నల్లగొండ,(విజయక్రాంతి): వ్యవసాయ యాంత్రికరణ పథకం పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో రూ. 70 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ భవనంతోపాటు గోదామును భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించి ఆయన మాట్లాడారు. రైతులకు సాగునీటికి ఢోకా లేకుండా ఇప్పటికే నియోజకవర్గంలోని 120 చెరువులను నింపామని పేర్కొన్నారు. ఏకకాలంలో రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఏడాదిలోనే రైతులకు 54 వేల కోట్ల లబ్ధి చేకూరిందని వెల్లడించారు. సంక్రాంతి తరువాత రైతు భరోసా అందించి అన్నదాతలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు.