calender_icon.png 1 April, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు

29-03-2025 12:44:37 AM

కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట. మార్చి 28(విజయకాంతి) : ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని  నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్  ఆదేశించారు. శుక్ర వారం  కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ తో కలిసి పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ కేసులను  పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకుని  బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.   సమావేశంలో డిఎస్పి నల్ల పు లింగయ్య  2023 లో 31, 2024 లో 34, 2025 లో ఇప్పటిదాకా 7 ఎస్సీ ఎస్టీ కేసులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల లో నమోదు అయ్యాయని, వాటిలో 13 కేసులకు గాను 3  కేసులు చార్జిషీట్ కు రెడీగా ఉన్నాయని, 4 కేసులు విచారణ దశలో ఉన్నాయనీ, మరో 6 కేసులకు సంబంధించి డాక్యుమెంట్స్ రావాల్సి ఉందని తెలిపారు.

ఎస్సీ ఎస్టీ  కేసులకు సంబంధించి బాధితులకు నష్టపరిహారం అందించడంలో  బడ్జెట్ కారణంగా ఆలస్యం   జరుగుతుందని సి సెక్షన్ అధికారిని  అఖిల ప్రసన్న  జిల్లా కలెక్టర్ కి తెలిపారు. బడ్జెట్ వచ్చిన వెంటనే రెండు వారాలకోసారి నష్టపరిహారం చెల్లించే విధంగా చూస్తామని ఆమె చెప్పారు. సమావేశంలో గిరిజన సంఘం నాయకులు కిష్ట్యా నాయక్ జిల్లా కేంద్రంలో సేవాలాల్ భవన నిర్మాణానికి స్థలం, నిధులు కేటాయించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదని కలెక్టర్ కు దృష్టికి తీసుకువచ్చాడు. అలాగే బుడగ జంగాల సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణయ్య మాట్లాడుతూ మక్తల్ లోని 5 వ వార్డు పరిధిలో 70 మంది దాకా ఉన్న బుడగ జంగాల పిల్లల కోసం అక్కడి సమీపంలో అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. బుడగ జంగాల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 5వేల బుడగ జంగాల కుటుంబాలు ఉన్నాయని, వారందరికీ పక్కా ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అయితే నిరక్షరాస్యత కారణంగా బుడగ జంగాల పై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు.

స్పందించిన కలెక్టర్ మండలాల వారీగా బుడగ జంగాల కుటుంబాల వివరాలు సేకరించి ఆయా మండలాల తహాసిల్దార్లకు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేయించాలని సూచించారు. మాజీ కౌన్సిలర్ మహేష్ మాట్లాడుతూ.. 1994లో జిల్లా కేంద్రం సమీపంలోని ఎర్రగుట్ట వద్ద దళితులకు ఇచ్చిన భూమి పట్టాలలో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ ను కోరారు. అలాగే పళ్ళ మాల, పళ్ళ హరిజనవాడ లోని  దళితులకు గతంలో ఇచ్చిన 2.28 ఎకరాల యాదగిరి రోడ్డులోని   స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని, దళితుల కోసం ఎర్రగుట్ట మార్గంలోని ప్రభుత్వ స్థలంలో ఒక ఎకరా స్థలాన్ని స్మశాన వాటిక కోసం కేటాయించాలని కోరారు. ఈ విషయమై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.

అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో జరిగే బాబు జగ్జీవన్ జయంతిని, రెండో వారంలో జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహించేందుకు  అధికారులు, ఆయా కుల సంఘాల సభ్యులు సమావేశంలో నిర్ణయించారు. అవుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి అధికారి ఉమాపతి,   ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ  ఖలీల్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, డి డబ్ల్యు ఓ జయ , జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రెడ్డి, గిరిజన సంక్షేమాధికారి శత్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.