోట్ల అంచనా వ్యయంతో ఈ లైన్ నిర్మించనున్నారు. ప్రస్తుతం డీపీఆర్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ, టెక్నికల్ రిపోర్ట్‌ను జూలై నాటికి రైల్వేబోర్డుకు సమర్పించనున్నారు. రైల్వేబోర్డు అనుమతిస్తే వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంటుంది.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు...

సికింద్రాబాద్-కాజీపేట-విజయవాడ రైల్వేలైన్‌లో ఉన్న డోర్నకల్ జంక్షన్ రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమై.. కుసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, నల్లగొండ, నాంపల్లి, దేవరకొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, వనపర్తి మీదుగా గద్వాల జంక్షన్ చేరుకోనుంది. ఈ లైన్ నల్లగొండ వద్ద సికింద్రాబాద్-గుంటూరు రైల్వేలైన్‌ను దాటుతూ గద్వాల వద్ద సికింద్రాబాద్-బెంగళూరు లైన్‌లో కలుస్తుం ది.

దీంతో బెంగళూరు, చెన్నై, తిరుపతి నుంచి ఉత్తరాదికి వెళ్లేందుకు మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే గద్వాల నుంచి రాయచూరు వరకు రైల్వే లైన్ అందుబాటులో ఉండటంతో ఖమ్మం, విజయవాడ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి గద్వాల మీదుగా రాయచూరు, మంత్రాల యం, ముంబై వెళ్లేందుకు కూడా దగ్గరి మా ర్గం ఏర్పడుతుంది.

గద్వాల నుంచి ప్రతిపాదించిన గద్వాల-మాచర్ల రైల్వేలైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోయినా ఈ కొత్తలైన్ వల్ల రాయచూరు-గద్వాల-నల్లగొండ వరకు ఈ మార్గంలో వెళ్లి అక్కడి నుంచి మాచర్ల వైపునకు ప్రయాణించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

బొగ్గు సరఫరాకు అవకాశం..

సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేసేందుకు ఈ లైన్ ఎంతో అనుకూలంగా ఉంటుందని ద.మ.రైల్వే అధికారి ఒకరు తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్, రాయచూరు థర్మల్ పవర్‌స్టేషన్, బళ్లారి పవర్ స్టేషన్, రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లకు సింగరేణి నుంచి బొగ్గును తరలించేందుకు ఎంతో అనువైన లైన్‌గా ఇది మారనుంది.

అందుకే ఎవరూ అడగకపోయినా రైల్వేశాఖనే ఈ కొత్త లైన్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం విశేషం. ఇక మిర్యాలగూడ ప్రాంతం నుంచి సిమెంట్, బియ్యం ఎగుమతి చేసేందుకు సైతం ఈ లైన్ ఉపయుక్తంగా ఉంటుం దని భావిస్తున్నారు. కొత్త లైన్ వల్ల రైలు ఎరుగని ప్రాంతాలకు రైల్వేసేవలు అందుబాటు లోకి రావడంతో పాటు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే చాన్స్ ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.