12-02-2025 11:24:44 PM
జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ..
హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): హైదరాబాద్ నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. నగర అభివృద్దిలో భాగంగా ప్రతి డివిజన్‌లో ప్రణాళికాబద్దంగా మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయడంలో భాగంగా రహదారులు, పార్కులు, మౌలిక వనరుల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆమె తెలిపారు. బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ రోడ్డులో రూ. 80 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జీహెచ్‌ఎంసీ ద్వారా పునరుద్దరించిన ప్రేమ్‌నగర్ పార్కును మేయర్ గద్వాల విజయలక్ష్మీ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మీ మాట్లాడుతూ... నగరంలోని ప్రధాన అంతర్గత రహదారులను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధులతో తక్షణమే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమయంలో రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలు ఆర్యోగంగా ఉండేలా పార్కులను తీర్చిదిద్దాలన్నారు. పార్కులలో వాకింగ్ ట్రాక్‌లు, గ్రీన్ స్పేస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజలు సైతం జీహెచ్‌ఎంసీ పార్కులను సద్వినియోగం చేసుకుని మంచి ఆరోగ్యవంతులుగా తయారు కావాలని సూచించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి, ఈఈ విజయ్ కుమార్‌తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.